– కేరళ, ఢిల్లీ ప్రాంతాలకు విమాన సర్వీసులెక్కువ..
– విదేశాల్లో చిక్కుకున్న పలు రాష్ట్రవాసుల్లో ఆందోళన
– గర్భిణులు, వృద్ధులు, మహిళలకు తీవ్ర ఇబ్బందులు

వందేభారత్‌ మిషన్‌ ద్వారా స్వదేశానికి రావడానికి రిజిస్టర్‌ చేసుకున్న వారిలో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతున్నట్టు తెలుస్తున్నది. ఈ మిషన్‌లో భాగంగా ఇప్పటివరకు కేరళ, ఢిల్లీలకే విమాన సర్వీసులు ఎక్కువగా నడపడంతో విదేశాల్లో చిక్కుకున్న ఇతర రాష్ట్రవాసులు ఆవేదనకు గురవుతున్నారు. ప్రధానంగా గల్ఫ్‌ దేశాల్లో వేలాది మంది కార్మికులు ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే మూణ్నెల్లుగా ఉపాధి లేక, అత్యవసర వైద్య సేవలు, మందులకు కూడా నోచుకోక, కిరాయిలు కట్టలేక మనోవేదనకు గురవుతున్నారు.

1990 ఇరాక్‌ యుద్ధం సమయంలో కువైట్‌ నుంచి లక్షా 70 వేల మందిని ఉచితంగా భారత్‌దేశానికి తరలించిన సందర్భం గిన్నీస్‌ రికార్డుకెక్కింది. కరోనా కాలంలో ప్రస్తుతం గల్ఫ్‌ దేశాల్లో మాత్రం కార్మికుల పరిస్థితి దయనీయంగా మారింది. విమాన టికెట్లు కూడా కొనలేని దుస్థితి ఏర్పడింది. ఇంటికి వెళ్తామో లేదోనన్న దిగులుతోనే ఇప్పటికే గుండె ఆగి కొందరి ఊపిరి ఆగిపోయింది. గర్భిణులైతే మరీ ఇబ్బందుల్లో ఉన్నారు. బీపీ, గ్యాస్‌ ఇతరత్ర సమస్యలు తలెత్తుతున్నా వైద్యసేవలు సకాలంలో అందడం లేదని తెలుస్తోంది. గల్ఫ్‌ జీసీసీ దేశాల్లో మొత్తం 2 కోట్లా 30 లక్షలకుపైగా వివిధ దేశాలకు చెందినవారున్నారు. అందులో కార్మికులు, ఇంట్లో పనివారలు అధికం. వందేభారత్‌ మిషన్‌లో భాగంగా ఇప్పటిదాకా 3లక్షలా 8వేల 200 మంది భారతీయులు వివిధ దేశాల ఇండియన్‌ ఎంబసీల్లో స్వదేశానికి వెళ్తామని నమోదు చేసుకున్నారు. అయితే లక్షా 90 వేల మంది ఇప్పటిదాకా భారతీయులు విదేశాల్లో చిక్కుకుపోగా వారిలో 34 శాతం విద్యార్థులు, 30శాతం వలస కార్మికులు, మిగతావారిలో పర్యాటకులు తది తరులున్నారు. ఈ నేపథ్యంలో ప్రారంభమైన వందేభారత్‌ మిషిన్‌ ద్వారా మే 28 వరకు కేవలం 45,216 మందిని మాత్రమే తరలించారు. ప్రస్తుతం రెండో దశ జూన్‌ 13 వరకు పొడిగించడంతో ఆలోపు 60 దేశాల నుంచి లక్ష మందిని తరలించేందుకు 429 ఎయిరిండియా విమానాలు (311 అంతర్జాతీయ, 118 ఫీడర్‌) ఉపయోగించనున్నారు. ఇరాన్‌, శ్రీలంక, మాల్దీవ్స్‌ నుంచి నాలుగు నౌకల ద్వారా భారతీయులను తీసుకురానున్నారు.

‘అమ్నెస్టీ’వాసుల తరలింపు మరీ ఆలస్యం
సుమారు రెండు నెలలుగా కువైట్‌ ఆమ్నెస్టీ సెంటర్లలో ఉన్న భారతీయుల తరలింపు చాలా ఆలస్యం జరిగింది. ఆ దేశంలో ఇల్లీగల్‌గా ఉంటున్న 42వేల మంది భారతీయుల్లో క్షమాభిక్ష కోసం వివిధ దేశాలకు చెందిన 23,500 మంది రిజిస్టర్‌ చేసుకున్నారు. 7 వేల మంది ప్రభుత్వం కల్పించిన వసతిలో ఉంటున్నా స్వగ్రామాలకు వెళ్లేందుకు నిత్యం ఎదురుచూస్తున్నారు. మిగతావాళ్లు ఔట్‌పాస్‌, పాస్‌పోర్టుల కోసం వేచిచూస్తున్నారు. వీరేకాక వివిధ దేశాల్లో పర్యాటకులు, విద్యార్థులు, ట్యాక్సీ డ్రైవర్లు కూడా చిక్కుకుపోయారు. బుధవారం అమ్నెస్టీ నుంచి మూడు విమానాలు విజయవాడ, లక్నో, విశాఖపట్నంకు బయల్దేరాయి. అసలే కరోనా వంటి క్లిష్ట పరిస్థితుల్లో ప్రజలను వారివారి ప్రాంతాలకు సురక్షితంగా పంపించాల్సిన బాధ్యత ప్రభుత్వాలు వేగంగా చేపట్టాలని సామాజిక కార్యకర్త మురళీధర్‌రెడ్డి గంగుల (కువైట్‌) కోరారు. కొన్ని దేశాల్లో స్వస్థలాలకు చేరేందుకు ఉచిత టికెట్‌ సహా చేతి ఖర్చులకు డబ్బులు కూడా ఇస్తున్నట్టు తెలిపారు. ఇలాంటి సమయంలో ఎన్నారై శాఖ ఏర్పాటు చేసుంటే యుద్ధ ప్రాతిపదికన చర్యలు కొనసాగేవని అభిప్రాయం వ్యక్తం చేశారు. అయితే కరోనా వల్ల కంపెనీలకు ఆదాయం లేక కార్మికులకు యాభై శాతం మాత్రమే వేతనమని ప్రభుత్వం ప్రకటించనున్నట్టు సమాచారం.

వందేభారత్‌ మిషన్‌ వివరాలు..
(మే 30న సేకరించిన వివరాలు)
రాష్ట్రం విమాన సర్వీసులు ప్యాసింజర్లు
ఢిల్లీ 43 28,027
కేరళ 41 26,695
మహారాష్ట్ర 18 7558
కర్నాటక 18 5745
తెలంగాణ 13 5486
గుజరాత్‌ 19 4913
తమిళనాడు 14 3363
రాజస్థాన్‌ 12 2675
పంజాబ్‌ 7 2580
యూపీ 10 1873
ఏపీ 11 1743
జమ్ము
కాశ్మీర్‌ 5 1565
ప.బెంగాల్‌ 6 1445
బీహార్‌ 8 1346
ఒడిషా 7 1066
చండీఘర్‌ 3 449
అసోం 2 150
మధ్యప్రదేశ్‌ 1 150
గోవా 1 149

Courtesy Nava Telangana