• జైలు నుంచి ముంబై జేజే ఆస్పత్రికి తరలింపు
  • విడుదల చేయాలంటూ సతీమణి, కూతురు నిరసన 

ముంబై/హైదరాబాద్‌/చిక్కడపల్లి/ కవాడిగూడ : విప్లవ రచయితల సంఘం నేత వరవరరావు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. నవీముంబైలోని తలోజా సెంట్రల్‌ జైల్లో ఏడాదిన్నరగా విచారణ ఖైదీగా ఉన్న ఆయన్ను  గురువారం సాయంత్రం చికిత్స నిమిత్తం ముంబైలోని జేజే ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు చిక్కడపల్లి పోలీసులకు సమాచారం అందింది. వివిధ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయనకు మూడు రోజులుగా జైల్లోనే వైద్యం అందిస్తున్నారు. గురువారం సాయంత్రం ఆయన కళ్లు తిరిగిపడిపోయారు. ఆస్పత్రిలో ఆయన ఛాతీకి ఎక్స్‌రే తీశారు. కరోనా పరీక్షలతో పాటు మరికొన్ని పరీక్షలు చేశారు. ఫలితాలు శనివారం వస్తాయని, ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని, మందులకు స్పందిస్తున్నట్లు వైదులు చెప్పారు. ఆస్పత్రిలో ఉన్న వరవరరావును చూసేందుకు ఆయన భార్య హేమలత, కుమార్తె పవన శనివారం ముంబైకి రానున్నారు. ఆయన్ను ఆస్పత్రిలో చేర్చిన విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలిపినట్లు హైదరాబాద్‌ సెంట్రల్‌ జోన్‌ డీసీపీ అంజనీ కుమార్‌ చెప్పారు. వారు ముంబై వెళ్లడానికి పాస్‌లు కూడా జారీ చేసినట్లు తెలిపారు.

ఆయన పరిస్థితి నిలకడగా ఉందని ముంబైలోని స్నేహితుల ద్వారా తెలిసిందని వరవరరావు కుటుంబసభ్యులు తెలిపారు. పైల్స్‌, రక్తపోటు, సైనోసైటిస్‌, మైగ్రేన్‌, కాలివాపు, వెర్టిగో వంటి వ్యాధులతో  బాధపడుతున్న తనకు బెయిల్‌ మంజూరు చేయాలని వరవరరావు ముంబైలోని స్పెషల్‌ నేషనల్‌ ఇన్వెస్టిగేషన్‌ ఏజన్సీ కోర్టును ఆశ్రయించారు. బెయిల్‌ పిటిషన్‌ను జూన్‌ 2కు వాయిదా వేశారు. వరవరరావు, ఢిల్లీ  యూనివర్శిటీ ప్రొఫెసర్‌ జీఎన్‌ సాయిబాబాను వెంటనే విడుదల చేయాలని కోరుతూ తెలంగాణ నిర్బంధ వ్యతిరేక వేదిక పిలుపుమేరకు వరవరరావు భార్య హేమలత, కుమార్తె పవన శుక్రవారం ఇఫ్లూ యూనివర్శిటీలో నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. వారిని వెంటనే విడుదల చేయాలని  తెలుగు రాష్ట్రాల్లోని దాదాపు 200 ప్రాంతాల్లో శుక్రవారం నిరసన ప్రదర్శనలు నిర్వహించినట్లు  వేదిక కన్వీనర్‌ ప్రొఫెసర్‌ హరగోపాల్‌ ఒక ప్రకటనలో తెలిపారు.

మహారాష్ట్ర జైళ్లలో కరోనా వ్యాధి ప్రబలుతోందని, ఈ పరిస్థితులలో వారిద్దరిని పెరోల్‌పై విడుదల చేయాలని వేదిక ప్రతినిధి రవిచందర్‌  డిమాండ్‌ చేశారు.  వరవరరావును విడుదల చేయాలని  అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య తెలంగాణ, ఏపీ రాష్ర్టాల గౌరవ అధ్యక్షురాలు విమలక్క కోరారు.  వరవరరావుతో సహా హక్కుల నేతలను తక్షణమే విడుదల చేయాలని పౌరహక్కుల సంఘం డిమాండ్‌ చేసింది.

Courtesy Andhrajyothi