– ప్రముఖులెవరొచ్చినా వాళ్లు కనిపించకూడదు
– ఆదేశాలు.. ముందస్తు హెచ్చరికలు లేకుండానే తొలగింపులు
– డెబ్భై ఏండ్లుగా అక్కడే నివాసం..
– ఈ ప్రభుత్వానికి మేం వికారంగా కనిపిస్తున్నామేమో : బాధితులు
– శరణ్యవాస్‌ బడుగుల బతుకులు అధ్వానం

”గుజరాత్‌ రాజధాని గాంధీనగర్‌కు వీవీఐపీలు, సంపన్న దేశాధినేతలు ఎవరొచ్చినా ఆ పేదలు కనిపించకూడదు. మురికివాడలో ఉంటున్న వారి ఆనవాల్లు ‘అతిథులకు’ తెలియడం ప్రభుత్వానికి ఏమాత్రం ఇష్టం లేదు. అందుకే ఆ పేదలను పెద్దల కంటపడకుండా చేసేందుకు అక్కడి బీజేపీ ప్రభుత్వం కొన్నేండ్లుగా నానా పాట్లు పడుతున్నది. జపాన్‌ ప్రధాని వచ్చినా.. చైనా అధ్యక్షుడొచ్చినా.. తాజాగా అమెరికా అధ్యక్షుడు గాంధీనగర్‌కు వస్తున్నా.. మొదలు బలయ్యేది ఆ గుప్పెడు మంది బడుగు జీవులే. నిన్నా మొన్నటిదాకా వాళ్లు కంటపడకుండా వారుండే ఏరియా చుట్టూ టార్ఫలిన్‌ కవర్లను కట్టిన గుజరాత్‌ సర్కారు.. తాజాగా వారిని శాశ్వతంగా కనుమరుగు చేసేందుకు అడ్డుగోడను కడుతున్నది. ఈ నేపథ్యంలో వారి స్థితిగతులపై అందిస్తున్న ప్రత్యేక కథనం.”

గాంధీనగర్‌ : మనదేశంలోని నగరాల్లో వందలాది ఏండ్లుగా రూపుమారకుండా ఉంటున్న మురికివాడల్లో అదొకటి. ప్రధాని మోడీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ‘భాగా అభివృద్ధి చేశారని’ చెప్పుకుంటున్న గాంధీనగర్‌ నుంచి అహ్మదాబాద్‌కు వెళ్లే మార్గం లో ఉందా ప్రాంతం. ఆ మార్గ మధ్యలో ఇందిరా బ్రిడ్డి కింద అర కిలో మీటరు పరిధిలో ఉండే ఏరియానే శరణ్యవాస్‌. దీనికి డెబ్భై ఏండ్ల చరిత్ర ఉంది. సుమారు 500 ఇండ్లు ఉన్న ఈ బస్తీలో.. రెండు వేల మంది దాకా జీవిస్తున్నట్టు అంచనా. వీరంతా ఎక్కువగా గుజరాత్‌, రాజస్థాన్‌ గ్రామాల నుంచి రాజధానికి వలసవచ్చినవారే. రెక్కా డితే గానీ డొక్కాడని బతుకులే అందరివి. ఇక్కడివారందరికీ ఆధార్‌ కార్డులు, ఓటర్‌ ఐడీలు ఉన్నా బీజేపీ ప్రభుత్వం మాత్రం వీరిని ఇంకా పౌరులుగా గుర్తించడానికి ఇష్టపడటం లేదు. అందుకే వారుంటున్న ప్రాంతం చుట్టూ ఏడడుగుల గోడను నిర్మిస్తున్నది.

కనీస వసతులు కరువు
500 ఇండ్లు ఉండే ఈ మురికివాడలో కనీస వసతుల కల్పన నామమాత్రంగానే ఉంది. భారత్‌ను బహిరంగ మల విసర్జన రహిత (ఓడీఎఫ్‌) దేశంగా ప్రకటించుకున్నప్పటికీ ఈ వాడలో టాయిలెట్లు అరుదుగా కనిపిస్తాయి. మగవారితో పాటు మహిళలూ ఆరుబయటికే వెళ్లాలి. మంచినీరు రోజుకొకసారి ఇస్తున్నారు. దాదాపు అందరివీ ఒక్క గదితో ఉండే ఇండ్లే. బాత్‌రూంలూ లేని ఇండ్లున్నాయి. ఆడవాళ్లు స్నానం చేయడానికి తడకలు, టార్ఫలిన్‌ కవర్లతో కట్టిన బాత్‌రూంలే దిక్కు. మగవారైతే శరణ్యవాస్‌కు సమీపంలో ప్రవహిస్తున్న సబర్మతి నదిలోనే స్నానాలు చేస్తున్నారు. పారిశుధ్యం ఊసే ప్రభుత్వం మరిచింది. ఎల్‌పీజీ సిలిండర్లు ఉన్నవాళ్తైతే ఇక్కడ ధనవంతులతోనే సమానం. చాలామంది ఇంకా కట్టెలపొయ్యినే వాడుతున్నారు. ప్రాథమిక పాఠశాల కూడా లేకపోవడంతో ఇక్కడి పిల్లలు దగ్గరలో ఉన్న హన్సోల్‌లోని ప్రభుత్వ పాఠశాలకు వెళ్తుంటారు. ప్రభుత్వాస్పత్రి కూడా లేదు. శరణ్యవాస్‌లో ఉంటున్న పేదలందరూ దినసరి కూలీలే. రోజుకు రూ. 200 నుంచి రూ. 400 వరకు కూలీకి పనిచేసేవాళ్లే. వచ్చే ఆదాయం సరిపోక రుణాల మీద బతుకులీడుస్తున్న వారే, ఇక్కడి వారి వృత్తి కత్తులకు పదును పెట్టడమే.

గతంలోనూ ఇలాగే…
శరణ్యవాస్‌ కనబడకుండా గోడ కట్టడం ఇది మొదటిసారి కానీ, వీరిని కనిపించకుండా చేయడం కొత్తకాదు. గతంలో జపాన్‌ ప్రధాని షింజో అబే, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ గాంధీనగర్‌కు వచ్చినప్పుడు వీళ్లుండే ఏరియా కనబడొద్దని భారీ టార్ఫలిన్‌ కవర్లను కట్టారు. అలాగే 2019లో జరిగిన ‘ప్రకాశిస్తున్న గుజరాత్‌’ (వైబ్రెంట్‌ గుజరాత్‌) కార్యక్రమప్పుడూ విజరు రూపానీ సర్కారు ఇదే రీతిలో వ్యవహరించింది. అయితే ప్రతిసారి ఇలా టార్ఫలిన్‌ కవర్లు కట్టే బదులు.. శాశ్వతంగా గోడ కట్టేస్తే మేలని భావించిన మోడీ సర్కారు.. ఆగమేఘాల మీద దాని నిర్మాణం చేపట్టింది.

హెచ్చరికలు లేకుండానే కూల్చివేత
గోడ నిర్మాణం సందర్భంగా రోడ్డు వెంబడి ఉన్న సుమారు పది కుటుంబాల ఇండ్లను హెచ్చరికలు లేకుండానే అహ్మదాబాద్‌ మున్సిపాలిటీ అధికారులు కూల్చివేశారు. మధ్యాహ్నం సమయంలో.. పేదలంతా బతకుపోరాటంలో పనులకు పోయినప్పుడు జేసీబీలతో వచ్చిన అధికారులు.. వారికి ఉన్న చిన్న ఇండ్లనూ పడగొట్టారని ఇల్లు కోల్పోయిన కేసరిబెన్‌ బలబరు తెలిపింది. ‘నా కూతురు ఆరోగ్యం బాగోలేకపోతే పొద్దునే నేను ఆస్పత్రికి వెళ్లాను. మేము వచ్చేసరికి మా ఇంటిని కూల్చివేశారు. కనీసం నోటీసులు లేకుండానే ఇంటిని పడగొట్టారు’ అని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. తమ ఇంటిని అప్పు తీసుకొని నిర్మించుకున్నామనీ, ఇప్పుడు తామెక్కడికి వెళ్తామంటూ ఆమె కన్నీరుమన్నీరయ్యింది.

కంటికింపుగా ఉన్నామేమో : అశోక్‌భారు
మాలో చాలా మంది నిరక్షరాస్యులు. గాంధీనగర్‌కు పెద్దపెద్దోళ్లు వస్తే మమ్మల్ని ఇక్కడినుంచి వెళ్లమని నోటీసులిస్తారు. వాటిపై ఎవరిని సంప్రదించాలో కూడా మాకు తెలియదు. మేము బయట ప్రపంచానికి కనిపించకుండా ఉండేందకు ఎందుకు ప్రయత్నిస్తున్నారో అర్థం కావడం లేదు. బహుశా ఈ ప్రభుత్వానికి మేం కంటికింపుగా ఉన్నామేమో..! అందుకే మమ్మల్ని ఇక్కడినుంచి వెళ్లగొడుతున్నారు. 70 ఏండ్లుగా మా కుటుంబం ఇక్కడే బతుకుతున్నది. ఇందిరాగాంధీ హాయాంలో మాకు ఈ భూమి పట్టాలిచ్చారు. ఇప్పుడు ఉన్నపళంగా వెళ్లమంటే ఎక్కడికెళ్తాం..? ప్రముఖులు వచ్చినప్పుడల్లా పోలీసులు మా ఇండ్ల మీదకు వచ్చి దాడులు చేస్తున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు.

Courtesy Nava Telangana