– నిర్బంధ కేంద్రాల్లో 900 మంది చిన్నారులు 
– ఇమ్మిగ్రేషన్‌ అధికారులపై చర్యలు తీసుకోవాలి : ఏసీఎల్‌యూ 

శరణార్థుల పట్ల ట్రంప్‌ సర్కారు అనుసరిస్తున్న తీరును అమెరికన్‌ సివిల్‌ లిబర్టీస్‌ యూనియన్‌ (ఏసీఎల్‌యూ) తప్పుపట్టింది. గతేడాది ఇమ్మిగ్రేషన్‌ అధికారులు 900 మంది చిన్నారులను నిర్బంధ కేంద్రాలకు తరలించడం పట్ల ఆందోళన వ్యక్తం చేసింది. ట్రంప్‌ సర్కారుపై చర్యలు తీసుకోవాలని, బాలల హక్కులను పరిరక్షించాలని న్యాయస్థానాన్ని ఏసీఎల్‌యూ అభ్యర్థించింది. చిన్నారులను తల్లిదండ్రుల నుంచి వేరు చేయడాన్ని నిరసిస్తూ కాలిఫోర్నియా జిల్లా కోర్టులో వ్యాజ్యం దాఖలు చేసింది. ఈకేసుపై విచారణ చేపట్టేందుకు న్యాయస్థానం అంగీకరించింది. కౌంటర్‌ దాఖలు చేసేందుకు ప్రభుత్వానికి నాలుగు వారాల గడువు ఇచ్చింది. వివరాల్లోకి వెళితే…అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్‌ ట్రంప్‌ బాధ్యతలు చేపట్టిన తర్వాత వలసల నిర్మూలనపై ప్రత్యేక దృష్టి పెట్టారు. మెక్సికో వలసదారులపై ఉక్కుపాదం మోపారు. ఎక్కడిక్కడ సరిహద్దుల్లోనే వలసదారులను అదుపులోకి తీసుకోవాలని ఇమ్మిగ్రేషన్‌ అధికారులను ఆదేశించారు. సరైన ధ్రువీకరణ పత్రాలున్న వలసదారులను కూడా సరిహద్దు దాటి అమెరికాలో ప్రవేశించే అవకాశం ఇవ్వడం లేదు. అంతేగాకుండా, యూఎస్‌-మెక్సికో సరిహద్దులో గోడ నిర్మించాలని యోచిస్తున్నారు. యూఎస్‌ రక్షణశాఖ మిగులు నిధులను గోడ నిర్మాణానికి ఉపయోగించుకోవచ్చునని గతవారం యూఎస్‌ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో, రానున్న అధ్యక్ష ఎన్నికలకు ముందే గోడ నిర్మాణం చేపట్టాలని ట్రంప్‌ ఉవ్విళ్లూరుతున్నారు. ముస్లింల జనాభా అధికంగా ఉన్న దేశాల నుంచి అమెరికాకు వచ్చే వలసదారులను అడ్డుకోవాలని ప్రత్యేక కార్యాచరణ రూపొందించారు.

వీసాల జారీలో కఠినతరమైన నిబంధనలు ప్రవేశపెట్టారు. అమెరికాలో ఆశ్రయం కోసం వచ్చి స్థిరపడిన మెక్సికన్లను లక్ష్యంగా చేసుకున్నారు. ట్రంప్‌ దృష్టిలో మెక్సికన్లంటే చులకన భావం. వీరంతా డ్రగ్స్‌ మాఫియాదారులని, దొంగలని ట్రంప్‌ అభిప్రాయం. అనేక సందర్భాల్లో మెక్సికన్లపై తన అకస్సు వెళ్లగక్కారు. మెక్సికన్ల వలసలపై ట్రంప్‌ కఠిన వైఖరి అవలంభిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. మెక్సికో నుంచి వస్తున్న వలస దారులను సరిహద్దు గస్తీ బలగాలు తనిఖీ చేస్తున్నాయి. వలసదారులను అక్రమంగా నిర్బంధిస్తు న్నాయని ఏసీఎల్‌యూ తన 218 పేజీల పిటిషన్‌లో పేర్కొంది.

(Courtacy Nava Telangana)