ఇదేనా గుజరాత్‌ మోడల్‌..!
పేదరికాన్ని రూపుమాపనప్పుడు.. దాన్ని దాచడమెందుకు..?
గణాంకాలు చెబుతున్న నిజాలు

గాంధీనగర్‌ : త్వరలో భారత్‌లో పర్యటించనున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కంటికి ఈ దేశ పేదలు కనిపించకుండా ఉండేందుకు మోడీ సర్కారు పడరాని పాట్లు పడుతున్నది. ఈ క్రమంలోనే గాంధీనగర్‌ నుంచి అహ్మదాబాద్‌ వరకు ట్రంప్‌-మోడీలు నిర్వహించే ర్యాలీ కోసం రహదారి వెంట ఉన్న నిరుపేదల గుడిసెలు కనబడకుండ చేయడానికి అక్కడ సుమారు కిలోమీటరు మేర గోడను నిర్మిస్తున్న విషయం విదితమే. అయితే దీనిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నా గుజరాత్‌ సర్కారు గానీ, భారత సర్కారు గానీ వివరణ ఇవ్వలేదు. కేవలం మూడు గంటల కార్యక్రమం కోసం దాదాపు రూ. 100 కోట్ల దాకా ఖర్చుపెడుతున్నారు. అయితే గుజరాత్‌లో వాస్తవాలను దాచడానికే కేంద్ర, రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వాలు అడ్డు’గోడ’ కడుతున్నాయని విమర్శలు వస్తున్నాయి.

2014లో బీజేపీని అధికారంలోకి తీసుకురావడానికి మోడీ, సంఫ్‌ పరివార్‌.. ‘గుజరాత్‌ మోడల్‌’ను ముందుకుతెచ్చాయి. మోడీ ప్రధానైతే భారత్‌నూ గుజరాత్‌ మాదిరే అభివృద్ధి చేస్తారని కుప్పలుతెప్పలుగా కట్టుకథలు అల్లాయి. కానీ కేంద్రంలో అధికారంలో ఉండి ఆరేండ్లు కావస్తున్నా ప్రధాని సొంత రాష్ట్రంలో (అంతకుముందు మూడుసార్లు మోడీనే సీఎం) పేదరికం రూపు మారలేదు. తాజాగా గోడ నేపథ్యంలో విశ్లేషకులు.. ‘పేదరికాన్ని రూపు మాపనప్పుడు దాన్ని దాచి ఉంచడమెందుకు..?’ అని వాదిస్తున్నారు.

కఠోర వాస్తవాలు
ట్రంప్‌ మెప్పు పొందడానికి నానా తంటాలు పడుతున్న మోడీ సొంత రాష్ట్రం గుజరాత్‌ గణాంకాలను చూస్తే ‘గోడ’ ఎందుకు నిర్మిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. మానవ అభివృద్ధి సూచీ (2018)లో గుజరాత్‌ ర్యాంకు 22. నిత్యం తీవ్రవాదంతో ఉక్కిరిబిక్కిరయ్యే జమ్మూకాశ్మీర్‌ (17), హిమాలయాల సానువులో ఉన్న ఉత్తరాఖండ్‌ (19), ఈశాన్య రాష్ట్ర నాగాలాండ్‌ (20)లు గుజరాత్‌కంటే ముందున్నాయి. శిశు మరణాల రేటు, మాతా శిశు మరణాల రేటులో గుజరాత్‌ ఇప్పటికీ దేశంలోనే ప్రథమ స్థానంలో ఉంది. 2018లో నేషనల్‌ క్రైం రికార్డు బ్యూరో (ఎన్సీఆర్బీ) విడుదల చేసిన నివేదిక ‘భారత్‌లో ప్రమాదవశాత్తు హత్యలు.. ఆత్మహత్యలు’ నివేదిక ప్రకారం.. గుజరాత్‌లో పేదిరకం కారణంగా ఆత్మహత్యలు చేసుకున్న వారి సంఖ్య 2017 కంటే 162 శాతం పెరిగింది. నిరుద్యోగం కారణంగా 21 శాతం ఆత్మహత్యలు పెరిగాయి.

2014లో ఎకనామిక్‌ అండ్‌ పొలిటికల్‌ వీక్లీ ‘మోడీ పాలనలో గుజరాత్‌ నిజంగానే అధిక వృద్ధిరేటు సాధించిందా..?’ అనే పేరుతో ఓ నివేదికను విడుదల చేసింది. దాని ప్రకారం.. గుజరాత్‌కు ఉన్న సహజ వనరులతో అది సాధించే స్వయం అభివృద్ధితో పోలిస్తే మోడీ పాలనలో వృద్ధి సాధించిందేమీ లేదని తెలిపింది. ఈ విశ్లేషణలో బీహార్‌తో పోల్చితే గుజరాత్‌ అభివృద్ధి ఏమీ లేదని అది నొక్కి చెప్పింది. గణాంకాలు, కంటికి కనిపిస్తున్న వాస్తవాలు తమకు అనుకూలంగా లేని తరుణంలో మోడీ సర్కారు మసి పూసి మారేడు కాయ చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.

ఈ నేపథ్యంలోనే పేదలు ట్రంప్‌ కంట పడకుండా ఉండేందుకు ఏడడుగుల గోడను నిర్మిస్తున్నది. గతంలోనూ గుజరాత్‌కు అంతర్జాతీయ ప్రముఖులు, దేశాధినేతలు పర్యటించినప్పుడు మురికివాడలు కనిపించకుండా రోడ్ల వెంబడి భారీ టార్ఫలిన్‌ కవర్లు కప్పడం, చైనా అధ్యక్షుడు వచ్చినప్పుడు గాంధీనగర్‌ సుందరీకరణ పేరిట కోట్లాది రూపాయలు ఖర్చు చేసిన సంగతి తెలిసిందే. ఈసారి గోడ నిర్మాణం, రంగులు అద్దడం, ట్రంప్‌ భద్రత నిమిత్తం, మొక్కలు నాటే కార్యక్రమం కోసం వంద కోట్ల రూపాయలను వ్యయం చేస్తున్నారు. ట్రంప్‌ వెళ్లే మార్గంలో ఉండే మురికివాడ శరణ్య నివాస్‌లో 500 ఇండ్ల వరకు ఉన్నాయి. గోడలు, రంగులు వేసే బదులు ఆ డబ్బుతో వీరికి పక్కా ఇళ్లు నిర్మిస్తే అది ఓ మోడల్‌ కాలనీలా తయారవుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Courtesy Nava Telangana