• మందుల్లేవు.. పరీక్షలూ లేవు
  • కీలక డెంగీ పరీక్షలూ బయటే
  • పట్టి పీడిస్తున్న డాక్టర్ల కొరత
  • ఖైరతాబాద్‌లోనూ దారుణ స్థితి
  • ఒకప్పుడు ఓపీకి 1500 మంది
  • ఇప్పుడు 200-300 మందే

హైదరాబాద్‌/నల్లగొండ: రాష్ట్రవ్యాప్తంగా డెంగీ, వైరల్‌ జ్వరాలు వీరవిహారం చేస్తున్నాయి! జ్వరం వచ్చిన వెంటనే సాధారణంగా డాక్టర్లు తొలుత ఎవరికైనా ఇచ్చేది డోలో 650, యాంటీ బయాటిక్‌! జ్వరం తీవ్రతను బట్టి డెంగీ, మలేరియా, స్వైన్‌ఫ్లూ తదితర నిర్ధారణ పరీక్షలు రాస్తారు! కానీ, రాష్ట్రంలోనే అతి పెద్ద వెల్‌నెస్‌ కేంద్రమైన ఖైరతాబాద్‌లో ‘డోలో 650’ గోలీలే లేవు. ‘ఈరోజు నుంచి ఇక్కడ శాంపిల్స్‌ తీసుకోబడవు’ అంటూ ఏకంగా నోటీసు అంటించారు. గతంలో ఇక్కడ 1000, 1500కుపైగా ఓపీ నమోదయ్యేది. ఇప్పుడు 200-300కు పడిపోయింది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు వెల్‌నెస్‌ కేంద్రానికి వెళితే కిటకిటలాడేది! డాక్టర్లు మందులు రాస్తే.. నెల రోజులకు సరిపడా ఇచ్చేవారు! పరీక్షల రిపోర్టులు వెంటనే ఇచ్చేవారు! కానీ, ఇప్పుడక్కడ పరిస్థితి పూర్తిగా తిరగబడింది! మందుల కొరత తీవ్రస్థాయిలో పట్టిపీడిస్తోంది. జ్వరం గోలీలు కూడా దొరకని దౌర్భాగ్య పరిస్థితులు నెలకొన్నాయి. బీపీ, షుగర్‌, ఆస్తమా వంటి రోగాలకు ఇచ్చే మందులు కొన్ని నెలలుగా సరఫరా లేదు. వెల్‌నెస్‌ సెంటర్లకు మందులు సరఫరా చేసే ఏజెన్సీ ఈఎ్‌సఐ కుంభకోణంలో చిక్కుకోవడంతో సరఫరా నిలిచిపోయింది. ఈ సెంటర్ల నిర్వహణకు ప్రతి నాలుగు నెలలకు రూ.30 కోట్లు అవసరం. కానీ, ఒక విడతలో రూ.5 కోట్లు.. మరో విడతలో రూ.10 కోట్లు విడుదల చేస్తోంది. సిబ్బంది వేతనాలు పోగా రక్త పరీక్షలు, మందులకు పెద్దగా వెచ్చించలేని పరిస్థితి. జిల్లా కేంద్రాల్లో నడుస్తున్న వెల్‌నెస్‌ కేంద్రాల్లో రోజుకు 100 ఓపీ కూడా రావడంలేదు. హెల్త్‌కార్డులతో ఉద్యోగులు వెల్‌నెస్‌ కేంద్రాలకు వెళితే తూతూమంత్రంగా చూసి నిమ్స్‌కు పంపుతున్నారు. వనస్థలిపురం, కూకట్‌పల్లి కేంద్రాలూ సరైన సౌకర్యాలు లేకుండానే నడుస్తున్నాయి. ఆరోగ్యశ్రీకి పూర్తిస్థాయి సీఈవో లేకపోవడంతో ఆ ట్రస్ట్‌లో ఓ విభాగంగా ఉన్న వెల్‌నెస్‌ సెంటర్లపై పర్యవేక్షణ కరువైంది.

పరీక్షలూ బయటే!
రాష్ట్రమంతా వైరల్‌, డెంగీ జ్వరాలు వణికిస్తున్నాయి. పెద్దసంఖ్యలో ఉద్యోగులు వెల్‌నెస్‌ కేంద్రాలకు వస్తున్నారు. కానీ, అక్కడ సీబీపీ (కంప్లీట్‌ బ్లడ్‌ పిక్చర్‌) తప్ప మిగిలిన ఏ పరీక్షలూ నిర్వహించడం లేదు. ఖైరతాబాద్‌ కేంద్రంలో గత పది రోజులుగా డెంగీ, ఇతర పరీక్షలు నిర్వహించే కిట్లు లేవు. దాంతో, ఎటువంటి రక్త, మూత్ర పరీక్షలూ నిర్వహించడం లేదు. మధుమేహం, థైరాయిడ్‌, కిడ్నీ తదితరాలకు సంబంధించిన కొన్ని పరీక్షలను బయటే చేయించుకోవాల్సి వస్తోంది. సీబీపీ పరీక్ష చేసినా.. రెండు రోజుల తర్వాతే రిపోర్టు వస్తోందని ఉద్యోగులు, జర్నలిస్టులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆ రిపోర్టులు కూడా అందరికీ ఒకేలా వస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్‌లో అయితే వెల్‌నెస్‌ కేంద్రాల

పిళ్లను టీ డయాగ్నస్టిక్‌ కేంద్రాలకు పంపుతున్నారు. అక్కడి నుంచి మరుసటి రోజు కానీ రోగులకు రిపోర్టు అందడం లేదు. ఖమ్మంలో ఈ ఏడాది డెంగీ కేసులు పెద్ద సంఖ్యలో నమోదయ్యాయి. అక్కడి వెల్‌నెస్‌ కేంద్రంలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. వెల్‌నెస్‌ కేంద్రంలో తగినన్ని సౌకర్యాలు లేకపోవడంతో అదే ప్రాంగణంలో ఉన్న జిల్లా ఆస్పత్రిలో వైద్య సేవలు పొందుతున్నారు. మహబూబ్‌నగర్‌లోని వెల్‌నెస్‌ కేంద్రంలో మందు గోలీలకు దిక్కులేని పరిస్థితి ఉంది.

స్పెషలిస్టులు ఏరీ!?
సర్కారీ జీవో ప్రకారం.. ప్రతి వెల్‌నెస్‌ కేంద్రంలో 45 మంది సిబ్బంది ఉండాలి. వారిలో 16 మంది వైద్యులు ఉండాలి. వీరిలోనూ ఆరుగురు స్పెషలిస్టు డాక్టర్లుండాలి. మిగిలిన వారు నర్సులు, ల్యాబ్‌ టెక్నీషియన్లు, ఇతర సిబ్బంది. కానీ, రాష్ట్రవ్యాప్తంగా ఏ వెల్‌నెస్‌ సెంటర్‌లోనూ పూర్తిస్థాయిలో సిబ్బంది లేరు. బాగా నడిచే కేంద్రాల్లో సైతం 25 మందికి మించి సిబ్బంది లేరు. ఇక, జిల్లా కేంద్రాల్లో ఒక్కరంటే ఒక్కరు కూడా స్పెషలిస్టు వైద్యులు లేకుండానే వాటిని నడిపిస్తున్నారు.

బీపీ గోలీలు ఇవ్వడం లేదు
నాకు షుగర్‌, బీపీ రెండూ ఉన్నాయి. వెల్‌నెస్‌ కేంద్రం ఏర్పాటు చేసిన తర్వాత ఇక్కడికే వస్తున్నా. బీపీ మందులు డాక్టర్‌ రాస్తే లేవని ఫార్మసిస్టులు చెబుతున్నారు. కొన్ని మాత్రమే ఇస్తున్నారు. ఎప్పుడు అడిగినా లేవని చెబుతున్నారు.
– మహ్మద్‌ నసీరుద్దీన్‌, రిటైర్డ్‌ ఉద్యోగి, మహబూబ్‌నగర్‌

ఏ పరీక్షలూ చేయడం లేదు
వెల్‌నెస్‌ కేంద్రాలు మేడిపండును తలపిస్తున్నాయి. జ్వరంగా ఉంటే ఖైరతాబాద్‌ కేంద్రానికి వచ్చా. డాక్టర్‌ నాలుగు రకాల పరీక్షలు రాస్తే.. సీబీపీ తప్ప ఇంకేమీ చేయడం లేదు. ఇంతోటి దానికి ఇక్కడి దాకా రావాల్సి వచ్చింది. కనీసం జ్వరం గోలీలు కూడా అందుబాటులో లేకపోవడం దారుణం. ఇక్కడికంతా రిటైర్డ్‌ అయినవాళ్లు వస్తున్నారు. వాళ్లకు షుగర్‌ ట్యాబ్లెట్స్‌ ఇవ్వడం లేదు. మొదట్లో ఆరంభశూరత్వంగా వెల్‌నెస్‌ సెంటర్‌ను నడిపించి కొంత కాలానికే సేవలు తగ్గించేశారు. అన్ని రోగాలకూ ఒకే వైద్యుడితో పరీక్షలు చేయిస్తున్నారు.
– సతీశ్‌ కుమార్‌, ఉద్యోగి, హైదరాబాద్‌

ఎవరూ పట్టించుకోవడం లేదు
వెల్‌నెస్‌ కేంద్రాలు సరిగా నడవడం లేదు. వాటిని బాగు చేయాలని సర్కారును కోరాం. వీటిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టాలి. అసలు ఈహెచ్‌ఎ్‌స పథకమే పక్కాగా లేదు. మందులు కూడా లేవు. డబ్బులు లేవన్న సాకుతో వైద్య ఆరోగ్య శాఖ వీటి గురించి పట్టించుకోవడమే మానేసింది. పూర్తిగా నిర్లక్ష్య ధోరణితో ఉంది. ఈహెచ్‌ఎ్‌స కోసం ప్రత్యేకంగా ఒక అధికారిని నియమించాలి. ఎప్పటికప్పుడు పర్యవేక్షణ ఉండాలి. ఉద్యోగ సంఘాలతో స్టీరింగ్‌ కమిటీ వేయాలి. రివ్యూ చేయాలి.
– కారం రవీందర్‌ రెడ్డి, టీఎన్జీవో అధ్యక్షుడు

పేరుకే వెల్‌నెస్‌ సెంటర్లు
రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి మూలంగా జర్నలిస్టులు అనేక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. అక్రిడిటేషన్‌ కార్డులు సకాలంలో ఇవ్వలేదు. ప్రభుత్వం నిధులు మంజూరు చేయకపోవడంతో కార్పొరేట్‌ ఆస్పత్రుల్లో వైద్యం అందడం లేదు. తాజాగా వెల్‌నెస్‌ సెంటర్లదీ అదే పరిస్థితి. ఆర్థికంగా ఇబ్బందులకు గురయ్యే జర్నలిస్టులకు కంటి తుడుపుగానైనా ఉంటాయనుకున్న వెల్‌నెస్‌ సెంటర్లు పేరుకే పరిమితమయ్యాయి.
– విరహత్‌ అలీ, టీయూడబ్ల్యూజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి

Couretsy AndhraJyothy..