తాజాగా వెల్లడైన పత్రాలతో మరిన్ని చిక్కులు
లక్నో : ఉత్తర ప్రదేశ్‌లోని ఎంప్లాయీస్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ (ఇపిఎఫ్‌) స్కామ్‌ యోగి ఆదిత్యనాథ్‌ ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతోంది. ప్రముఖ గృహ నిర్మాణ సంస్ధ దేవన్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ లిమిటెడ్‌ (డిహెచ్‌ఎఫ్‌ఎల్‌)లో ఉత్తర ప్రదేశ్‌ విద్యుత్‌ కార్పొరేషన్‌ సంస్ధ ఉద్యోగుల పిఎఫ్‌ సొమ్మును పెట్టుబడులుగా పెట్టిన సంగతి తెలిసింది. ఈ స్కామ్‌లో బాధితుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతున్నది. తాజాగా రాత్రికి రాత్రే విద్యుత్‌ కార్పొరేషన్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ అపర్ణను తొలగించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో సీనియర్‌ ఐఐఎస్‌ అధికారి ఎం. దేవరాజ్‌ను విద్యుత్‌ శాఖకు కొత్తగా కార్యదర్శిగా నియమించారు. రాష్ట్రంలో యోగి ప్రభుత్వం మార్చి 19, 2017న అధికారంలోకి వచ్చిన తరువాతే వివాదాస్పద ప్రైవేటు కంపెనీ డిహెచ్‌ఎఫ్‌ఎల్‌ను తీసుకు వచ్చినట్లు తాజా పత్రాలు వెల్లడిస్తున్నాయి. విద్యుత్‌ వపర్‌ కార్పొరేషన్‌ ఉద్యోగులకు చెందిన రూ.2,600 కోట్ల పిఎఫ్‌ నిధులను ఈ సంస్థకు తరలించారు. అయితే అంతకుముందు అధికారంలో ఉన్న అఖిలేష్‌ యాదవ్‌ నేతృత్వంలోని ప్రభుత్వ హయాంలోనే డిహెచ్‌ఎఫ్‌ఎల్‌లో ఇపిఎఫ్‌ నిధులు పెట్టుబడులుగా పెట్టాలని నిర్ణయం తీసుకున్నట్లు విద్యుత్‌ శాఖ మంత్రి శ్రీకాంత్‌ శర్మ అంతకుముందు తెలిపారు. యోగి ఆదిత్యనాధ్‌ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి ఐదు రోజుల ముందే ఉద్యోగుల పిఎఫ్‌ సొమ్మును డిహెచ్‌ఎఫ్‌ఎల్‌లో పెట్టుబడులుగా పెట్టాలని రాష్ట్ర విద్యుత్‌ రంగ ఉద్యోగుల ట్రస్ట్‌ సమావేశపు మినిట్స్‌ను, ఎఫ్‌ఐఆర్‌ను ప్రస్తావిస్తూ విద్యుత్‌ ఉద్యోగుల జాయింట్‌ కమిటీ నేతలు తెలిపారు. దీనిపై ఆల్‌ ఇండియా పవర్‌ ఇంజనీర్స్‌ ఫెడరేషన్‌ ఛైర్మన్‌ శైలేంద్ర దూబే ఫోన్‌లో ఐఎఎన్‌ఎస్‌తో మాట్లాడుతూ ఈ స్కామ్‌పై సిబిఐ విచారణ జరిపిస్తామన్న ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నప్పటికీ, విద్యుత్‌ మంత్రిత్వ శాఖలోని ఉన్నతాధికారులను తొలుత తొలగించాలని అన్నారు. అధికారులను తొలగించడం ద్వారా డిహెచ్‌ఎఫ్‌ఎల్‌కు సంబంధించిన పత్రాలు భద్రంగా ఉంటాయని తెలిపారు.

”యోగి ప్రభుత్వ హయాంలోనే మార్చి 24, 2017న నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టమైంది. సమావేశపు మినిట్స్‌ను పరిశీలిస్తే ఇపిఎఫ్‌ సొమ్మును పెట్టుబడిగా పెట్టేందుకు ప్రభుత్వం ఇద్దరు అధికారులను నియమించినట్లు తెలిసింది. 2017-2018 మధ్య కాలంలో డిహెచ్‌ఎఫ్‌ఎల్‌ఖు పెద్ద మొత్తంలో నిధులు బదిలీ అయ్యాయి. అందువల్ల ప్రస్తుతమున్న అధికారులు విద్యుత్‌ మంత్రిత్వ శాఖలో కొనసాగకూడదు” అని దూబే అన్నారు. వాస్తవానికి డిహెచ్‌ఎల్‌తో ఉత్తర ప్రదేశ్‌ ప్రభుత్వపు ఒప్పందం లక్నోలో పెద్ద ఎత్తున ఆందోళనలకు దారి తీసింది. లక్నో పోలీసులు దీనిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. ఈ కంపెనీ ప్రమోటర్లను ఇటీవల ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఇడి) ప్రశ్నించింది. దావూద్‌ ఇబ్రహీంకు మాజీ సహాయకుడు ఇక్బాల్‌ మిర్చి చెందిన కంపెనీకి, వారికి గల సంబంధాలపై విచారణ జరిపింది. ఈ స్కామ్‌పై విద్యుత్‌ రంగానికి చెందిన ఇంజనీర్లు, ఉద్యోగుల సంఘాలు ఆందోళనకు దిగాయి. పెద్ద ఎత్తున నిరసన తెలుపుతు న్నాయి. ఈ నేపథ్యంలో యుపిపిసిఎల్‌ ఛైర్మన్‌కు రాసిన లేఖలో ఉద్యోగుల జిపిఎఫ్‌, సిపిఎఫ్‌ సొమ్మును డిహెచ్‌ఎఫ్‌ఎల్‌లో పెట్టుబడులు పెట్టాలన్న నిర్ణయంపై ప్రశ్నించాయి. ప్రతిపక్షాలు ప్రధానంగా కాంగ్రెస్‌ నేత ప్రియాంక గాంధీ యోగి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. దీంతో ఇది తాము తీసుకున్న నిర్ణయం కాదని గతంలో అదికారంలో ఉన్న అఖిలేష్‌ యాదవ్‌ నేతృత్వంలోని ప్రభుత్వ నిర్ణయమని పేర్కొంటూ ఇది ఏప్రిల్‌ 2014లోనే జరిగిందని, దాని దర్యాప్తు క్రమాన్ని 2016లో కూడా కొనసాగించారని చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తోంది.

Courtesy prajasakti..