కా కృష్ణార్జునరావు

మన ఉసా గారు బహుముఖ ప్రజ్ఞాశాలి.
ఆయన హేతువాది, కమ్యూనిస్టు, విప్లవకారుడు, ప్రజల నాడి తెలిసిన ఉద్యమ కారుడు, కవి, రచయిత, కళాకారుడు, గాయకుడు, అనర్గళ ఉపన్యాసకుడు, బహుజన సిద్ధాంత కర్త.

అంతే కాదు! ఆయన చిరు దరహాస ముఖారవిందుడు, చతుర సుసంభాషణా కోవిదుడు, హాస్య ప్రియుడు. హాస్యాన్ని ఆస్వాదించటమే కాదు,ఆయన హాస్యాన్ని బాగా పండించి తోటి వారిని కడుపుబ్బ నవ్వించగలడు. ఆయన పండించే హాస్యం కూడా సామాజిక చైతన్యాన్ని రగిలించటమనేది విశేషం.

మరీ ముఖ్యంగా ఆయన పీడిత ప్రజల పక్షపాతి, ఆయన పలకరింపులో ఉండే మైత్రీ ధోరణి తోటి మిత్రుల శ్రవణాలకు  ప్రియాహారంగా ఉంటుంది. ఇవన్నీ ఉసా గారి గురించి తెలియని వారికి అతిశయోక్తులుగా అనిపించు వచ్చు. కానీ ఆయనతో వ్యక్తిగత  పరిచయం  బాగా ఉన్న మిత్రులకు తెలుసు, పైన చెప్పినవన్నీ యదార్థాలేనని.

మనం ఒకే వ్యక్తిలో ఇన్ని ప్రజ్ఞా విశేషాలు చూడటం అనేది చాలా చాలా అరుదైన విషయంగా చెప్పుకోవచ్చు. ఉసా ఒక ఉద్యమ కారుడిగా ఉన్న కాలంలో  ఆయన ఎక్కడ అడుగు పెడితే అక్కడ ప్రజా ఉద్యమ ప్రకంపనలు పుట్టించే వాడు. ఆయనతో మాట్లాడుతూ ఉంటే సమయం  అసలు తెలిసేదే కాదు. ఆకలి – నిద్రమా నుకుని మరీ ఆయన చెప్పే మాటలు వినాలని పించేది.

మాది మంగళగిరి పట్టణం. ఇది చేనేత రంగానికి బాగా ప్రసిద్ధి. ఉసా గారు   UCCRI (ML) పార్టీ ఆర్గనైజర్ గా మంగళగిరిలో చేనేత ఉద్యమం నిర్మించటానికి వచ్చారు. ఆయన పార్టీ బాధ్యుడుగా మంగళగిరిలో నడిపిన చేనేత ఉద్యమం మంగళగిరి చరిత్రలో అంతకు ముందు గానీ, ఆ తర్వాత గానీ ఎన్నడూ చూడలేదు. అక్కడ అంత గొప్ప చేనేత ఉద్యమం ఉసా డైరక్షన్ లో స్థానిక పార్టీ సభ్యులు నడిపారు.

నేను మంగళగిరిలో ఏదో ఒక చిరు వ్యాపారం చేసుకుంటూ బతుకు బండిని భారంగా లాగుతూ ఉండే వాడిని. నేను కూడా UCCRI (ML) పార్టీకి శ్రేయోభిలాషిగా ఉంటూ అప్పుడప్పుడు కార్యకర్తగా కూడా పనిచేసే వాడిని.

ఆ విధంగా ఉసా గారితో నాకు కొద్ది కాలం పాటు వ్యక్తిగత పరిచయం కలిగింది. ఉసా పార్టీ పనుల రీత్యా వేరే ఊళ్లకు వెళ్లి వస్తుండే వాడు. ఆ తరుణంలో మళ్ళీ ఉసా ఎప్పుడు వస్తాడా అని ఎంతో ఆత్రుతతో ఎదురు చూస్తూ ఉండే వాడిని. నేనే కాదు! నాలాగ ఇంకా అనేక మంది మిత్రులు ఉసా మాటలు వినటానికి  ఎదురు చూస్తూ ఉండే వాళ్లు.

ఉసా మాట్లాడుతుంటే ఒక్క మాట కూడా దాటి పోకూడదని చెవులు నిక్క పొడుచుకుని మరీ వినే వాడిని నేను. ఆయన మాట్లాడే సందర్భంలో మధ్య మధ్యలో విషయానికి తగిన విధంగా సామెతలు వదిలే వాడు. ఒక్కో సారి ఆ సామెతలకు పొట్ట చెక్కలయ్యేలా నవ్వుకునే  వాళ్లం.

గుంటూరులో జరిగిన OPDR మహాసభల సందర్భం లోను, మంగళగిరి పక్కనే ఉన్న కాజ గ్రామంలో జరిగిన జనసాహితి శిక్షణా తరగతుల సందర్భం లోను,రాజమండ్రి ఆనం కళా మందిరంలో జరిగిన జనసాహితి మహాసభల సందర్భం లోను, విశాఖ పట్నం సాలిడారిటీ మహాసభల సందర్భం లోను,

కూచినపూడిలో ముత్తిరెడ్డి  శ్రీరాములు గారి ఎన్నికల ప్రచార సందర్భం లోను ఉసా గారితో కొద్ది పాటి సహచర్యం  నాకు కలిగింది.

ఉసా నల్లగొండ జిల్లా మోతుకూరులో పెద్ద ఎత్తున రైతు ఉద్యమం నిర్మించాడు. ఆ సందర్భంగా రైతాంగ సమస్యలపై బహుశా పోచంపాడు ప్రాజెక్టు కుంభకోణం అనే ఒక చిన్న బుక్ లెట్ వేసి రైతాంగాన్ని పెద్దగా కదిలించాడు.

ఆ పుస్తకంలో… మంచినీళ్ళ కోసం ప్రభుత్వ అధికారులు ఊళ్లో అక్కడక్కడా  బోర్లు వేశారు. అయినా ఆ బోర్లలో నీళ్లు పడలేదు. అయినా కూడా కాంట్రాక్టర్లు నీళ్లు పడని ఆ బోరులకు పంపులు బిగించి, చుట్టూ సిమెంట్ వరలతో పళ్లేలు కట్టారు. నీళ్లు లేని బోరులకు పంపులు – పళ్లేలు ఎందుకని కాంట్రాక్టర్లను  అడిగితే వాళ్లు ఈ విధంగా అన్నీ అమర్చి ఫొటోలు తీసి చూపిస్తేనే ప్రభుత్వం తమకు డబ్బు సాంక్షన్ చేస్తుంద ని అన్నారంట.

ఈ విషయాలన్నీ ఉసా గారు పూస గుచ్చి నట్టుగా, ఎంతో ఆసక్తి కరంగా ఆ పుస్తకంలో రాసాడు. ఆ సమస్యపై ఆ పుస్తకంలోనే ఉసా చేసిన కామెంట్ నాకు ఇప్పటికీ గుర్తు ఉంది చచ్చినోడికి సోకు చేసినట్లు నీళ్లు పడని బోర్లుకు కాంట్రాక్టర్లు వచ్చి పంపులు – పళ్లేలు కట్టి పోయారు.  అని రాశాడు. ఆ విధంగా ఆయన రాతలో జవం – జీవం నిండుగా తొణికిస లాడుతుంటాయి.

రెండు సంవత్సరాల క్రితం  CPM పార్టీ రైతు సంఘం వారి ఆధ్వర్యంలో జరిగిన మహారాష్ట్ర రైతు పాద యాత్ర  కమ్యూనిస్టు ఉద్యమాలపై మళ్ళీ ఆశలు చిగురించేలా చేసింది. ఆ సందర్భంగా నేను ఉసా గారికి ఫోన్ చేసి మహారాష్ట్ర రైతు ఉద్యమం మోతుకూరులో మీరు నడిపిన రైతు ఉద్యమాన్ని గుర్తు చేసింది  అన్నాను. అందుకు ఆయన చాలా సంతోషపడి నాకు థాంక్స్ చెప్పి, మోతుకూరు రైతు ఉద్యమం మీకు ఇంకా గుర్తు ఉందా? అని ఆశ్చర్యంగా ప్రశ్నించారు. నేను పైన చెప్పిన బోర్లు విషయం, ఆ సందర్భంగా వేసిన బుక్ లెట్ విషయం గుర్తు చేయగా ఉసా మరింతగా ఆశ్చర్య పోయి నన్ను ప్రశంసించారు.

కొద్ది పాటి పరిచయం ఉన్న వారికి కూడా ఉసా గారు ప్రజా ఉద్యమాలకు సంబంధించి ఎన్నో  మధుర జ్ఞాపకాలను అందించారు. ఇక నిరంతర సహచరులుగా పని చేసిన వారి జ్ఞాపకాలు రికార్డు చేయాలంటే ఎన్ని గ్రంథాలు రాయవలసి ఉంటుందో చెప్పలేం.

తెలుగు రాష్ట్రాల్లోని బహుజన ప్రజా సమూహాలు చిరస్థాయిగా గుర్తుంచుకో దగిన కుల – వర్గ సిద్ధాంత వేత్త ఉసా గారు.

ఉసా మరణం పట్ల సంతాపం తెలిపే నెపంతో  ఒక ML పార్టీ ఉసా పట్ల అనేక అనుచితమైన రాతలు రాయటం చాలా బాధాకరం. అలాంటి రాతల వల్ల రాసిన వారి విజ్ఞత ప్రశ్నార్ధక మవుతుందే తప్ప, ఆ రాతల వల్ల ఉసా గారి కీర్తి ప్రతిష్టలు ఎంత మాత్రం పడిపోవు అనేది ముమ్మాటికీ నిజం.

@ జోహార్లు ఉసా గారికి.
@ బహుజన సిద్ధాంత కర్త ఉసా కు జోహార్లు.
@ లాల్, నీల్ ఐక్య సిద్ధాంత కర్త ఉసా గారికి జోహార్లు 

మానవ వికాస మండలి,
మంగళగిరి, గుంటూరు జిల్లా..