* పెద్దగట్టు, దేవరశాల గ్రామాల తీర్మానం
* నీటి శాంపిల్స్‌ కోసం వచ్చిన అధికారుల అడ్డగింపు
* తవ్వకాలు జరిపితే తరిమికొట్టండి : మాజీ ఎంపి మిడియం బాబురావు

‘యురేనియం మాకొద్దు.. బతుకులు ఛిద్రం చేయొద్దు..’ అంటూ నల్గొండ జిల్లాలో పలు గ్రామాల ప్రజలు ముక్త కంఠంతో చెబుతున్నారు. ప్రభుత్వాలు మొండిగా ముందుకెళితే ప్రతిఘటిస్తామని, ప్రత్యక్ష ఆందోళనలకు వెనకాడమని హెచ్చరిస్తున్నారు. నల్లమల అడవుల్లో కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన యురేనియం ప్రాజెక్టుతో గ్రామాలకు గ్రామాలే నామరూపాల్లేకుండా పోయే ప్రమాదం ఉందని వారు భయాందోళనలు వ్యక్తంచేస్తున్నారు. పచ్చని గ్రామాల్లో కేంద్ర ప్రభుత్వం చిచ్చుపెట్టాలని చూస్తోందని, ఎవరికో మేలు చేసేందుకు గిరిజనులను బలి చేస్తున్నారని ఆదివాసీ సంఘాల నేతలు మండిపడుతున్నారు. ఆదివాసీ అధికార రాష్ట్రీయ మంచ్‌ అధ్యక్షుడు(ఏఏఆర్‌ఎం), మాజీ ఎంపి మిడియం బాబురావు నల్లగొండ జిల్లా పెద్దగట్టు, దేవరశాల ప్రాంతంలో మంగళవారం పర్యటించారు. ఆయా గ్రామాల ప్రజలతో మాట్లాడారు. తవ్వకాలు చేపట్టేందుకు వస్తే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. ఇప్పటికే నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు నిర్మాణం, అభివృద్ధి కోసం ఈ ప్రాంతంలో లక్షలాది మంది నిరాశ్రయులై తమ అస్థిత్వాన్ని కోల్పోయారన్నారు. శ్రమకోర్చి పచ్చని పల్లెను తిరిగి నిర్మించుకున్నారన్నారు. ఇప్పుడు మానవ వినాశకరమైన యురేనియం వెలికితీత కోసం మరోమారు త్యాగం చేయడానికి వీరు సిద్ధంగా లేరన్నారు. అణు ఖనిజాల పేరుతో ఆదివాసులను ఆగం చేసే, తెలంగాణ నేలను విషతుల్యం చేసే, జీవన చక్రానికి విధ్వంసం కలిగించే యురేనియం ప్రాజెక్టులను అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. మానవ మనుగడతో పాటు జీవజాలాన్ని దెబ్బతీసే హానికరకమైన యురేనియం వెలికితీతను ప్రభుత్వాలు విరమించుకోవాలని డిమాండ్‌ చేశారు. జార్ఖండ్‌లోని జాదుగూడలో, ఆంధ్రప్రదేశ్‌ లోని పులివెందుల ప్రాంతంలో యురేనియం వెలికితీతతో ఆ ప్రాంతవాసులు రకరకాల అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారని వివరించారు. తక్కువ ఖర్చుతో కూడిన జల విద్యుత్‌, పవన విద్యుత్‌, సౌర విద్యుత్‌లాంటి ప్రత్యామ్నాయాలను అభివృద్ధి చేయాలన్నారు. యురేనియం వెలికితీతతో రెండు తెలుగు రాష్ట్రాల ప్రాంతాల్లో నీరు, వాయువు విషతుల్యం అయ్యే ప్రమాదం ఉందన్నారు. తమ ప్రాంతంలో యురేనియం తవ్వకాలకు అంగీకరించే ప్రసక్తేలేదని ప్రజలు తీర్మానం చేశారు. యురేనియం ప్రాజెక్టులో భాగంగా ఎల్లాపురం, కెకెతండా, నంబాపురం, పెద్దగట్టు గ్రామాల్లో నీటి శాంపిల్స్‌ కోసం వచ్చిన అధికారులను ఈ బృందం నాయకులు, పెద్దగట్టు రైతులు అడ్డుకొని వెనక్కి పంపించారు.

 

(Courtacy Prajashakti)