– దేశవ్యాప్తంగా పలు చోట్ల ‘పౌర’ నిరసనలు
– ఢిల్లీలో విద్యార్థుల ఆందోళన
– పశ్చిమబెంగాల్‌, తమిళనాడు, కేరళసహా పలు రాష్ట్రాల్లోనూ..

న్యూఢిల్లీ : దేశంలో పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఆందోళనకారుల నిరసన గళాలు తగ్గడం లేదు. సీఏఏ, ఎన్నార్సీలను నిరసిస్తూ దేశవ్యాప్తంగా పలు చోట్ల ఆందోళనలు కొనసాగాయి. ఢిల్లీలో జామియా మిలియా ఇస్లామియా(జేఎంఐ) యూనివర్సిటీ సహా పలు వర్సిటీల విద్యార్థులు జంతర్‌మంతర్‌ వద్ద ఆందోళనకు దిగారు. పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ.. కోల్‌కతాలో మరో నిరసన ర్యాలీని నిర్వహించారు. సీఏఏ హింసాత్మక ఘటనల్లో ప్రాణాలు కోల్పోయిన మృతుల కుటుంబాలను పరామర్శించడానికి వెళ్లిన కాంగ్రెస్‌ నాయకులు రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీలను మీరట్‌ పోలీసులు అడ్డుకున్నారు. తమిళనాడు, కేరళతో పాటు దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా నిరసనలు జరిగాయి. పలు చోట్ల పోలీసు కేసులు, నిర్బంధాలు, అరెస్టుల పర్వం కొనసాగింది.
సీఏఏ, ఎన్నార్సీలకు వ్యతిరేకంగా ఢిల్లీలో జంతర్‌మంతర్‌ వద్ద విద్యార్థులు ఆందోళన చేపట్టారు. పలు యూనివర్సిటీలు, విద్యాసంస్థలకు చెందిన విద్యార్థులు, నిరసనకారులు ఈ ఆందోళనల్లో అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ‘వురు ది పీపుల్‌ ఆఫ్‌ ఇండియా’ పేరుతో ఈ నిరసన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. సీఏఏ, ఎన్నార్సీలతో పాలు కేంద్ర క్యాబినెట్‌ తాజాగా ఆమోదించిన ఎన్‌పీఆర్‌ను సైతం వెనక్కి తీసుకోవాలంటూ వారు డిమాండ్‌ చేశారు. పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా ఢిల్లీలోని మండి హౌజ్‌ వద్ద నిరసనకారులు పెద్ద ఎత్తున గుమిగూడారు. స్వరాజ్‌ అభియాన్‌ చీఫ్‌ యోగేంద్ర యాదవ్‌ కూడా ఈ ప్రదర్శనలో పాల్గొన్నారు.
పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ.. ఎన్నార్సీ, సీఏఏలకు వ్యతిరేకంగా కోల్‌కతాలో మరో నిరసన ర్యాలీని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్టీ మద్దతుదారులు, కార్యకర్తలు, నిరసనకారులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఎన్నార్సీ, సీఏఏలను రాష్ట్రంలో అమలు చేయబోమని పునరుద్ఘాటించారు. రెండు చట్టాలతో పాటు బీజేపీకి వ్యతిరేకంగా ఆమె నినాదాలు వినిపించారు.

కేరళలోని కన్నూర్‌లో కర్నాటక సీఎం యడియూరప్పకు చేదు అనుభవం ఎదురైంది. ఆయన ప్రయాణిస్తున్న కారును అడ్డుకోవడానికి ఎస్‌ఎఫ్‌ఐ, డీవైఎఫ్‌ఐ కార్యకర్తలు ప్రయత్నించారు. నల్ల జెండాలను ప్రదర్శించి నినాదాలు వినిపించారు. ఈ సందర్భంగా 12 మందిని కస్టడీలోకి తీసుకున్నట్టు పోలీసులు తెలిపారు.
తమిళనాడులో నిరసనలు, ర్యాలీలు పెద్ద ఎత్తున జరిగాయి. సేలం, క్రిష్ణగిరి వంటి ప్రాంతాల్లో వందలాది మంది ఆందోళనాకారులు రోడ్ల మీదకు వచ్చి.. అధిక సంఖ్యలో గుమిగూడి సీఏఏ, ఎన్నార్సీలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. క్రిష్ణగిరిలో పలు ముస్లిం సంఘాలు ర్యాలీకి పిలుపునిచ్చాయి. సీఏఏ, ఎన్నార్సీలను వెనక్కి తీసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా నిరసనకారులు నినాదాలు వినిపించారు. చెన్నైలో డీఎంకే ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన భారీ నిరసన ర్యాలీలో పాల్గొన్న ఆ పార్టీ చీఫ్‌ స్టాలిన్‌, కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు చిదంబరం, ఎండీఎంకే చీఫ్‌ వైకో సహా ఇతర నాయకులు, 8000 మంది డీఎంకే కార్యకర్తలు, మద్దతుదారులపై పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. అసోం సహా ఇతర ఈశాన్య రాష్ట్రాల్లోనూ పౌరసత్వ నిరసనలు జరిగాయి.

ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి : వారణాసి బాలుడి మృతిపై జిల్లా మేజిస్ట్రేటు వ్యాఖ్యలు
ఎన్నార్సీ, పౌరసత్వ హింసాత్మక నిరసనల్లో పోలీసుల దమనకాండ నేపథ్యంలో తొక్కిసలాట జరిగి బలైన వారణాసి బాలుడి మృతిపై ఆ జిల్లా మేజిస్ట్రేటు(డీఎం) బాధ్యతా రాహిత్యంగా మాట్లాడారు. ‘ఇలాంటి విషయాలు ఇక్కడ అలాగే జరుగుతాయి. బాధితుడి కుటుంబం దగ్గరకు వెళ్లి మీరు ఎందుకు సహాయం చేయకూడదు?’ అంటూ మీడియాను డీఎం కౌశల్‌రాజ్‌ శర్మ ఎదురు ప్రశ్నించారు. ప్రధాని మోడీ సొంత నియోజకవర్గమైన వారణాసిలో సీఏఏ, ఎన్నార్సీలకు వ్యతిరేకంగా ఇటీవల జరిగిన ఆందోళనల్లో తొక్కిసలాట జరిగి 11 ఏండ్ల బాలుడు సఘీర్‌ అహ్మద్‌ మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే ప్రధాని మోడీ ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లాలో ఉన్నతాధికారిగా బాధ్యతతలు నిర్వర్తిస్తున్న డీఎం ఇలాంటి వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

మంగళూరు హింసపై సీఐడీ దర్యాప్తు
బెంగళూరు: పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా మంగళూరులో చోటుచేసుకున్న హింసపై రాష్ట్ర సర్కారు సీఐడీ విచారణకు ఆదేశించింది. సీఐడీతోపాటు మెజిస్టీరియల్‌ విచారణ సైతం జరపనున్నట్టు తెలిపింది. ఈ నెల 19న మంగళూరులో సీఏఏకు వ్యతిరేకంగా భారీ సంఖ్యలో ఆందోళనకారులు పలు నిరసన కార్యక్రమాలను చేపట్టారు. ఈ క్రమంలో పోలీసులు, నిరసనకారులకు మధ్య ఘర్షణ నెలకొన్నది. ఇదీ కాస్త హింసకు దారితీసింది. పోలీసుల కాల్పులు జరపటంతో ఇద్దరు పౌరులు ప్రాణాలు కోల్పోయారు. అలాగే రాష్ట్రంలోని ఓ ఆస్పత్రిలోకి పోలీసులు ప్రవేశించి గాయపడిన ఆందోళనకారులపై దాడులు చేయడం, అలాగే ఐసీయూ లోపల టియర్‌ గ్యాస్‌ షెల్స్‌కు సంబంధించిన వీడియోలు వెలుగులోకి రావడంతో ప్రభుత్వంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తిన అనంతరం.. రాష్ట్ర సర్కారు ఈ నిర్ణయం తీసుకున్నది.

రాష్ట్ర సీఎం యడియూరప్ప మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. ‘మంగళూరు ఘటనకు సంబంధించి సీఐడీ, మెజిస్టీరిల్‌ విచారణ రెండూ నిర్వహించాలని నిర్ణయించుకున్నాం’ అని తెలిపారు. రెండు రోజుల్లో దీనికి సంబంధించిన ఉత్తర్వులు జారీ చేస్తామని చెప్పారు. అయితే రెండు రోజుల క్రితం పోలీసు చర్యలను సమర్థిస్తూ యడియూరప్ప వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

మీరట్‌ మృతుల కుటుంబీకులను కలిసేందుకు నో
రాహుల్‌, ప్రియాంకలను అడ్డుకున్న పోలీసులు
ఎనార్సీ, సీఏఏ హింసాత్మక నిరసనల్లో ప్రాణాలు కోల్పోయిన మీరట్‌ మృతుల కుటుంబాలను కలిసేందుకు వెళ్తున్న కాంగ్రెస్‌ అగ్రనాయకులు రాహుల్‌ గాంధీ, పార్టీ జనరల్‌ సెక్రెటరీ ప్రియాంక గాంధీ లను ఢిల్లీ- మీరట్‌ రహదారిపై పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులతో రాహుల్‌, ప్రియాంకలు కొద్ది సేపు వాదించారు. తమను అడ్డుకోవడంపై ఏమైనా ఆదేశాలు ఉన్నాయా? అంటూ పోలీసులను రాహుల్‌ ప్రశ్నించారు. అయినప్పటికీ మీరట్‌లో ప్రవేశించడానికి పోలీసులు ఒప్పుకోకపోవడంతో వారు ఢిల్లీకి తిరుగుపయనమయ్యారు. వారికి పోలీసులు అనుమతిని నిరాకరించడంపై కాంగ్రెస్‌ నాయకులు మీరట్‌లో నిరసనకు దిగారు.

ఆందోళనకు మద్దతు తెలిపిన జర్మన్‌ విద్యార్థిపై బహిష్కరణ వేటు
చెన్నై: పౌరసత్వ సవరణ చట్టానికి (సీఏఏ), ఢిల్లీలో విద్యార్థులపై పోలీసుల లాఠీచార్జీలకు వ్యతిరేకం చెన్నైలో చేపట్టిన ఆందోళనలో పాల్గొన్నందుకు మద్రాస్‌ ఐఐటీలో చదువుతున్న ఒక జర్మన్‌ విద్యార్థిని అధికారులు బహిష్కరించారు. జర్మన్‌లోని డ్రెస్టన్‌కు చెందిన జాకబ్‌ లిండెన్తల్‌ మద్రాస్‌ ఐఐటీలో పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ చేస్తున్నాడు.
దేశాన్ని విడిచిపెట్టి వెళ్లాలని చెన్నైలోని విదేశీయుల ప్రాంతీయ రిజిస్ట్రేషన్‌ కార్యాలయం నుంచి సోమవారం మౌఖిక ఆదేశాలు వచ్చినట్టు తెలిపారు. నిరసనల్లో పాల్గొనడం వీసా నిబంధనలను ఉల్లఘించడమేనని, తక్షణమే భారత్‌ నుంచి వెళ్లిపోవాలని అధికారులు చెప్పినట్టు పేర్కొన్నారు. జాకబ్‌ను తిరిగి పంపించాలనే ఆలోచన కేంద్ర ప్రభుత్వానిదా లేక మద్రాస్‌ ఐఐటీదా అన్న విషయం ఇంకా స్పష్టం కాలేదు. సెమిస్టర్‌ పరీక్షలు ఉన్నప్పటికీ, ఇటు వంటి నిర్ణయం తీసుకోవడం వర్సిటీకే అవమానమని విద్యార్థులు భావిస్తున్నారు. సామాజిక కార్యకర్తలు, విద్యార్థులే కాక రాజకీయ నాయకులు కూడా ఈ నిర్ణయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు. ”ప్రపంచం గర్వించదగ్గ ప్రజాస్వామ్యం మనది. ఏ ప్రజాస్వామ్యం భావ ప్రకటనా స్వేచ్ఛను అడ్డుకోదు. ఈ బహిష్కరణను ఉపసంహరించుకునే విధంగా మద్రాస్‌ ఐఐటికి ఆదేశాలు ఇవ్వాలని, తద్వారా ప్రపంచ దేశాల కన్నా మన దేశం విద్యా ప్రమాణాల్లో అత్యున్నత స్థాయికి చేరుకుంటుందని కేంద్ర విద్యాశాఖ మంత్రి ఆర్‌పి నిశాంక్‌ను కోరుతున్నాను ” అని కాంగ్రెస్‌ ఎంపి శశి ధరూర్‌ ట్వీట్‌ చేశారు.

కర్నాటకలో తొలి నిర్బంధ కేంద్రం..!
ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలకు విరుద్ధంగా కర్నాటక సర్కారు అక్రమ వలదారుల కోసం తొలి నిర్బంధ కేంద్రం(డిటెన్షన్‌ సెంటర్‌)ను ఏర్పాటు చేసింది. బెంగళూరుకు 40 కిలోమీటర్ల దూరంలో నేలమంగళ దగ్గర దీనిని నిర్మించారు. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖ కమిషనర్‌ ఆర్‌ఎస్‌ పెద్దప్పయ్య సైతం ధ్రువీకరించారు. దేశంలో ఎలాంటి నిర్బంధ కేంద్రాలూ లేవని ఎన్నార్సీని ఉటంకిస్తూ రాంలీలా మైదాన్‌లో మోడీ వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అయితే బీజేపీ పాలిత రాష్ట్రమైన కర్నాటకలో యడియూరప్ప సర్కారు నిర్బంధ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం చర్చనీయాంశంగా మారింది.
మరి ముస్లింలను ఎందుకు చేర్చలేదు?సీఏఏపై బీజేపీ నాయకుడు, నేతాజీ బంధువు.. చంద్రబోస్‌ అసంతృప్తి మోడీ సర్కారు తీసుకొచ్చిన వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టంపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్న తరుణంలో… సొంత పార్టీ నేతల నుంచే బీజేపీకి అసంతృప్తి, విమర్శలు ఎదురవు తున్నాయి. సీఏఏ ఏ మతానికి సంబంధించినది కానప్పుడు.. చట్టంలో కొన్ని మతాలను ఎందుకు పేర్కొన్నారంటూ బీజేపీ నాయకుడు, ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు సుభాష్‌ చంద్రబోస్‌ బంధువు చంద్ర కుమార్‌ బోస్‌ ప్రశ్నించారు. చట్టంలో ముస్లింలను ఎందుకు చేర్చలేదని చట్టంపై అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ విషయంలో పారదర్శకత అవసరమని ఆయన తెలిపారు. భారత్‌ను ఇతర దేశాలతో పోల్చకూడదనీ, ఇది అన్ని మతాలకు చెందిందని తన ట్వీట్‌లో బోస్‌ రాసుకొచ్చారు. సోమవారం సీఏఏకు మద్దతుగా కోల్‌కతాలో బీజేపీ పెద్ద ఎత్తున నిర్వహించిన ర్యాలీ అనంతరం ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.

మృతుల ఎక్స్‌గ్రేషియా వెనక్కి
బీజేపీ ఎమ్మెల్యే డిమాండ్‌
పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా మంగళూరులో జరిగిన నిరసనల్లో పాల్గొని.. పోలీసుల కాల్పుల్లో మృతి చెందిన వారి కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా ఇవ్వడంపై బీజేపీ ఎమ్మెల్యే బసనగౌడ పాటిల్‌ యత్నల్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మృతి చెందిన ఇద్దరు అమాయకులు కారనీ, వారికి రూ. 10 లక్షల చొప్పున ప్రకటించిన పరిహారాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని కర్నాటక సీఎం యడియూరప్పను ఆయన డిమాండ్‌ చేశారు. దేశభక్తులు, గోరక్షకులకు పరిహారాన్ని ఇవ్వాలన్నారు. బీజేపీ ఎమ్మెల్యే వ్యాఖ్యలపై ఆగ్రహం వెల్లువెత్తు తున్నది.

Courtesy Nava telangana