– డాక్టర్‌ దేవరాజు మహారాజు
సుప్రసిద్ధ సాహితీవేత్త, జీవశాస్త్రవేత్త.

భారతదేశంలో బౌద్ధం క్షీణించడానికి కొన్ని శతాబ్దాల కాలం పట్టింది. పైగా అది అనేక కారణాల వల్ల కూడా క్షీణిస్తూ వచ్చింది. గుప్తకాలం (320-650సీ.ఈ) పరిసమాప్తమైన తర్వాత, బౌద్ధ సంఘాలకు ఆర్థిక వనరులు తగ్గుతూ వచ్చాయి. అప్పుడు ఉన్న చిన్న చిన్న రాజ్యాల పరిపాలకులు హిందూ సంస్థలకు, బ్రాహ్మణులకు సహాయం అందిస్తూ ఉండేవారు. దానితో శైవులు, వైష్ణవులు బలపడుతూ వచ్చారు. రాజకీయంగా కూడా వారి పెత్తనం కొనసాగడం ప్రారంభమైంది. మరో వైపు బౌద్ధారామాల మీద బౌద్ధ భిక్కుల అజమాయిషి తగ్గుతూ వచ్చింది. ఆ తర్వాత కాలంలో 7-8 శతాబ్దాలలో వచ్చిన కర్కోటక, ప్రతిహర, రాష్ట్రకూట, పాండ్య, పల్లవ వంశాల రాజకుటుంబాలన్నీ హిందూ ధర్మం వైపు, బ్రాహ్మణవాదం వైపు మొగ్గుచూపాయి. అందువల్ల బౌద్ధారామాలు మార్చుకోవడం, బౌద్ధ విగ్రహాలు మార్చుకోవడం తేలికైంది. అంతకు ముందు వెయ్యి సంవత్సరాలుగా విస్తరించిన బౌద్ధం క్రమంగా బలహీన పడుతూ వచ్చింది.

భారతదేశపు ఉత్తర ప్రాంతం నుంచి హుణులు, మంగోలులు, పర్షియన్‌లు చొరబడ్డారు. ఢిల్లీ సల్తనత్‌ జనరల్‌ మహ్మద్‌బిన్‌ భక్తియార్‌ ఖిల్జీ బెంగాల్‌ బీహార్‌లలో ఇస్లాంను వ్యాపింపచేశాడు. నలంద, విక్రమశిల, ఒదంతపురి లాంటి వన్నీ ధ్వంసం చేశాడు. బౌద్ధ భిక్షువులను, మరోవైపు బ్రాహ్మణుల్ని కూడా అతి కిరాతకంగా చంపించాడు. ఆ ప్రాంతాలలో తనను తానే రాజుగా ప్రకటించుకున్నాడు.515సీ.ఈ.లో ఆఫ్ఘనిస్తాన్‌, పాకిస్థాన్‌, ఉత్తర భారతదేశంలో చాలా భాగం హుణుడైన మిహిరకులుడి పరిపాలనలో ఉండేది. ఇతను బౌద్ధారామాలు, మొనస్ట్రీలు నాశనం చేయించాడు. 10-12 శతాబ్దాల మధ్య ఆఫ్ఘనిస్తాన్‌ మీదుగా ముస్లిం చొరబాటుదారులు భారతదేశానికి వచ్చారు. వారికి విగ్రహారాధన సరిపడదు గనక, కనిపించిన బౌద్ధ విగ్రహాలన్నింటినీ ధ్వంసం చేస్తూ పోయారు. రాతి కట్టడంతో బలిష్టంగా ఉన్న నలందా విశ్వవిద్యాలయాన్ని ముస్లిం సైనికులు ఏదో కోట అనుకుని ముట్టడించారు. అందులో ఉన్న బౌద్ధ భిక్షువుల్ని బ్రాహ్మణులుగా భావించారు. అందరినీ నిర్దాక్షిణ్యంగా చంపారు. భక్తియార్‌ ఖిల్జీ దాడులకు తట్టుకోలేక బౌద్ధ భిక్షువుల్లో కొందరు టిబెట్‌కు, మరి కొందరు దక్షిణ భారతదేశానికి పారిపోయారు.

పర్షియన్‌ యాత్రికుడు అల్‌ బిరుని జ్ఞాపకాలలో ఇలాంటి ఉదంతాలు నమోదై ఉన్నాయి. విలియం బోన్‌స్టన్‌, పీటర్‌ హార్వేలు కూడా ఆనాటి చారిత్రక సంఘటనల్ని నమోదు చేశారు. ఈ విధంగా బహిర్గతంగా ఇతర దేశీయుల దాడుల వల్ల కలిగిన నష్టం కోలుకోలేనిది. అయితే దానికంటే అధికంగా అంతర్గతంగా శతాబ్దాలపాటు వైదిక మత గురువులు చేసిన దాడులు, కుట్ర పూరితమైన వక్రీకరణలు బౌద్ధానికి ఎంతో నష్టం కలిగించాయి. వారే బౌద్ధం పునాదులపై తమ వైదిక ధర్మాన్ని స్థిరపరస్తూ వచ్చారు. బుద్ధుణ్ణి తమ దశావతారాల్లో చేర్చుకోవడం ఒకటయితే, బౌద్ధారామా లన్నింటినీ ధ్వంసం చేయించి దేవాలయాలుగా మార్చుకోవడం రెండవది. బుద్ధుడి విగ్రహాల రూపురేఖలు మార్చి హిందూ దేవతా విగ్రహాలుగా తీర్చిదిద్దుకోవడం మూడవది. బౌద్ధం విధానాల్ని అనుకరిస్తూ, సామాన్య జనాన్ని ప్రభావితం చేస్తూ – క్రమంగా వారిని మూఢ భక్తిలోకి లాగడం నాలుగవది. సమాజంలో మూఢ విశ్వాసాల్ని విస్తరింపజేస్తూ, కులాలు వర్ణాలుగా జనాన్ని విడగొట్టడం ఐదవది. ప్రస్తుతం అధికారంలో ఉన్న వీరి వారసులు ‘భారత రాజ్యాంగం’ స్థానంలో అధికారికంగా మనుస్మృతిని అమలు చేయాలని చూస్తున్నారు. ప్రజలు అది గమనించాలి!

బౌద్ధం పునాదులపై హిందూ మతాన్ని పునర్నిర్మించిన వాడు ఆదిశంకరుడు. బౌద్ధాన్ని అనుసరించి ఆ పద్ధతులను హిందూమతంలోకి తీసుకొచ్చారు. దశావతారాలను సృష్టించాడు. తెలివిగా బుద్ధుణ్ణి దశావతారాల్లో చేర్చాడు. ఆ విధంగా బౌద్ధులంతా ‘హిందూ మతంలోకి రావాలని పథకం వేశాడు. జంతు బలులను ఆపాడు. ప్రసాదం – అంతకు ముందున్న మాంసాన్ని మార్చి శాఖాహారాన్ని ప్రవేశపెట్టాడు. బౌద్ధం పతనం కావడానికి ఆదిశంకరుడొక్కడే కారణం కాదు. ప్రధాన కారణం అతనే అయినా, ఇంకా ఇతర కారణాలు కూడా ఎన్నో ఉన్నాయి. బౌద్ధ భిక్కులు, బౌద్ధ సన్యాసులు విలాసాలకు అలవాటు పడి, బౌద్ధాన్ని మాయమంత్రాల ప్రభావంలోకి నెట్టేయడం వల్ల కూడా బౌద్ధం క్షీణిస్తూ వచ్చింది. అలాంటి సమయంలో ఆదిశంకరుడు బౌద్ధులతో వాదిస్తూ, తన వాదనా పటిమతో ఓడిస్తూ, రాజుల సహాయంతో వారిని చంపిస్తూ – నిద్రాణమై ఉన్న హిందూ మతాన్ని లేపి, తిరిగి నిలబెట్టాడు. కేవలం 32 సంవత్సరాలు జీవించిన ఆది శంకరుడి ప్రభావం హిందూ మతంపై అమితంగా ఉంది.

స్మార్తులు, సంతులు ఆయన నెలకొల్పిన సంప్రదాయాలను ఆచరిస్తారు. దశనమి సంప్రదాయం, షణ్మత విధానం, పంచయతన విధానం ఆయన ఏర్పరిచినవే. ఆదిశంకరాచార్య కేరళలోని కలడి అనే గ్రామంలో నంబూద్రి బ్రాహ్మణ దంపతులకు పుట్టాడు. తండ్రి చిన్నతనంలోనే చనిపోగా, తల్లి పెంపకంలో పెరిగి పెద్దవాడయ్యాడు. ఉపనయనం జరిపించిన తర్వాత ఆ తల్లి, కుమారుణ్ణి సన్యాసి కమ్మని పంపించింది. బాల శంకరుడు నర్మద – ఓంకారేశ్వర్‌ పరిసరాల్లో గోవింద భగవత్పాదులను కలుసుకుని, అతడికి శిష్యుడయ్యాడు. ఆ తర్వాత గంగానది ఒడ్డున కాశీలో, హిమాలయాల్లో, బద్రీనాథ్‌లో గడుపుతూ – అన్ని చోట్లా మీమాంస చేసేవాడు. అంటే ధార్మిక విషయాలు చర్చించేవాడు. ఆ రోజుల్లో ఇలాంటి చర్చలు ప్రజల మధ్య, ఒక్కోసారి రాజాస్థానాలలో జరుగుతూ ఉండేవి. ఉపనిషత్తులు, భగవద్గీతపై ఆయన చేసిన విశ్లేషణలు జనాన్ని బాగా ఆకర్షించేవని చెపుతారు. బ్రహ్మచారులు, సన్యాసులు నివసించేది మఠం. అక్కడ దేవుణ్ణి ప్రతిష్టించిన తర్వాత అది పీఠమౌతుంది. శంకరుడు నాలుగు మూలలా నాలుగు మఠాలను స్థాపించాడు. వీటినే చతుర్మఠాలని అన్నారు. హిందూమతాన్ని పునర్జీవింపజేయడానికి ఆయన నెలకొల్పిన నిర్వహణ క్రమం వందల సంవత్సరాలుగా అవిచ్ఛిన్నంగా కొనసాగుతూ వస్తోంది.

హిందూమత పునరుద్ధరణకు శంకరాచార్య మాత్రమే కాదు, రామానుజాచార్య కూడా కృషి చేశారు. అయితే దేవుళ్ళు వేరు వేరు కావడం వల్ల శైవులుగా, వైష్ణవులుగా విడిపోయి ఆధిపత్యం కోసం హౌరా హౌరి పోట్లాడుకున్నారు. విశాల దృక్పథం లేని వీరూ వీరి పూర్వీకులూ రాసుకున్న పురాణాల్లో తర్వాతి తరం వారికి ఎదగనితనం స్పష్టంగా కనిపిస్తూ వచ్చింది. కావాలంటే ఆ అతకని పొసగని ఆ కట్టుకథల్లోని అంశాలు మనం కూడా గమనించవచ్చు. ప్రహ్లాదుడు, విభీషణుడు, పరుశురాముడు చాలా చాలా గొప్పవాళ్ళని భక్తులు భావిస్తుంటారు. వీరి వ్యక్తిత్వాలు గమనిస్తే, మొదటివాడు తండ్రిని చంపించగా, రెండోవాడు అన్నను చంపించాడు. ఇక మూడోవాడు పరుశురాముడు మాత్రం నేరుగా తల్లినే చంపాడు. అలాంటప్పుడు మనకూ, రాగలతరాల వారికి ఇలాంటి వాళ్ళు ఏం ఆదర్శం? సంస్కృతీ, సంప్రదాయాల గూర్చి గొప్పగా టముకు వేసేవారు ఆలోచించాలి. కుటుంబ సంబంధాల్ని, మానవ సంబంధాల్ని నిలుపుకోవడం ఇలాగేనా? డొంకతిరుగుడు వివరణలు ఇవ్వడం మాని, సూటిగా హేతుబద్ధంగా చెప్పగలిగిందేమైనా ఉంటే చెప్పాలి. నేటి సమాజంలో విపరీతంగా నేరాలు, ఘోరాలు జరుగుతున్నాయంటే జరగవా మరీ?

ఇలాంటి ఘనమైన నేర చరిత్రలు చెపుతూ పిల్లల్ని పెంచి పెద్ద చేస్తున్నారు కదా? సామాజిక విలువలకు మన పురాణ రచయితలు ఏనాడో తిలోదకాలిచ్చారు. ఎదగని ఆలోచనా ధోరణిలో శతాబ్దాల క్రితం ఆయా రచయితలు ఏవేవో రాశారు. అవి ఈ కాలానికి, ఈ సమాజానికి ఎంత మాత్రమూ పనికిరావని స్పష్టంగా తెలుస్తూ ఉంది. వారి కంటే ఈ తరంవారు ఎంతో ప్రగతిశీలురు, ప్రపంచ జ్ఞానమున్న మా’నవ’వాదులు! అందువల్ల ఈ కాలానికి అనుగుణంగా విషయాలలో మార్పులు చేసుకోవడం తప్పని సరి అవుతోంది. ద్వందనీతి, ద్వంద ప్రమాణాలు పురాణ సాహిత్యంలో తప్పని సరిగా ఉంటాయి. ఉదాహరణకు దుశ్శాసనుడు సభలో ద్రౌపతి చీరను లాగితే – అది భారత యుద్ధానికి దారి తీసింది. మహిళను అవమానించడం నేరం. బుద్ధీ, జ్ఞానం ఉన్నవాడెవడూ ఆ సంఘటనని సమర్థించడు. అది సరే, మరి శ్రీకృష్ణుడు పట్టపగలు వేల మంది స్త్రీల చీరలు దొంగిలించుకుని వెళ్ళి చెట్టెక్కి కూర్చునేవాడు కదా? పైగా వేణువూదేవాడు. వాళ్ళేమో నగంగా దీనంగా వేడుకునేవారు. (ఇదంతా వాళ్ళు రాసిందే. మనం ఇప్పుడు కల్పించింది కాదు) మరి అక్కడ ఏ యుద్ధమూ జరగలేదు. పైగా భక్తి పారవశ్యంలో అదంతా భాగవతమై కూర్చుంది!

సరస్వతి ఎప్పుడూ, ఎవరికీ అక్షరాలు నేర్పిన దాఖలాలు లేవు. మరి చదువుల తల్లి ఎలా అయ్యింది? లక్ష్మీదేవి ఎవరికీ చిల్లిగవ్వ విదిల్చినట్టు ఆధారం ఎక్కడా నమోదు కాలేదు. సిరిసంపదలన్నీ ఆమే ఇస్తూ ఉందన్న కథనానికి రుజువుందా? పోనీ, గంగా గంగా అంటారు కదా? ఆమె పంటల సాగుకోసం ఏ రైతు కైనా దోసెడు నీళ్ళిచ్చినట్టు ఏ పురాణంలోనూ ఎందుకు లేదూ? దాహం తీర్చడానికి ఏ బాటసారికైనా దోసెడు నీళ్ళిచ్చిందా? దేనికీ ఆధారాలు, రుజువులు లేనప్పుడు ఎందుకీ ఝాటా మాటలు? ఎందుకూ ఎలా వీళ్ళంతా మన దేవతలయ్యారూ? ఇందులో ఏమైనా కుట్రకోణం ఉందా? మన ప్రభుత్వాలేమైనా ఎంక్వయిరీ చేయించగలవా? ప్రశ్నిస్తేనే చంపేసే నేటి ప్రభుత్వం – అంత హేతుబద్దంగా ఎప్పుడూ ఆలోచించాలీ? అభివృద్ధి చెందిన ఇతర ప్రపంచ దేశాల్లో ప్రజలకు ఈ దేశపు దేవీ దేవతల పేర్లు కూడా తెలియదు. అయినా వారిది ధనిక సమాజంగా, విద్య, వైజ్ఞానిక విషయాలలో ఎంతో అభ్యున్నతి సాధించిన సమాజంగా రూపుదిద్దుకుంది. అనునిత్యం వేల వేల దేవీ దేవతలకు పూజలు చేసే భారతదేశ జనాభా మాత్రం ఎందుకు దారిద్య్రంలో కూరుకుపోయి ఉందీ? విద్యలేక మూఢ నమ్మకాల్లో ఎందుకు మునిగిపోయి ఉందీ? విజ్ఞతను ఉపయోగించాలి కదా?

ఈ అత్యాధునిక యుగంలో హేతువాదులు, మతం వద్దనుకునే మానవవాదులు అందరూ కోరుకుంటున్నది బుద్ధుడు ఎప్పుడో చెప్పాడు. అంతకంటే ముందు ప్రపంచంలోనే తొలి వైజ్ఞానిక తాత్త్వికులైన చార్వాకులు (600బీసీఈ) చెప్పింది కూడా అదే – ”భగవంతుడు లేడు. ఆత్మలేదు. వేదం పరమ నయవంచకుల గ్రంథం. స్వర్గం, నరకం అనేవి లేవు. అవి కేవలం ఊహాలు, భ్రమలు మాత్రమే! తపస్సు, పూజ, వ్రతం, ఉపవాసాలు శరీరాన్ని శుష్కింపజేస్తాయి. కాని వాటివల్ల ప్రయోజనం శూన్యం” అని! కానీ, తర్వాత కాలంలో వలసవచ్చిన యురేషియన్లు – అంటే ఆర్యులు ఇక్కడి మూలవాసుల సంస్కృతి ధ్వంసం చేసి, వారిని బానిసత్వంలోకి తోసి, సంస్కృత మంత్రాలతో, మనుస్మృతితో అధికారం చలాయిస్తూ వచ్చారు. వారంతా సచ్చీలురైతే నిజాయితీ గలవారైతే మనుషుల్ని నాలుగు వర్గాలుగా ఎందుకు విభజించారు? దేవుణ్ణి, మహిమల్ని అడ్డంపెట్టుకుని మనుషుల్ని తల నుంచి, భుజాల నుంచి పుట్టిస్తారా? అదేదో ఇప్పుడు కూడా పుట్టించి చూపాలి కదా? అంటరాని తనాన్ని ఎందుకు ప్రవేశపెట్టారూ? నడుముకు చీపురు, మెడకు ముంత కట్టి, మనుషుల్ని జంతువుల కన్నా హీనంగా చూసిన ఘనత ఎవరిదీ? సంస్కృత శ్లోకాలు ఉచ్ఛరిస్తేనే నాలుకలు తెగ్గోయాలా? ఇవన్నీ ఘోరమైన తప్పిదాలని, మానవ జాతి అంతా ఒకటేనని జన్యుశాస్త్రం చెప్పే విషయాలు అర్థం చేసుకోవాలి. ఆధునిక విజ్ఞానంతో హృదయ వైశాల్యం పెంచుకుని మనుషులు మనుషుల్లా ప్రవర్తిస్తే మంచిది. ఈ దేశం నుంచి బౌద్ధాన్ని తరిమేసింది ఎందుకంటే.. ఆత్మ – పరమాత్మ అంటూ జనాన్ని మభ్యపెట్టి మోసం చేయడానికి పనికొచ్చేవి అందులో ఏవీ లేనందుకే – నన్నది స్పష్టంగా అర్థమౌతూ ఉంది.