-అమెరికాలో 36.5లక్షలు, బ్రెజిల్‌లో 21లక్షలు, ఇండియాలో 11లక్షల కరోనా కేసులు
-ప్రజలపై బాధ్యతనెట్టేసిన ట్రంప్‌, బోల్సోనారో, మోడీ
– కార్పొరేట్‌ కంపెనీల ప్రయోజనాలకు పెద్దపీట
– ఆరోగ్య వ్యవస్థను మెరుగుపర్చాలనే ఆలోచనే లేదు: రాజకీయ విశ్లేషకులు

కరోనా మహమ్మారి వ్యాప్తిని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ చాలా తేలిగ్గా తీసుకున్నారు. మాస్క్‌ ధరించడానికి కూడా ఆయన అంగీకరించలేదు. తర్వాత పెట్టుకున్నా ప్రభుత్వపరంగా తీసుకున్న చర్యలు ఏమీ లేవు. ‘చిన్నపాటి జ్వరం’…అంటూ బ్రెజిల్‌ అధ్యక్షుడు బోల్సోనారో కూడా సీరియస్‌గా తీసుకోలేదు. లాక్‌డౌన్‌తో కరోనా వైరస్‌ను పూర్తిగా అడ్డుకున్నామని ప్రధాని మోడీ ప్రకటించారు. ఇప్పుడు రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతున్నా.. సహజీవనం చేయాలంటున్నారు. అమెరికా, బ్రెజిల్‌, భారత్‌లలో వైరస్‌ విజృంభిస్తున్నది. బాధ్యత అంతా ప్రజలపై నెట్టేసి…పాలకులు చేతులు దులుపుకున్నారు. ఈ మూడు దేశాలూ ఒకేవిధమైన తప్పులు చేశాయని, వాటి ఫలితం ప్రజలు అనుభవిస్తున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.

న్యూఢిల్లీ : కరోనాబారిన పడి అమెరికా, బ్రెజిల్‌, భారత్‌ విలవిల్లాడుతున్నాయి. ఈ మూడు దేశాల్లోని ప్రజలు ఊహించని మానవ సంక్షోభంలో చిక్కుకున్నారు. కొద్ది నెలల క్రితం ఈ మూడు దేశాల నాయకులు చెప్పినదానికి, ఇప్పుడు జరుగుతున్న దానికి పొంతనే లేదు. వైరస్‌ వ్యాప్తిని అడ్డుకోవటంలో పాలకులు తీసుకున్న చర్యలేవీ ఫలించలేదని ప్రస్తుత గణాంకాలే చెబుతున్నాయి. మొదట్నుంచీ…అమెరికా, బ్రెజిల్‌, భారత్‌…ఒకే రకమైన తప్పులు చేస్తున్నాయని, అందుకే ఈ దేశాల్లో కేసుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతున్నదని విశ్లేషకులు చెబుతున్నారు. వైద్యాధికారులు, శాస్త్రవేత్తలు సూచనలు చేసినా జాగ్రత్తలు తీసుకోలేదు. డబ్ల్యూహెచ్‌ఓ సూచనలను ఖాతరు చేయలేదు. సామాజిక వ్యాప్తి ప్రారంభమైతే అడ్డుకోవడంకష్టమవుతుందని చెబుతూ వస్తున్నా.. పట్టించుకున్న దాఖలాలు లేవు. సామాజిక వ్యాప్తి లేదని పేర్కొన్నాయి. భారత ప్రధాని మోడీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌, బ్రెజిల్‌ అధ్యక్షుడు బోల్సోనారో… రాజకీయ విధానాలు, పాలనాపరమైన నిర్ణయాలు ఒకే విధంగా ఉన్నాయని, వైరస్‌ వ్యాప్తిని సరిగా అంచనా వేయలేకపోయారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వైరస్‌ కట్టడి కోసం ముందస్తు ప్రణాళిక లేకుండా విధించిన లాక్‌డౌన్‌ వల్లే ప్రస్తుతం దేశంలో కేసులు పెరగడానికి కారణమని పలువురు తెలిపారు. అమెరికా, బ్రెజిల్‌లోనూ ఇదే పరిస్థితి అని మేధావులు పేర్కొన్నారు. ఆర్థిక పరిస్థితిని కాపాడుకుంటూ ఆరోగ్యవ్యవస్థను కాపాడుకోవాలని శాస్త్రవేత్తలు ఎంతచెప్పినా వినేందుకు సిద్ధపడలేదు.

మూడు దేశాల్లో 48శాతం కేసులు
జులై 18నాటికి ప్రపంచంలో కరోనా కేసుల సంఖ్య 1.41కోట్లకు చేరుకుంది. ఇందులో 48శాతం కేసులు కేవలం మూడు దేశాల్లో (అమెరికా, భారత్‌, బ్రెజిల్‌) నమోదయ్యాయి. ఆ తర్వాత స్థానాల్లో….రష్యా(7.6లక్షల కేసులు), పెరూ(3.5), దక్షిణాఫ్రికా (3.4), మెక్సికో (3.3), చిలీ (3.3), బ్రిటన్‌ (2.9), ఇరాన్‌ (2.7) దేశాలున్నాయి. ఈ దేశాల్లో వైరస్‌ ఇంతగా వ్యాప్తిచెందడానికి కొన్ని ప్రత్యేక కారణాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. వైరస్‌ వ్యాప్తి చెందుతున్న తీరు చూసి ప్రజలు భయాందోళనలతో వణికిపోతున్నారు. నోటి మాటలతో అధికారంలో ఉన్న రాజకీయ నాయకత్వం సరిపుచ్చుతున్నదని, బాధ్యత అంతా ప్రజలపై మోపిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

అమెరికా, బ్రెజిల్‌, భారత్‌ విషయానికొస్తే, ఈ మూడు దేశాలకు కొన్ని సారూప్యతలున్నాయి. మూడు దేశాల్లోనూ నాయకుల (ట్రంప్‌, బోల్సోనారో, మోడీ) వ్యక్తిగత వ్యవహార శైలి, పాలనాపరమైన నిర్ణయాలు ఒకే విధంగా ఉంటాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. సంక్షోభ సమయంలోనూ, స్వేచ్ఛా మార్కెట్‌, ప్రపంచీకరణ విధానాలకు ప్రాధాన్యత ఇవ్వటం, కార్పొరేట్‌ కంపెనీలకు అనుకూలంగా వ్యవహరించటం … వంటివి ఈ ముగ్గురులోనూ కనిపించాయి. కరోనా వ్యాప్తిని తక్కువ అంచనా వేయటం, ప్రభుత్వ ఆరోగ్య వ్యవస్థను మెరుగుపర్చలేకపోవటం సంక్షోభాన్ని తీవ్రతరం చేసింది. ఈ ఫలితాన్ని ప్రజలు అనుభవించాల్సి వస్తున్నదని విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేశారు.

అమెరికాలో ట్రంప్‌ వైఖరే కారణం
వైరస్‌ వ్యాప్తిని అధ్యక్షుడు ట్రంప్‌ సీరియస్‌గా తీసుకోలేదు. వైద్య నిపుణులు, వ్యక్తిగత సలహాదార్లు తీవ్రంగా హెచ్చరిస్తేగానీ తన ధోరణిలో మార్పు రాలేదు. అయిష్టంగానే కరోనా టెస్టింగ్‌కు గ్రీన్‌ సిగల్‌ ఇచ్చాడు. అనేక నగరాల్లో కట్టుదిట్టమైన చర్యలు లేకపోవటం వల్ల వైరస్‌ ఊహించని స్థాయిలో విస్తరించింది. అక్కడి నిపుణులు చెబుతున్నదాని ప్రకారం, వైరస్‌ను అడ్డుకోవటంలో ఆరు వారాల ఆలస్యం జరిగింది. అధ్యక్ష ఎన్నికల్లో రెండోసారి గెలవాలన్న ఆతృత తప్ప ట్రంప్‌ మదిలో మరోటి కనిపించటం లేదు.

సకాలంలో చర్యలు చేపట్టని బోల్సోనారో
చైనా అనుభవాలు ప్రత్యక్షంగా చూశాక కూడా, అధ్యక్షుడు బోల్సోనారో వైరస్‌ను అడ్డుకోవటంపై వెంటనే చర్యలు చేపట్టలేదు. ‘ఇది చిన్నపాటి జ్వరం’ వంటిదేనని కొట్టిపారేశారు. టెస్టింగ్‌ కిట్లు, ప్రయోగశాలలు(ల్యాబులు) ఏర్పాటుచేయటంలో విపరీతమైన జాప్యం జరిగింది. ఇద్దరు ఆరోగ్య మంత్రుల్ని మార్చారు. రాష్ట్రాలకు సహకరించాల్సిన సమయంలో వాటితో పోట్లాటకు దిగారు.

భారత్‌లో గందరగోళం
టెస్టింగులు చేపట్టడంలో రాష్ట్రాలు గందరగోళ పరిస్థితిలోకి వెళ్లిపోయాయి. రాష్ట్రాలకు సరైన వనరులు సమకూర్చాలన్న ఆలోచన కేంద్రంలోని పాలకులు చేయలేదన్న విమర్శలున్నాయి. సంక్షోభాన్ని ఎదుర్కొనే బాధ్యత అంతా రాష్ట్రాలదే అన్నట్టు మోడీ సర్కార్‌ వ్యవహరించింది. భౌతికదూరం పాటించాలి, మాస్కులు ధరించాలి..అంటూ ప్రజలకు చెప్పి చేతులు దులుపుకున్నారు. వైరస్‌ తీవ్రత ఎక్కువగా మహారాష్ట్ర, ఢిల్లీ, కర్నాటక, గుజరాత్‌, తమిళనాడు రాష్ట్రాల్లో ఏం చేయాలనే వ్యూహం లేదు. ప్రతి 10లక్షల జనాభాకు వైరస్‌ టెస్టింగ్‌లు…భారత్‌లో 9,289, బ్రెజిల్‌లో 7500 ఉన్నాయి. దీని ప్రకారం నమోదవుతున్న కేసులు మాత్రమే బయటకు కనపడుతున్నాయి. కనిపించనవి, అధికారికంగా నమోదుకాని కరోనా కేసులు భారత్‌, బ్రెజిల్‌ దేశాల్లో ఎన్నో ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతమున్న సంఖ్యకు నాలుగైదు రేట్లు కేసులు ఉండే అవకాశముందని వారు అన్నారు.

లోపమెక్కడ
అమెరికా, బ్రెజిల్‌, భారత్‌లలో కరోనా కేసుల గుర్తింపు చాలా ఆలస్యమవుతున్నది. గుర్తించాక… బాధితుడ్ని క్వారంటైన్‌ చేయటం, కుటుంబ సభ్యుల్ని ఐసోలేషన్‌లో ఉంచటం పకడ్బందీగా జరగటం లేదన్న విమర్శలున్నాయి. పేదలు, అణగారిన వర్గాలు ఎక్కువగా ఉన్న భారత్‌లో ప్రజలకు కనీసం అవగాహన కల్పించడంలో నిర్లక్ష్యం కనిపిస్తున్నది. లాక్‌డౌన్‌ (భారత్‌లో) అమల్లో ఉన్న సమయంలో కేసుల సంఖ్య కేవలం వేలల్లో నమోదవ్వగా, లాక్‌డౌన్‌ ఎత్తేశాక…లక్షలకు చేరుకుంది. నగదు పంపిణీ, ఉచిత ఆహార పథకాలు పూర్తిస్థాయిలో అమలుజేయక పోవటం ప్రభావం చూపింది.

ఆరోగ్య వ్యవస్థ
మహమ్మారిని అడ్డుకునే విధంగా ఈ మూడు దేశాల్లో పాలకులు ఆరోగ్య వ్యవస్థను సిద్ధం చేసుకోలేకపోయారు. మౌలిక వసతల కల్పన, వైద్య సిబ్బందికి రక్షణాత్మక చర్యలు అరకొరగా సాగాయి. వైరస్‌ విజృంభిస్తుందని తెలిసాక కూడా…వైద్య పరికరాల సేకరణ నత్తనడకన సాగింది. అదనపు సిబ్బందిని సమకూర్చుకోవాలనే ఆలోచనే లేదు.

CourtesY Nava Telangana