Image result for వారంలో ఖతం"ఎనిమిది రోజుల్లో ముగిసిన ‘దిశ’ కేసు నిందితుల వ్యవహారం
అరెస్ట్‌ నుంచి ఎదురుకాల్పుల దాకా నాటకీయ పరిణామాలు
హైదరాబాద్‌: దిశ హత్య కేసు నిందితుల కథ సరిగ్గా వారంరోజుల్లో ముగిసిపోయింది. అంతకుముందు శుక్రవారం నలుగురు నిందితులు అరెస్ట్‌ కాగా.. ఈ శుక్రవారం ఎదురుకాల్పుల్లో హతమయ్యారు.
*  నవంబరు 27న దిశను కిడ్నాప్‌ చేసి ఆమెపై అత్యాచారానికి పాల్పడి హతమార్చారు. మరుసటి రోజు ఉదయం విషయం బయటికి పొక్కడమే కాకుండా కాలిన స్థితిలో ఆమె మృతదేహం దొరకడం దేశవ్యాప్తంగా కలకలం రేపింది. అదేరోజు పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేయడంతో రాత్రి పొద్దుపోయిన తర్వాత నిందితుల సమాచారం లభించింది.
*  29న అంటే శుక్రవారం మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతంలో నారాయణపేట జిల్లా మక్తల్‌ మండలం జక్లేర్‌ నుంచి ప్రధాన నిందితుడు మహ్మద్‌ ఆరిఫ్‌ను అదుపులోకి తీసుకున్నారు. సాయంత్రానికి గుడిగండ్ల గ్రామం నుంచి మిగిలిన నిందితులు శివ, నవీన్‌, చెన్నకేశవులును అదుపులోకి తీసుకున్నారు. అదేరోజు నిందితుల గురించి ప్రపంచానికి తెలిసింది.
*  30న నిందితులను రిమాండ్‌కు తరలించారు. ఈ సందర్భంగా షాద్‌నగర్‌ ఠాణా వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అప్పటికే బాధిత కుటుంబం ఫిర్యాదు ఇచ్చేందుకు వచ్చినప్పుడు పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లనే దిశ కేసులో తీవ్ర జాప్యం జరిగి ఇంతటి ఘోరం చోటుచేసుకుందనే వార్తలతో సామాన్యుల్లోనూ ఆగ్రహం కట్టలు తెంచుకుంది. నిందితులు షాద్‌నగర్‌ ఠాణాలో ఉన్నారని తెలుసుకొని వేల సంఖ్యలో పోగై పోలీసులపై చెప్పులు, రాళ్లు రువ్వారు. నిందితుల్ని తమకు అప్పగించాలని.. వారిని అక్కడిక్కడే శిక్షించాలని పెద్దఎత్తున నినాదాలు చేశారు. దీంతో పోలీసులు కనాకష్టం మీద నిందితులను జైలుకు తరలించాల్సి వచ్చింది. చర్లపల్లి జైలు వద్ద సైతం నిరసనలు మిన్నంటాయి. దీంతో నిందితుల విషయంలో పోలీసులు గోప్యత పాటించారు.
*  శనివారమే నిందితుల కస్టడీ కోసం పోలీసులు పిటిషన్‌ దాఖలు చేశారు.సోమవారం న్యాయస్థానంలో విచారణ జరిగింది. అయితే విచారణలో ఏం జరిగిందనే విషయాన్ని బయటికి తెలియనీయకుండా పోలీసులు జాగ్రత్తలు తీసుకున్నారు.
*  ఈ నెల 4న అత్యంత రహస్యంగా నిందితుల్ని జైలు నుంచి తమ కస్టడీకి తీసుకున్నారు. బుధ, గురువారాల్లో వారిని రహస్య ప్రాంతంలో విచారించారు.
*  శుక్రవారం తెల్లవారుజామున దర్యాప్తు కోసం వారిని సంఘటన ప్రాంతానికి తీసుకువెళ్లగా ఎదురుకాల్పులు జరిగి నలుగురూ హతమయ్యారు. అలా నిందితులు శుక్రవారమే పోలీసులకు చిక్కి.. తిరిగి శుక్రవారమే హతమయ్యారు.
ఎలా దొరికారు?
దర్యాప్తులో కీలకమైన కాల్‌ రికార్డు
హైదరాబాద్‌: దిశ హత్యోదంతంలో కిరాతకులను పోలీసులు ఎలా గుర్తించారు? ఏ ఆధారాలు నిందితులను పట్టించాయి? ఇప్పుడివే ప్రశ్నలు సర్వత్రా చర్చనీయాంశాలుగా మారాయి. దిశ తన సోదరితో మాట్లాడిన కాల్‌ రికార్డు, లారీ ఈ కేసును ఛేదించడంలో కీలకంగా మారాయి. కాల్‌ రికార్డు ఆధారంగా ఘటన జరిగిన సమయంలో టోల్‌ ప్లాజా దగ్గర లారీ (టీఎస్‌07 యూఏ 3335) ఆగి ఉన్నట్లు గుర్తించారు. మరింత లోతుగా సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలిస్తే ఆ రోజు ఉదయం 10 నుంచి రాత్రి 11 గంటల వరకు లారీ అక్కడే ఉండటం, అందులోని వ్యక్తుల కదలికలు అనుమానాస్పదంగా ఉండటంతో పోలీసుల అనుమానం మరింత బలపడింది. ఆ లారీ యజమాని రంగారెడ్డి జిల్లా షాబాద్‌ మండలం మద్దూరుకు చెందిన శ్రీనివాస్‌రెడ్డిని ఆరా తీశారు. లారీలో ఉన్నది డ్రైవర్‌ ఆరిఫ్‌, క్లీనర్‌ శివ అని తెలుసుకున్నారు. వారిద్దరినీ విచారించగా, నేరాన్ని అంగీకరించడంతో వారితో పాటు మిగిలిన ఇద్దరు నిందితులను అరెస్టు చేసినట్లు తెలుస్తోంది.
(Courtesy Eenadu)