తర్వాతి స్థానంలో ప్రధాని స్వరాష్ట్రం గుజరాత్‌

న్యూఢిల్లీ: దేశంలో దళితులు ఎక్కువ సంఖ్యలో హింసకు గురవుతున్న రాష్ట్రాలలో బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్‌ మొదటి స్థానంలో ఉంది. తర్వాతి స్థానంలో బీజేపీ పాలిత, ప్రధాని మోడీ స్వరాష్ట్రమైన గుజరాత్‌ ఉంది. నేషనల్‌ క్రైమ్‌ రికార్డ్స్‌ బ్యూరో (ఎన్సీఆర్బీ) వెలువరించిన నివేదిక ప్రకారం.. దళితులపై జరుగుతున్న హింసలో ఉత్తరప్రదేశ్‌ అగ్రస్థానంలో ఉంది. హింసలో మూకదాడులు, లైంగికదాడులు, హత్యలు, భూ సంబంధిత సమస్యల నేరాలు వంటి అంశాలకు సంబంధించినవి ఉన్నాయి. మరీ ముఖ్యంగా 2014 నుంచి 2018 వరకూ దళితులపై దాడులు యూపీలో గణనీయంగా 47 శాతం పెరిగాయి. యూపీ తర్వాత ప్రధాని మోడీ స్వరాష్ట్రమైన గుజరాత్‌ (26శాతం) రెండో స్థానంలో ఉంది. హర్యానా (15 శాతం), మధ్యప్రదేశ్‌ (14 శాతం), మహారాష్ట్ర (11 శాతం) ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. దీంట్లో గమనించాల్సిన విషయమేమంటే ఆయా సమయంలో ఈ రాష్ట్రాలను బీజేపీ పాలిస్తున్నది. ఈ నేపథ్యంలో రాష్ట్ర పాలన, శాంతిభద్రతలకు సంబంధించి అనేక ప్రశ్నలను లేవనెత్తుతున్నది. ఆయా రాష్ట్రాలలో దళితులపై జరిగిన ఎక్కువ సంఖ్యలో దాడులన్నీ బహిరంగ ప్రదేశాల్లో చోటుచేసుకోవటం గమనార్హం. గుజరాత్‌, మహారాష్ట్రలలో వరుడిని గుర్రంపై తీసుకెళ్తున్న క్రమంలో దాడులు జరిగిన ఘటనలు అనేకం ఉన్నాయి.

బికానేర్‌లోని నాపసర్‌ ప్రాంతంలో ఓ దళిత వరుడు గుర్రంపై కూర్చునందుకు ఆ ప్రాంతానికి చెందిన రాజ్‌పుత్‌ వర్గం దాడికి దిగింది. అలాగే, 2019 మేలో గుజరాత్‌లోని మెహసానా జిల్లా లోర్‌ గ్రామంలో దళిత వరుడు గుర్రంపై కూర్చునందుకు వారి కుంటుంబాన్ని ఠాకూర్‌ సంఘం బహిష్కరించింది. ఇదే నెలలో మధ్యప్రదేశ్‌లోనూ ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. 2018 ఏప్రిల్‌లో వివాహ ఉరేగింపులో గుర్రపు స్వారీ చేసినందుకు రాజస్థాన్‌లో ఉన్నత కులస్థులు ఆ దళిత వరుడుపై దాడి చేశారు. దీని అనంతరం మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలోనూ ఇలాంటి ఘటనే జరిగింది. హర్యానాలో అయితే ఉన్నత కులస్థుల రాళ్ల దాడినుంచి తనను రక్షించుకోవడానికి ఓ దళిత వరుడు ఏకంగా హెల్మెల్‌ ధరించాల్సి వచ్చింది.
దీనిపై యూపీకి చెందిన దళిత హక్కుల కార్యకర్త సుశీల్‌ గౌతమ్‌ మాట్లాడుతూ.. ‘ప్రస్తుతం దేశాన్ని పాలిస్తున్న నాయకులలో దళితులను చిన్నచూపు చేసే లక్షణం కన్పిస్తుంది. పైకి వేరే విధంగా చెబుతున్నప్పటికీ బీజేపీ, ఆరెస్సెస్‌ల భావజాలం ఇదేనని తెలుస్తుంది. యూపీని మతరాజ్యంగా మార్చే చర్యలు 2014 నుంచి ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలోనే దళితులపై దాడులు పెరుగుతున్నాయ’ని అన్నారు.

Courtesy Nava Telangana