ఆదివారం దేశ రాజధాని ఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ వర్సిటిలో జరిగిన దాడి ఘటనలో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. తామే దాడి చేసామని హిందూరక్ష దళ్ చీఫ్ పింకి చౌదరి సంచలన వ్యాఖ్యలు చేసారు. వివరాల్లోకి వెళితే ఈ ఘటనలో గుర్తు తెలియని దుండగులు ముసుగులు ధరించి వచ్చి దాడులకు పాల్పడ్డారు. ఈ ఘటనలో 18 మంది విద్యార్ధులు సహా ఉపాధ్యాయులు గాయపడ్డారు.

దీనిపై పింకి చౌదరి స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేసారు. జేఎన్‌యూలో జరిగిన దాడులు తమ వారి పనేనని, జరిగిన హింసకు పూర్తి బాధ్యత వహిస్తున్నట్లు సంచలన వ్యాఖ్యలు చేసారు. జేఎన్‌యూ దేశ విద్రోహ కార్యకలాపాలకు కేంద్రంగా మారిందని, తాము ఈ చర్యలను సహించలేమని, అందువల్లే తమ వారు దాడి చేసినట్లు పింకి చౌదరి వ్యాఖ్యానించారు. గుర్తు తెలియని వ్యక్తులపై కేసు నమోదు చేసిన వెంటనే ఆయన ఈ వ్యాఖ్యలు చేసారు.

ఆయన చేసిన వ్యాఖ్యలను సీరియస్ గా తీసుకున్న పోలీసులు కేసు దర్యాప్తును ముమ్మరం చేసినట్టు తెలుస్తుంది. జేఎన్‌యూలోకి ప్రవేశించిన ముసుగు మనిషిని సీసీ ఫుటేజీ ఆధారంగా గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే ఈ దాడిపై దేశ వ్యాప్తంగా తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. భారీగా విద్యార్ధులు రోడ్ల మీదకు వచ్చి తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై కేంద్ర హోం శాఖ కూడా సీరియస్ గా ఉన్న సంగతి తెలిసిందే.