– అమాంతం పెరుగుతున్న ఆర్థిక అసమానతలు
– రానున్న బడ్జెట్‌లో ఈ దిశగా ప్రకటన చేయాలి
– కార్పొరేట్‌ పన్ను తగ్గింపుతో ఒరిగిందేమీ లేదు
– ఆర్థిక మాంద్యం సంకేతాలు అందుతున్నాయి:నోబెల్‌ గ్రహీత అభిజిత్‌ బెనర్జీ

న్యూఢిల్లీ: దేశంలో ఆర్థిక అసమానతలు అమాంతం పెరిగిపోతుండడం పట్ల అర్థశాస్త్రంలో నోబెల్‌ బహుమతి పొందిన అభిజిత్‌ బెనర్జీ ఆవేదన వ్యక్తం చేశారు. కోల్‌కతాలోని టాటా స్టీల్‌ లిట్రెరరీ మీట్‌లో సోమవారం ఆయన మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో దేశంలో మరోసారి సంపద పన్నును (వెల్త్‌ట్యాక్స్‌ను) ప్రవేశపెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని అభిప్రాయపడ్డారు. దేశంలో అసమానతలు అత్యధికంగా ఉన్నాయని పేర్కొన్నారు. సంపదను పున్ణపంపిణీ చేయడానికి రానున్న బడ్జెట్‌-2020 ‘సంపద పన్ను’ను ప్రవేశపెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన అన్నారు. ప్రస్తుతం ఉన్న అసమానతల నేపథ్యంలో వాటిని నిర్మూలించేందుకు సంపద పన్ను విధించడం మంచి చర్య అని సమావేశంలో వివరించారు.

‘1957లో తొలిసారిగా సంపద పన్ను చట్టం తెచ్చారు. వ్యక్తులు, హిందూ అవిభాజ్య కుటుంబాలు, కార్పొరేట్‌ సంస్థలపై (విలువకట్టే సమయంలో) దీనిని అమలు చేయడాన్ని భారత్‌ 2015లోనే నిలిపివేసింది. తక్కువ పన్ను రాబడి.. ఎక్కువ వ్యయాన్ని సాకుగా చూపుతూ అప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్న సర్కారు ఈ పన్నును నిలిపివేసింది. ప్రస్తుత ప్రభుత్వం మళ్లీ దీనిని తెరపైకి తీసుకొస్తుందని విశ్వసిసున్నా” అని ఆయన తెలిపారు. మరోపక్క ప్రభుత్వం తగ్గించిన కార్పొరేట్‌ పన్ను కంపెనీలకు లబ్ధిలేకూర్చినా ప్రభుత్వ లక్ష్యాలను చేరుకోలేదని పేర్కొన్నారు. బ్యాంకింగ్‌ రంగానికి రీఫైనాన్స్‌ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ పథకాలపై అభిజిత్‌ మాట్లాడుతూ.. ‘ప్రభుత్వం అత్యధిక వ్యయంతో కూడిన ‘ఆయుష్మాన్‌ భారత్‌’ వంటి పథకాలు చేపట్టి అమలు చేస్తోంది. దీంతోపాటు స్వచ్ఛభారత్‌, ఉజ్వల పథకాలు కూడా ఖరీదైనవే’ అని పేర్కొన్నారు. వలసలు మంచివేనని అభిజిత్‌ అభిప్రాయపడ్డారు. వలసవచ్చినవారు స్థానికులతో పోటీపడటానికి తమ శక్తిసామర్థ్యాలను పూర్తిస్థాయిలో వినియోగిస్తారని పేర్కొన్నారు. 2013-14 ఆర్థిక సంవత్సరానికి దేశ వ్యాప్తంగా దాదాపు రూ.1,008 కోట్ల మేర సంపద పన్ను వసూలైంది. దీనిని మోడీ సర్కారు ఎత్తివేస్తూ.. కోటి రూపాయలు అంతకంతే ఎక్కువ ఆదాయం కలిగిన మహా సంపన్నులపై 2 శాతం అదనపు సర్‌చార్జీని అమలు చేయాలని ప్రభుత్వ నిర్ణయించిన సంగతి తెలిసిందే.

మాంద్యం దశలోనే సాగుతున్నాం..
దేశంలో ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే భారత ఆర్థిక వ్యవస్థ ఇప్పటికే మాంద్యం దశలోకి జారుకున్నట్టుగా తెలుస్తోందని అన్నారు. అయితే దీనిని నిర్ధారించేలా ఎలాంటి సరైన గణాంకాలు గానీ .. కొలమానాలు మన వద్ద అందుబాటులో లేవని అన్నారు. అందుకే మన ఆర్థిక వ్యవస్థ ఏ దశలో సాగుతోందన్న వాస్తవ విషయం తెలిసిరావడం లేదని అభిప్రాయపడ్డారు. అయితే మన ఆర్థిక వ్యవస్థ ఆర్థిక మందగమనంలోకి జారుకుందనే సూచించేలా పలు సంకేతాలు కనిపిస్తున్నాయని ఆయన అన్నారు. దేశంలో మందగమనం కారణంగా ద్విచక్ర వాహనాల కొనుగోలు బాగా ప్రభావితం అయ్యాయని ఇది కూడా ఆర్థిక వ్యవస్థ మందగమనంలోకి జారుకుందని చెప్పడానికి ఒక సూచిక అని అన్నారు. సంఘటిత రంగం కంటే కూడా అసంఘటిత రంగంలో దీని ప్రభావం ఎక్కువగా ఉందని తెలిపారు.

సంపన్నులకు పన్ను మినహాయింపులా..
కేంద్రంలోని మోడీ సర్కారు కార్పొరేట్‌ పన్నును తగ్గించడాన్ని అభిజిత్‌ ఆక్షేపించారు. ప్రస్తుతం ఆర్థిక వ్యవస్థలో నెలకొన్న మందగమన పరిస్థితులను పారదోలేందుకు గాను సంపన్నులకు పన్ను మినహాయింపులు, తాయిలాలు ఇవ్వడం సరైన చర్య లకాదని అన్నారు. వ్యవస్థలో డిమాండ్‌ పెరిగేలా చర్యలు చేపట్టాలని ఆయన సూచించారు. పేద్దలకు మేలు చేయడం వల్ల ఆర్థిక వ్యవస్థకు మేలు జరిగి అభివృద్ధి కొత్త పుంతలు తొక్కిందనడానికి అర్థశాస్త్రంలో ఎలాంటి ఆధారాలు లేవని ఆయన అన్నారు. కేంద్ర ప్రభుత్వంలోని విధానకర్తలు ఈ విషయాన్ని తెలుసుకొని ఇకనైన సరైన నిర్ణయాలు తీసుకోవాలని ఆయన సూచించారు.

Courtesy Nava Telangana