• 162 మంది ఎమ్మెల్యేలతో త్రిపక్ష కూటమి పరేడ్‌
  • హోటల్లో మీడియా ముందు బల ప్రదర్శన
  • గవర్నర్‌కు 162 మంది మద్దతుతో లేఖ
  • ప్రభుత్వ ఏర్పాటుకు పిలవాలని డిమాండ్‌
  • ఫడణవీస్‌ తక్షణ మే గద్దె దిగాలి: ఉద్ధవ్‌
  • అందరూ నిలుస్తారో లేదోనన్న భయం
  • రిసార్టు నుంచి స్టార్‌ హోటల్‌కు ఎమ్మెల్యేలు

అతి ఖరీదైన ఫ్యాషన్‌షోలు జరిగే ముంబైలోని గ్రాండ్‌ హయత్‌ స్టార్‌ హోటల్‌ సోమవారం రాజకీయ బల ప్రదర్శనకు వేదికైంది. ‘ఇదీ మా బలం, ఇదిగో మా బలగం’ అంటూ త్రిపక్ష కూటమి (సేన, ఎన్సీపీ, కాంగ్రెస్‌) 162 మంది ఎమ్మెల్యేలను విలేకరుల ముందు పరేడ్‌ చేయించాయి. సర్కారు ఏర్పాటుకు ఆహ్వానించాల్సిందిగా గవర్నర్‌ను కోరారు. మరి ఫడణవీస్‌ అసెంబ్లీలో బలం నిరూపించుకుంటారా? లేక మహారాష్ట్రలో బీజేపీకి ‘కర్ణాటక అనుభవం’ పునరావృతమవుతుందా?

ముంబై: దేశ రాజకీయాల్లోనే సరికొత్త సంప్రదాయం… భౌతికంగా సంఖ్యాబలం అనుకూలంగా ఉన్నా ప్రభుత్వం ఏర్పాటుకు అవకాశం దక్కని పార్టీలు ఏకంగా మీడియా ముందు ఎమ్మెల్యేలను పరేడ్‌ చేయించాయి. మహారాష్ట్రలో సోమవారం జరిగిన పరిణామం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. సాధారణంగా తమకు సంఖ్యా బలం ఉందని చెప్పుకోవడానికి రాజకీయ పార్టీలు తమ ఎమ్మెల్యేలను గవర్నర్‌ ముందు పరేడ్‌ చేయిస్తాయి. పార్టీల సంఖ్యాబలాన్ని కొందరు గవర్నర్లు లెక్క చేయకుంటే ఏకంగా ఢిల్లీకి వెళ్లి రాష్ట్రపతి ముందు ఎమ్మెల్యేలతో పరేడ్‌ చేయించడం కూడా రివాజు. మహారాష్ట్ర విషయానికి వస్తే మెజారిటీ సీట్లకు ప్రాతినిధ్యం వహిస్తున్న మూడు పార్టీలు ఒకచోట చేరి, కనీస ఉమ్మడి కార్యక్రమం మీద కసరత్తు చేస్తుంటే… ఒకవైపు రాష్ట్రపతి… రాష్ట్రపతి పాలనను ఎత్తేశారు.

మరో వైపు గవర్నర్‌… ఎన్సీపీ నేత అజిత్‌ పవార్‌ ఇచ్చిన మద్దతు లేఖను ఆధారంగా చేసుకొని ఫడణవీ్‌సతో ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయించారు. అనూహ్య పరిణామంతో దిగ్ర్భాంతికి గురైన త్రిపక్ష కూటమి చివరకు అసాధారణ బలపరీక్షకు దిగింది. దేశంలో అతిపెద్ద ఫ్యాషన్‌ షోలు జరిగే గ్రాండ్‌ హయత్‌ స్టార్‌ హోటల్‌ వేదికగా మూడు పార్టీలూ సోమవారం రాత్రి 162 మంది ఎమ్మెల్యేలను పరేడ్‌ చేశాయి. శివసేన, ఎన్సీపీ, కాంగ్రె్‌సలతో కొత్తగా ఏర్పడిన ఎన్నికల అనంతర కూటమి ‘మహా వికాస్‌ ఆఘాడీ’ తమతమ ఎమ్మెల్యేలను బస్సుల్లో తరలించి, నిర్వహించిన ఈ బలపరీక్షకు శివసేన అధినేత ఉద్ధవ్‌ ఠాక్రే, ఎస్పీపీ అధినేత శరద్‌ పవార్‌, కాంగ్రెస్‌ ముఖ్యనేత మల్లికార్జున ఖర్గే హాజరయ్యారు. ఇదిగో మా బలం… మేం 162 మందిమి… అంటూ ప్లకార్డులతో ఎమ్మెల్యేలను ప్రదర్శించారు. ముఖ్యమంత్రి ఫడణవీస్‌ తక్షణమే గద్దె దిగాలంటూ డిమాండ్‌ చేశారు. ఈ పరేడ్‌లో ప్రదర్శించిన 162 మంది ఎమ్మెల్యేలు కడదాకా నిలబడితే 288 మంది సభ్యుల మహారాష్ట్ర అసెంబ్లీలో కూటమికి ప్రభుత్వం ఏర్పాటుకు తగినంత బలం ఉన్నట్లే లెక్క.

ఇదే నిజమైతే… శనివారం తెల్లవారు జామున చడీచప్పుడు లేకుండా ఏర్పడిన బీజేపీ ప్రభుత్వం మనుగడ ప్రమాదంలో పడినట్లే. మరోపక్క పలువురు స్వతంత్రులు సహా 162 మంది ఎమ్మెల్యేల సంతకాలతో కూడిన మద్దతు లేఖను కూటమి నేతలు గవర్నర్‌ భరత్‌సింగ్‌ కోశ్యారీకి సమర్పించారు. మూడు పార్టీల శాసన సభాపక్ష నేతలు ఏక్‌నాథ్‌ షిండే, జయంత్‌ పాటిల్‌, బాలా సాహెబ్‌ థొరాట్‌ స్వయంగా గవర్నర్‌ను కలిసి లేఖను సమర్పించారు. గవర్నర్‌ను కలిసిన అనంతరం ఎన్సీపీ రాష్ట్ర అధ్యక్షుడు జయంత్‌ పాటిల్‌ మాట్లాడుతూ, ఎమ్మెల్యేల మద్దతు లేఖను ఇచ్చినందున తమను వెంటనే ప్రభుత్వం ఏర్పాటుకు పిలవాలని కోరారు. గవర్నర్‌ అనుమతిస్తే ఆయన ముందు 162 మంది ఎమ్మెల్యేలను ప్రదర్శిస్తామని చెప్పారు. కాగా, ఎన్సీపీకి ఫిరాయింపుల భయం వెంటాడుతోంది. అందుకే ఆదివారం వరకు రిసార్టులో దాచిన ఎమ్మెల్యేలను యుద్ధప్రాతిపదికన ముంబయిలోని రెండు స్టార్‌ హోటళ్లకు తరలించింది. ఇదిలాఉండగా, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడణవీస్‌ సోమవారం బాధ్యతలు చేపట్టారు. తొలి సంతకంగా ఉపశమన నిధి కింద సాయం మంజూరు చేశారు.

అన్న చేతిలో మోసపోయా: సుప్రియా సూలే
‘‘అధికారం వస్తుంది… పోతుంది… బంధాలే మిగులుతాయి’’ అని సోషల్‌ మీడియాలో శరద్‌ పవార్‌ తనయ సుప్రియా సూలే వ్యాఖ్యానించారు. జీవితంలో అందరికన్నా ఎక్కువగా అజిత్‌ పవార్‌నే నమ్మానని, ఇంతగా మోసపోయిన భావన ఎన్నడూ కలగలేదని చెప్పారు. బీజేపీకి అధికారం పిచ్చి పట్టిందని, తాము అధికారంలోకి వచ్చాక రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ నేతల కోసం పిచ్చాసుపత్రులు నిర్మిస్తామని శివసేన నేత సంజయ్‌ రౌత్‌ అన్నారు.

ఇలాంటివెన్నో చూశా: శరద్‌ పవార్‌
అజిత్‌ పవార్‌ కుట్ర వెనుక తన మద్దతు ఉందన్న వార్తలను ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌ తీవ్రంగా ఖండించారు. శివసేన-కాంగ్రె్‌సలతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసి తీరతామన్నారు. సతారా జిల్లాలో జరిగిన ఒక కార్యక్రమంలో శరద్‌ పవార్‌ మాట్లాడారు. మూడు పార్టీలకు ఏకాభిప్రాయం ఉన్న అంశాలనే ఎజెండాగా తీసుకొని ముందుకు వెళ్తామన్నారు. అజిత్‌ పవార్‌ ఫిరాయింపు లాంటివెన్నో తన యాభై ఏళ్ల రాజకీయ జీవితంలో చూశానని, ప్రజలు తన వెంట ఉన్నంత కాలం ఇలాంటివి పట్టించుకోనని చెప్పారు.

Courtesy AndhraJyothy…