Hyderabad encounter చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటారా: హరగోపాల్‌
 ఎమర్జెన్సీని తలపించే ఘోరం: వసంత కన్నాబిరన్‌
హైదరాబాద్‌/హైదరాబాద్‌ సిటీ/రాజమహేంద్రవరం సిటీ, డిసెంబరు 6: దిశ’ హత్యాచారం కేసులో నిందితులు ఎన్‌కౌంటర్‌లో మరణించడంపై పలు ప్రజాసంఘాల, పౌర హక్కుల నేతలు, మేధావులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది అత్యంత హేయమని పేర్కొన్నారు. పోలీసులు వ్యవహరించిన తీరును ఉదాహరణగా తీసుకొని ప్రజలే చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని దోషులను శిక్షించడం మొదలుపెడితే పోలీసు యంత్రాంగం పాత్ర ప్రశ్నార్థకం అవుతుందని మానవహక్కుల ఉద్యమనేత హరగోపాల్‌ అన్నారు. ఎమర్జెన్సీ రోజులను తలపించే విధంగా కస్టడీలో ఉన్న నిందితులను విచారణ పేరుతో బయటకుతీసుకెళ్లి కాల్చి చంపడం చాలా ఘోరమని ప్రముఖ స్త్రీవాద ఉద్యమనేత వసంత కన్నాబిరన్‌ అన్నారు. వ్యవస్థలపై ప్రజలకు నమ్మకం కోల్పోయినప్పుడే ఆటవిక నేరాలకు ఆటవికమైన పరిష్కారాలను కోరుకునే స్థితికి ప్రజలు నెట్టబడతారని సామాజిక, ఆర్థిక విశ్లేషకుడు సి. రామచంద్రయ్య పేర్కొన్నారు.
ఈ ఎన్‌కౌంటర్‌ను సీపీఐ సీనియర్‌ నేత నారాయణ సమర్థించడం అత్యంత హేయమని మానవహక్కుల ఉద్యమకారుడు జీవన్‌కుమార్‌ విమర్శించారు. ఎన్‌కౌంటర్‌ పేరిట కాల్చి చంపిన పోలీసు సిబ్బందిని వెంటనే అరెస్టు చేయాలని హ్యూమన్‌ రైట్స్‌ ఫోరం డిమాండ్‌ చేసింది. సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌తో పాటు సిబ్బందిపై హత్యానేరం కింద కేసు నమోదు చేయాలంటూ ఆర్గనైజేషన్‌ ఫర్‌ ప్రొటెక్షన్‌ ఆఫ్‌ డెమొక్రటిక్‌ రైట్స్‌ సెంట్రల్‌ కమిటీ చైర్మన్‌ భాస్కర్‌రావు డిమాండ్‌ చేశారు. దోషులకు కోర్టు ద్వారా ఉరిశిక్ష పడాలే కానీ పోలీసుల ద్వారా కాదని ఏపీ పౌర హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ముప్పాళ్ల సుబ్బారావు అన్నారు.
ఆయుధాలు లాక్కుంటే ఎన్‌కౌంటర్‌ కరెక్టే: జస్టిస్‌ చంద్రకుమార్‌
పోలీసులు చెబుతున్న కథనం ప్రకారం ఆ నలుగురు నిజంగానే పోలీసులపై రాళ్లు రువ్వి, ఆయుధాలు లాక్కోవడం వంటి చర్యలకు పాల్పడితే ఎన్‌కౌంటర్‌ చేయడంలో తప్పులేదని మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ చంద్రకుమార్‌ వ్యాఖ్యానించారు. అలాకాని పక్షంలో పోలీసు చర్యను తీవ్రంగా ఆక్షేపించాల్సిందేనని అన్నారు.

(Courtesy Andhrajyothi)