అవసరమైన సమయంలో.. ప్రాణానికి ఆపద ఉన్న సమయంలో.. ‘డయల్‌ 100’కు ఫోన్‌ చేయకపోవడం వల్ల ‘దిశ’ బలైపోయింది!

అర్ధరాత్రి వేళ అలజడి సృష్టిస్తున్న అల్లరిమూకలపై ఫిర్యాదు చేయడానికి ఆ నంబరుకు ఫోన్‌ చేసిన యువకుడిని చితక్కొట్టాడో కానిస్టేబుల్‌!!

డయల్‌ 100కు ఫోన్‌ చేస్తే సవాలక్ష ప్రశ్నలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి చాలా మందికి అనుభవమే. ఆపన్నుల రక్షణ కోసం మన పోలీసులు విస్తృతంగా ప్రచారం చేస్తున్న ‘డయల్‌ 100’ పరిస్థితి ఇది!!

కానీ.. అభివృద్ధి చెందిన దేశమైన అమెరికాలో పరిస్థితి అలా ఉండదు. ఎమర్జెన్సీ సర్వీస్‌ ‘911’.. ఆపన్నులకు అభయహస్తం. ఎలాంటి విపత్కరస్థితిలో ఉన్నా ఆదుకునే అండ. ఆ తరహాలోనే మన డయల్‌ 100ను కూడా చేయగలమా? ప్రయత్నాలు మొదలయ్యాయి.. ఫలితం కోసం వేచి చూడాలి.

  • ‘దిశ’ ఘటనకు నేటితో నెల రోజులు
  • మానని గాయం..పెరిగిన భయం
  • అమెరికాలో911 భారత్‌లో100
  • 1968లో మొదలు.. ఎప్పటికప్పుడు ఆధునికీకరణ
  • ప్రతీ ఇల్లూ, ఆఫీసూ డేటా వ్యవస్థకు అనుసంధానం
  • ఎంత విపత్కర స్థితిలో ఉన్నా కాల్‌ వెళ్లేలా ఏర్పాట్లు
  • మన దగ్గర ‘డయల్‌ 100’ నిర్వహణలో లోపాలు

అనుకోని ఆపద ఏది వచ్చినా అమెరికన్లకు మొదట గుర్తొచ్చేది దేవుడు కాదు… 911. అది అమెరికా ఎమర్జెన్సీ సర్వీసు నంబరు… సామాన్యుడికి కష్ట సమయంలో ప్రభుత్వం అందించే భరోసా.. కాల్‌ చేసిన నిమిషాల్లో పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, వైద్య సహాయ సిబ్బంది వచ్చి వాలిపోతారు. ముప్పు తొలగింది అన్నాకే కదులుతారు. భారతదేశంలో నేరం జరిగితే 100కి కాల్‌ చేస్తాం. అగ్ని ప్రమాదం జరిగితే 101కి కాల్‌ చేస్తాం. రోడ్డు ప్రమాదం జరిగితే 108కి కాల్‌ చేస్తాం. మహిళలు, పిల్లలు వేధింపులకు గురైతే 1090కు కాల్‌ చేస్తాం. ఇన్ని నంబర్ల జంఝాటం లేకుండా అమెరికాలో అన్ని సమస్యలకూ 911 నంబరే తారకమంత్రం. ఈ వ్యవస్థ 1968లోనే ప్రారంభమైంది. 24 గంటలూ, 365 రోజులూ పనిచేసే వ్యవస్థ ఇది. ఇప్పటికీ చాలా విజయవంతంగా అత్యవసర సేవలను అందిస్తోంది. ఒక అంచనా ప్రకారం.. 98 శాతం అమెరికన్లకు ఈ వ్యవస్థ అందుబాటులో ఉంది.

ఇప్పుడిప్పుడే భారత్‌లోనూ 112 రూపంలో ఇలాంటి వ్యవస్థను రూపొందించే ప్రయత్నం జరుగుతోంది. కేవలం ఉగ్రదాడులు, భద్రతాపరమైన సవాళ్ల సమయంలోనే కాదు, సాధారణ మానవ సమస్యలకు, విపత్కర పరిస్థితుల్లో ఉన్న వారికి ఇది ఎనలేని సేవలందిస్తుంది. ప్రమాదాలు, ఆరోగ్యపరమైన ఇబ్బందులు, దొంగతనాలు, హత్యలు, అత్యాచారాలు, తలిదండ్రులు లేనపుడు పిల్లలు ఇంట్లో లోపల్నుంచి తాళం వేసుకుని విపత్కర పరిస్థితుల్లో పడడం.. ఇలా అన్ని సమస్యల్లోనూ అక్కడివారికి 911 సర్వీసు అండగా నిలుస్తుంది. చాలాకాలంగా సేవలందిస్తున్న ఈ 911 వ్యవస్థకు పదేళ్ల క్రితం ఆధునికత జోడించి.. ‘ఈ-911 (ఎన్‌హాన్స్‌డ్‌ 911)’ వ్యవస్థను అందుబాటులోకి తెచ్చారు.

మెడికల్‌ అలర్ట్‌ ట్యాగ్స్‌ : నిస్సహాయ స్థితిలో ఉన్నపుడు 911కు డయల్‌ చేయడమూ కష్టమే. ముఖ్యంగా గుండెపోటు వచ్చినవారు, ఇతర ఆరోగ్య సమస్యలతో అతి ప్రమాదంలో ఉన్నవారు ఏం చేయాలి..? వీరి కోసం మెడికల్‌ అలర్ట్‌ ట్యాగ్స్‌ను అందజేసే వ్యవస్థ ఎప్పటినుంచో అమలవుతోంది. ఇది ఒక చిన్న బటన్‌ ఉండే సాంకేతిక ఉపకరణం. మెళ్లో వేలాడదీసుకోవచ్చు లేదా బ్రేస్‌లెట్‌గా ధరించవచ్చు. ఎమర్జెన్సీ పరిస్థితి వచ్చినపుడు ఆ బటన్‌ నొక్కితే చాలు… 15-20 నిమిషాల్లో సహాయక సిబ్బంది ఇంటి ముందు వాలతారు. దుండగులు ఇంటి తలుపు బద్దలుకొట్టుకుని లోపలికి చొరబడే ప్రయత్నం చేస్తే.. గృహభద్రత వ్యవస్థలో భాగంగా సెన్సర్లు వెంటనే అలారం మోగిస్తాయి. ఆ దృశ్యం అనేక సీసీటీవీల్లో రికార్డయిపోతుంది. నేరుగా 911కు కాల్‌ వెళ్తుంది. పోలీసులు ఆ ఇంటిని చుట్టుముట్టేంత వేగంగా ఈ వ్యవస్థ పనిచేస్తుంది.

మన వ్యవస్థలో లోపం ఏంటి? : అమెరికాలో 50 రాష్ట్రాల్లోనూ ఎమర్జెన్సీ నంబరు ఒకటే.. అది 911. మనదేశంలో 100, 101, 108, 104.. ఇలా రకరకాల నంబర్లుంటాయి. దీని వల్ల గందరగోళం ఏర్పడే పరిస్థితి ఉంది. అయితే, వాటన్నింటికీ ప్రత్యామ్నాయంగా 112ను తెచ్చాక ఆ గందరగోళం తగ్గింది. ఇక.. అమెరికాలో 911కు పబ్లిక్‌ పాయింట్ల నుంచి కూడా డయల్‌ చేసే సౌకర్యం ఉంటుంది. పూర్తిగా 911 నొక్కే పరిస్థితి లేనప్పుడు.. ఫోన్‌లోని ఏదేనా ఓ నంబరును ఒత్తి పట్టుకున్నా.. 911కు కాల్‌ వెళ్లిపోయే వ్యవస్థనూ కొన్ని రాష్ట్రాల్లో నెలకొల్పారు. ఇలా ఎన్ని రకాలుగా సమస్యలు రావచ్చో ముందే ఊహించి వాటిని సమర్థంగా ఎదుర్కొనేలా ఏర్పాట్లు చేసుకున్నారు. కానీ, మనదగ్గర పరిస్థితి అలా లేదు. – సెంట్రల్‌ డెస్క్‌

వైఫై భద్రతా అప్రమత్త వ్యవస్థ : ఇంట్లో గ్యాస్‌ లీకయినా, అగ్నిప్రమాదం జరిగినా వాటిని వెంటనే గుర్తించే ఆధునిక వ్యవస్థ ఇది. అలాంటి ప్రమాదాలు సంభవించినప్పుడు వైఫై ద్వారా వెంటనే 911 డిస్పాచ్‌ టీమ్‌కు సమాచారం అందుతుంది. ఇంట్లోని వ్యక్తులు ప్రత్యేకంగా కాల్‌ చేయనక్కరలేదు. ఇది గతంలోనూ ఉండేది. అది విద్యుత్‌ వ్యవస్థతో అనుసంధానమై ఉండేది. ఇపుడు ఆ స్థానే వైఫై వచ్చింది.

జవాబుదారీతనం: అమెరికాలో 911 వ్యవస్థ జవాబుదారీగా ఉంటుంది. డిస్పాచ్‌ సెంటర్లో పెద్దపెద్ద స్ర్కీన్లలో కాల్‌ లొకేషన్‌, ఇతర డేటా క్షణాల మీద ప్రత్యక్షమవుతుంది. ఎవరైనా విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించినా, ఆపదలో ఉన్నవారు ఫోన్‌ చేసినప్పుడు నిర్లక్ష్యంగా బదులిచ్చినా, వెంటనే సిబ్బందిని పంపకపోయినా కఠిన శిక్షలుంటాయి. తప్పుడు సమాచారం పంపినా ప్రాసిక్యూట్‌ చేస్తారు. అందుకే 911 వ్యవస్థ అంత విశ్వసనీయతను పొందింది. డయల్‌ 100పై వస్తున్న విమర్శల నేపథ్యంలో పోలీసు ఉన్నతాధికారులు దాని పనితీరును మెరుగుపరచేందుకు ఏర్పాట్లు చేశారు.

ఏమిటీ ఈ-911? : అత్యంత ప్రమాదకర స్థితిలో ఉన్న వారికి ఎంతో ఉపయుక్తంగా ఉండే వ్యవస్థ ఇది. ఏదైనా ఆపద వచ్చినపుడు బాధితులు 911కు కాల్‌ చేస్తే ఆ ఫోన్‌కాల్‌.. పబ్లిక్‌ సేఫ్టీ ఆన్సరింగ్‌ పాయింట్‌ (పీఎ్‌సఏపీ)కి వెళుతుంది. ఇది ఓ విశాల ప్రాంగణంలో ఉండే బహుళ విభాగ వ్యవస్థ. స్థానిక ప్రభుత్వాల ఆధ్వర్యంలో నడుస్తుంది. స్థూలంగా చెప్పాలంటే ఇది ఓ కాల్‌ సెంటర్‌. కాల్‌ నమోదు చేసి అత్యవసర సిబ్బందిని పంపే కేంద్రం. ఇది పోలీసు యంత్రాంగానికి అనుసంధానమై ఉంటుంది. అందులోని సిబ్బంది సుశిక్షితులైనవారు. బాధితుల నుంచి ఫోన్‌ రాగానే వారు నిర్ణీత పద్ధతి ప్రకారం ప్రశ్నలు అడుగుతూ వీలైనంత మేరకు పూర్తిస్థాయి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. ఒకవేళ అవతలివారు సమాధానం చెప్పలేని పరిస్థితి ఉంటే ఏ ప్రాంతం నుంచి ఆ కాల్‌ వచ్చింది, మొబైల్‌ ఫోన్‌ నుంచి వచ్చిన కాల్‌ అయితే ఏ టవర్‌ నుంచి వచ్చింది… అన్నది క్షణాల మీద పరిశీలించి, ఎమర్జెన్సీని బట్టి దగ్గర్లోని మెడికల్‌ లేదా అగ్నిమాపక లేదా పోలీసు లేదా ఇతర సంబంధిత విభాగాల సిబ్బందిని అలర్ట్‌ చేసి నిమిషాల్లో ఘటనాస్థలానికి పంపుతారు.

Courtesy Andhrajyothi