Image result for Khairlanji,"రంగనాయకమ్మ
– 7 –
బానిస యజమానుల కాలం నించీ ‘శ్రమ విభజన’లో తేడాలు ప్రారంభమై పోతాయి. శ్రమల్లో తేడాల వల్లే ‘కుల విధానం’. ఈ ‘శ్రమ విభజన’ని, ‘సమానత్వ శ్రమ విభజన’గా మార్చవలిసిందే. ఆ మార్గం, కొన్ని దశలుగా జరగాలి. ఈ సమాజంలో ఉన్న రాజ్యాంగం, ‘శ్రమ దోపిడీ’తో, ఏ శ్రమలూ లేకుండా సాగే రాజ్యాంగం. ఇది ప్రైవేటు విధానం గానూ, ప్రభుత్వ విధానం గానూ, కూడా ఉండవచ్చు. రెండు విధానాల్లోనూ సాగేది, శ్రామిక వర్గ శ్రమల్ని శ్రమలు చెయ్యని వర్గం దోచడమే. అందులో అతి ముఖ్యంగా, ‘కింది కులాలు’గా స్థిరపడిపోయిన కులాల్ని అత్యధికంగా దోచడమే. రాజ్యాంగం ఎందుకింత క్రూరంగా ప్రవర్తిస్తుం దో, తెలియాలంటే, కొన్ని నిజాలు తెలియాలి. అవి తెలియకపోతే, ఈ రాజ్యాంగాన్ని తీసిపారేయ్యాలని తెలియదు. అది తెలియకపోతే కులవిధానం నించి బైట పడడం ఎలా సాధ్యం? సమాజంలో, ‘శ్రమ దోపిడీ’తో, సౌఖ్యంగా సాగే వర్గం, రాజ్యాలు చేస్తోం టే, ‘ప్రజాస్వామ్యం’ అనీ, ‘న్యాయం’ అనీ, ఎన్ని కోరికలు ప్రకటించినా, అవి అన్నీ నీటిమీద రాతలే. ప్రసార మాధ్యమాలతో పని చేసే కింది కులాలు అత్యల్పం-అని, ఆ అత్యల్ప శాతాన్ని చూపించి, ‘ఎంత కింది సంఖ్యో చూడండి’ అంటున్నారు రచయిత. అది కింది సంఖ్యే. అత్యల్ప శాతమే. అయితే దాన్ని మార్చేది ఎలాగా? ఒక దళిత కుటుంబం మీద ఘోర దురంతాలు జరిగితే, దానికి తోటి దళితులే స్పందించలేదే! ఇంతకన్నా వింత విషయమా, ప్రచార సాధనాల్లో దళితుల సంఖ్య అత్యల్పంగా ఉండడం? దళితులు అలా ఎందుకు ఉన్నారో తెలుసుకోకపోతే, ఈనాడు జరిగేదే, వెయ్యి సంవత్సరాలకైనా జరుగుతుంది.

ఈ రచయిత, కొన్ని చాలా మంచి భావాలు చెపుతున్నారు. అనువాదంలో: ”పాలనా యంత్రాం గంలో, బ్రాహ్మణులకు ఆధిపత్యం ఉందా లేదా అనేది అంత ప్రధానమైంది కాదు. ఆ యంత్రాంగంలో దళితులున్నప్పటికీ, ఏం జరుగుతుందో, ఖైర్లాంజీ లో చూశాం.” శ్రమ దోపిడీ కోసమే సాగే పాలనా యంత్రాంగంలో పదవుల్లో ఉన్న దళితులు, ప్రభుత్వం చెప్పినట్టే నడవాలనుకుంటారు. ఇతరులలాగే లంచాలు తీసుకుంటారు. వాళ్లు కూడా కింది కులాలవారే అయినా, తమ అధికారాల వల్ల, పై కులాలలాగే ఉన్నాం- అనుకుంటారు. ‘అసలు కుల విధానమే వొద్దు’ అని మాత్రం అనుకోరు. కింది కులాలకే రిజర్వేషన్ల హక్కులు ఉంటాయి కాబట్టి, కుల విధానం ఎప్పుడూ ఉండాలనే అనుకుంటారు.

కింది కులాలు, తమ కులాలనే ఇష్టపడితే, పై కులాల వాళ్లకి సమస్యే ఉండదు. అంటే, రిజర్వేషన్లు, కొంత మంచిని (తాత్కాలిక ఉపశమనాన్ని) తెచ్చినా, కొంత కాలానికి వాటిలో సంస్కరణలే లేకపోవడం వల్ల, ‘కుల విధానమే ఉండాలి’ అనే భావాలే గట్టి పడి పోతున్నాయి. కింది కులాలవారు, కుల విధానాన్నే కోరుకుంటూ, రిజర్వేషన్ల ద్వారా పెట్టుబడిదారులుగా కూడా తయారవ్వాలని ఆశిస్తున్నారు. (ఉదా: 2002 నాటి ‘భోపాల్‌ ప్రకటన’, 2005 నాటి ‘భారత దళిత వాణిజ్య, పారిశ్రామిక మండలి ఏర్పాటు’.) ఒక దళితుడు, పెట్టుబడిదారుడైతే, వెయ్యి మంది దళితులు కా ర్మికులైపోరా? అనే ప్రశ్నకి దళితులుజవాబు చెప్పరు.

రచయిత ఆనంద్‌ అభిప్రాయం ఇది: దళిత అధికారులు, తాము, దళిత కులం కన్నా పైస్థాయిలో ఉన్నామని భావిస్తారు. అందుకే నిరుపేద దళితుల పట్ల కనీసపు సానుభూతి అయినా చూపరు. (ఇతర అన్నికులాల్లోనూ జరిగేది కూడా ఇదే. పై స్థాయిలో ఉన్న వాళ్లు, తమ కులాల్లోనే ఉన్న నిరుపేదల్ని పట్టించుకోరనేది వేరే చెప్పనవసరం లేదు. దళితులు కూడా అలాగే చేస్తారు.)

ఇక, ‘కులాల నిర్మూలనని’ కోరేది ఎవరు? ఎవరూ కాదు. కులాల్ని అలాగే పాటిస్తూ ‘సమానులు’ అవగలరా? కింది కులాల ప్రతినిధులు రాజ్యాంగ యంత్రంలోకి చేరితే, కుల విధానం పోతుందా? ఇతర కులాల అధికారులలాగే, తమ దళితుల్ని కూడా వేధించి, లంచాలు లాగే, దళిత అధికారుల్ని, ప్రతీ చోటా చూడగలం. సమాజంలో ఉన్న ‘చెడ్డలు’ పోయి, ‘మంచి’ మార్పులు జరగాల ంటే, వ్యవస్థ మారాలి అనే అర్థంతో చెపుతున్నారు రచయిత. వ్యక్తులు విడివిడిగా ఆ మార్పులు సాధిం చలేరు-అని! ”వ్యవస్థలకి విస్తృతి చాలా ఎక్కువ. వ్యక్తులకు అది చాలా పరిమితం.”- ఇలా మొదలు పెట్టి, రచయిత, చాలా చెప్పారు గానీ, ‘వ్యవస్థ’ అం టే ఏమిటో వివరించలేదు. అమలులో వున్న వ్యవస్థ, శ్రమ దోపిడీని కాపాడేదిగా ఉంటుంది – అని చెప్ప లేదు. అసలు, ‘శ్రమ దోపిడీ’ అనే మాట ఈ రచనలో ఉందో లేదో, చివరి దాకా చూస్తేనే తెలుస్తుంది.

ఆనంద్‌: ”అధికార యంత్రాంగంలో ఉన్న దళితులు, అధికారంలో పైకి వెళ్లే క్రమంలో, తమకు తెలియకుండానే, పై వర్గ స్వభావాల్ని సంతరించుకు ంటారు… తమ వర్గం నుంచి పూర్తిగా తెగ తెంపులు చేసుకుంటారు!”-ఇక్కడ, ‘వర్గాలు’ అన్నారు గానీ, ఈ వర్గాలు ఎందుకు ఏర్పడతాయో, పాఠకులకు అర్ధమయ్యే విధంగా చెప్పలేదు. వర్గాల్ని, శత్రు వర్గాలు అని అ యినా అనలేదు. ‘వర్గాలు’ అన్న వ్యక్తి అయినా, ‘శ్రామిక వర్గం-దోపిడీ వర్గం’ అని తేడాలతో చెప్పాలి.

ఆనంద్‌: ”అంబేద్కర్‌, తన స్వానుభవంలోనే, చదువుకున్న దళితులు మోసం చేశారని వాపోయా రు. దాని వెనక వున్న కారణాల్ని ఆయనెప్పుడూ చెప్పలేదు.”-అంబేద్కరు, ఆ విషయాల్ని ఎందుకు చెప్పలేకపోయాడంటే, ఈ రచయిత గ్రహించిన ‘వర్గాలు’ అనే విషయాల్ని అయినా, అంబేద్కరు గ్రహించలేకపోయాడు అనుకోవాలి.

ఒక దళితుడు కూడా భూస్వామో, పెట్టుబడిదారుడో అయినప్పుడు, తోటి దళితుల్ని కార్మికులుగా చేసుకుంటాడు గానీ, ‘అయ్యో, నాతోటి దళితులు కార్మికులవడమా!’ అని ఆలోచిస్తాడా? కొంచం దయ ఉంటే, కార్మికులకు 1,2 రూపాయల జీతాలు పెంచుతాడు, అంతే!

పై కులాల్లో అయినా అదే జరుగుతుంది. ఒక రెడ్డో, ఒక కమ్మో, పెట్టుబడిదారుడో, భూస్వామో అయినప్పుడు, తన కార్మికుల జీవితాలు మారాలని భావిస్తాడా? ఇది జరగనట్టే, దళిత పెట్టుబడిదారుడి విషయంలో కూడా జరగదు.
‘చదువుకున్న వాళ్లు కూడా మోసం చేశారు’ అని అంబేద్కరు బాధపడ్డాడు గానీ, ఆ ‘చదువులు’ ఎటువంటివో అర్ధం చేసుకున్నాడా? ‘వడ్డీల’ గురించీ, ‘లాభాల’ గురించీ, ‘కౌళ్ల’ గురించీ, వాటిని సాధించాలని చదివిన వాళ్లు, దళితులైనా, ఇతర కులస్తులైనా, ఆ చదువులు అన్యాయం అనీ, వాటికి వ్యతిరేక చదువులు వుండాలనీ, ఎలా గ్రహిస్తారు? ‘వడ్డీల’ వ్యాపారం పెట్టుకున్న దళితుడికి, అసలు ‘వడ్డీ’ అనేది, ఏ శ్రమా పడకుండా, ఇతరుల శ్రమ నించీ లాగే భాగం అని తెలుస్తుందా? – తెలియదు కదా? అప్పుడు ఆ దళితుడు కూడా, తనకు ‘వడ్డీ’, ఎక్కువ రేటుతోనే అందాలనుకుంటాడు. ‘కౌలు’ గురించి అయినా, ‘లాభం’ గురించి అయినా, అవి తన ‘శ్రమ’తో వచ్చేది కాదని తెలియనప్పుడు, అవి మోసాలుగా ఏ కులం వాళ్లకీ తెలీవు.

దోపిడీ సమాజంలో సాగే చదువులు, రకరకాల మోసాలనే నేర్పుతాయి. ఆ మోసాల సంగతి స్పష్టంగా తెలిసి వుంటే, ఆ మోసాలు చెయ్యరు. లేదా, తెలిసి కూడా మోసాలు చేస్తూ వుంటే, ఆ మోసాలకు గురి అయ్యే శ్రామిక జనం, ఆ మోసాలు జరగడానికి అవకాశాలే లేని విధానాన్ని (వ్యవస్థని) అర్ధం చేసుకోవాలి. ఏర్పర్చుకోవాలి. అంబేద్కరు, దళితుల్లో ఉన్నత స్థాయి చదువులు చదివిన వ్యక్తి. కానీ, ఆ చదువులు తప్పనిసరిగా నేర్చుకోవలిసిన విషయాల్ని ఆయనకు నేర్పలేదు. ఆ మంచి విషయాలు, సిద్ధంగానే ఉన్నాయి. అయినా, ఆ మంచి విషయాల మీద తప్పుడు ప్రచారాలు కూడా ఉన్నాయి. ఆ ప్రచారాలు, ఆ ‘మంచిని’ చూడనివ్వకుండా చేశాయి. ఆ ప్రచారాలు అక్రమమైనవని తెలియాలంటే, ముందు ఆ మంచి ఏమిటో తెలుసుకోవాలి గదా?

అంబేద్కరు, తన చదువునే నమ్మి, ‘మంచి’ జోలికి వెళ్లలేదు. ఈ నాయకుడే, ఈ విధంగా వుంటే, మోసాల చదువులే చదివిన సామాన్యులు, ఇంకెలా ఉంటారు? తోటి దళితుల్ని మోసగాళ్లుగా తయారు చేసిన చదువులు ఎటువంటివో, అర్ధం చేసుకోవడం ముఖ్యం కదా?

అయితే ఒక ప్రశ్న! అంబేద్కరు కూడా ఆ రకం చదువులే చదివాడు కదా? తోటి దళితులకన్నా కొన్ని మంచి విషయాలు ఎలా నేర్చుకున్నాడు? అంబేద్కర్‌ నేర్చుకున్నది ఏమిటి? ‘అస్పృశ్యత ఉండరాదు, కుల విధానం ఉండరాదు’ అన్నంత వరకే నేర్చుకున్నాడు గానీ, అవి అసలు ఎలా వచ్చా యో, ఎలా పోవాలో, ఆ విషయాలు నేర్చుకున్నాడా? అంబేద్కరు, గాంధీ-కాంగ్రెస్‌ పార్టీల ద్రోహాల్ని తీవ్రంగా విమర్శించిన వాడే. అయినా, రాజ్యాంగాన్ని రూపొందించే కమిటీకి అధ్యక్ష స్థాయిని ఇవ్వగానే, అది మోసం అని గ్రహించకుండా, అందులోకి చేరాడు. ఇది ‘మంచిని’ నేర్చుకున్నట్టేనా? శతృవర్గాల విషయాలు తెలుసుకోక పోవడం వల్ల, అంబేద్కరైనా, ఇతర దళితులైనా, ఇతర కులాల వాళ్లైనా, కొన్ని పొరపాటు అభిప్రాయాల్లో ఆగి పోయారు.
ఇప్పుడు, సమాజంలో వున్న రాజ్యాంగం ‘శ్రమ దోపిడీ వర్గానికే’ సహకరించే రాజ్యాంగం. దళితులు, తమపైన ఉన్న కులాల వాళ్లలాగే, ఈ రాజ్యాంగంలో కే, ఎమ్మెల్యేలు గానో, ఎంపీలు గానో, మంత్రులు గానో, ముఖ్యమంత్రులు గానో, గవర్నర్లు గానో, ప్రెసిడెంటు గానో ఇలా అధికారులుగా చేరితే, దళిత కులాలన్నీ విముక్తి చెందినట్టు భావిస్తారు. అధికార పదవులు పొందిన వాళ్లు, పేరుకు దళితులుగా ఉంటారే గాని, వాస్తవానికి స్వయంగా శ్రమ దోపిడీ చేసేవారిగానైనా తయారవుతారు, లేదా శ్రమ దోపిడీ మీద బతికే వర్గానికి రాజకీయ ప్రతినిధులుగా నైనా, తయారవుతారు.

ఆనంద్‌: ”భారతీయ సమాజంలో, కులం, వర్గం, విడదీయలేనంతగా కలిసిపోయి ఉన్నాయి” అంటారు ఈ రచయిత. (పేజీ: 94).

కులమూ, వర్గమూ విడదీయలేనంతగా కలిసిపోవడం అంటే అర్ధం ఏమిటి? రచయిత, దీనికి తన అర్ధం చెప్పలేదు. బహుశా, ఆయన అర్ధం, ఒక ‘కులం’లో వారంతా, ఒకే ‘వర్గం’గా ఉంటారు – అని కావొచ్చు. కింది కులాలన్నీ ఒక వర్గమూ, పై కులాలన్నీ ఇంకో వర్గమూ అని! ఇది చాలా పొరపాటు. ఏ కులంలో అయినా, మెజారిటీ సంఖ్య, శ్రామిక వర్గమే. ప్రతీ కులం లోనూ, మైనారిటీ సంఖ్యే, ‘దోపిడీ వర్గం’ గా ఉంటారు. ఒక కులంలో జనం, 2 వర్గాల్లోనూ ఉంటే, ఒక వర్గంలో జనం, అన్ని కులాలవారి గానూ ఉంటారు కదా? ఒక కులం అంతా, ‘ఒకే వర్గం’తో కలిసిపోయి ఉన్నట్టా? ఇలా భావించడం పొరపాటు కాదూ?
సమాజంలో వున్న స్త్రీ పురుష జనాభాలో ప్రతి ఒక్కరూ, కొన్ని శారీరక శ్రమలూ, కొన్ని మేధా శ్రమలూ చేసే సమానత్వ శ్రమ విభజన క్రమంగా తయారైతే, అప్పుడు అందరి శ్రమ విలువలూ సమానమై అందరూ సమానులౌతారు. ఒక మనిషి ఎప్పుడూ ఏదో ఒక శారీరక శ్రమే, ఇంకో మనిషి ఎప్పుడూ ఒక మేధా శ్రమే చేస్తూ ఉంటే, వాళ్లు చేసి శ్రమలకు ‘మారకం విలువలు’ సమానంగా ఉండవు. వాటిలో, ఏవో కింది కింది తేడాలే గాక, ఎక్కువ తేడా లే ఉంటాయి. అటువంటప్పుడు వాళ్లు ‘సమానులు’ ఎలా అవుతారు? వాళ్లు అందరూ, శ్రమలు చేసే వారే అయినా, ఒక్కొక్కరూ ఒక్కొక్క శ్రమే చేసే వారవుతారు. వేరు వేరు వర్గాలుగా ఉండిపోతారు.

(Courtesy Nava Telangana)