ప్రస్తుతం ఏ సమాజంలోనైనా ‘బూర్జువా విద్యావంతుల’ పాత్ర చాలా కీలకమైనది. సామాజిక సమానత్వం కోసం చేసిన ఉద్యమాలకు సంబంధించినంతవరకు అమెరికా, భారత దేశాల మధ్య ఉన్న తేడా ఏమంటే, అమెరికాకు చెందిన ‘బూర్జువా విద్యావంతులు’ భారత దేశానికి చెందిన విద్యావంతుల కన్నా, ప్రజాస్వామిక పాత్రను పోషించడంలో చాలా ఖచ్చితంగా ఉంటారు. భారతదేశం రెండు విద్యా వ్యవస్థల మధ్య ఉన్న వ్యత్యాసాన్ని బట్టి వ్యవహరించాల్సి ఉంటుంది.

మే 25న మిన్నియాపోలిస్‌లో ఒక శ్వేతజాతి పోలీసు అధికారి, నిర్భంధంలో ఉన్న జార్జ్‌ ఫ్లాయిడ్‌ అనే ఆఫ్రికా – అమెరికన్‌ మెడ మీద మోకాలితో అదిమి ఉంచడం వల్ల ఊపిరి ఆడక చనిపోయాడు. ఆ చర్యలను అమెరికా సమాజం మొత్తం నిరసించింది. ప్రస్తుత జాతి వివక్షకు వ్యతిరేకంగానే కాక, బానిస యజమానులు లేదా బహిరంగ జాతి వ్యతిరేకులుగా ఉన్న చారిత్రాత్మకంగా సుప్రసిద్ధులైన జార్జి వాషింగ్టన్‌, థామస్‌ జెఫెర్సన్‌, ఆన్డ్రూ జాక్సన్‌, థియోడార్‌ రూజ్వెల్ట్‌, ఇంకా ఉడ్రోవిల్సన్‌లు లక్ష్యంగా కూడా ఈ నిరసనలు వెల్లువెత్తాయి. అంతర్యుద్ధం సమయంలో నాయకులుగా ఉన్న జెఫెర్సన్‌ డేవీస్‌, రాబర్ట్‌ లీల విగ్రహాలను కూల్చి వేశారు. అదే విధంగా ఈ నిరసనలు బ్రిటన్‌కు కూడా వ్యాపించాయి. అక్కడ కూడా కొంతమంది బానిస వ్యాపారుల విగ్రహాలను కూల్చారు. సెసిల్‌ రోడ్స్‌, విన్స్టన్‌ చర్చిల్‌ల విగ్రహాలను కూల్చకుండా కాపాడాల్సిన పరిస్థితి ఏర్పడింది.

సామాజిక సమానత్వం కోసం చేసిన ఉద్యమాలలో నాయకత్వం వహించిన నిరసనకారుల పైన ఏ విధమైన దేశద్రోహం కేసులు మోపలేదు, లేదా ఖAూA లాంటి చట్టాలకు సమానమైన చట్టాల కింద నిర్భంధించ లేదు. వాస్తవానికి, నిరసనకారులకు వ్యతిరేకంగా పోలీసులను ప్రయోగించాలన్న డోనాల్డ్‌ ట్రంప్‌ సూచనను ప్రస్తుత పెంటగాన్‌ చీఫ్‌ మార్క్‌ ఎస్పర్‌, అతని కన్నా ముందు పెంటగాన్‌ చీఫ్‌గా పనిచేసిన జేమ్స్‌ మాటిస్‌లు వ్యతిరేకించారు. అదే విధంగా వైట్‌ హౌస్‌ దగ్గరలో ఉన్న సెయింట్‌ జాన్స్‌ చర్చి వద్దకు వెళ్తున్న ట్రంప్‌తో పాటు ఉన్న జనరల్‌ మార్క్‌ మిల్లీ (నిరసనకారుల ప్రదర్శనలో చిక్కుకున్న ట్రంప్‌ వెళ్ళడానికి మార్గం సుగమం చేసిన తర్వాత), మిమ్మల్ని (ట్రంప్‌) రాజకీయంగా ఉపయోగించుకునే విషయం ముందు తెలియదని, అందుకు క్షమించమని అడిగినాడు. మితవాద పక్షీయులు నిరసనలకు ప్రతిచర్యగా నిరసన కార్యక్రమాలు నిర్వహించాలనుకున్నపుడు, సహజంగానే వారిని నిరసనకారుల నుంచి ఏ విధమైన అల్లర్లు జరుగకుండా పూర్తిగా విడగొట్టినారు.

ఇది, మన భారత దేశంలో పరిస్థితికి భిన్నంగా ఉంది. మన దేశంలో కూడా ముస్లిం మతస్థులను లక్ష్యంగా చేసుకొని పౌరసత్వ సవరణ చట్టం, జాతీయ పౌరసత్వ రిజిస్ట్రేషన్‌ చట్టాలను తేవాలని ప్రభుత్వం చేసిన చర్యలకు వ్యతిరేకంగా, సామాజిక సమానత్వం కోసం చేస్తున్న ఉద్యమాలు ఎటువంటి హింసాత్మక సంఘటనలు జరగకుండా అనేక జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ, ఆ ఉద్యమాల్లో పాల్గొన్న వారిపైన, చట్ట విరుద్ధమైన చర్యల నెపంతో (ప్రివెన్షన్‌ చట్టం కింద) కక్ష్య పూరితంగా, అదికూడా కరోనా వైరస్‌ మహమ్మారి కారణంగా ఉద్యమం విరమించిన తర్వాత కేసులు బనాయించినారు. ఆశ్చర్యకరంగా దాదాపు అన్ని ప్రభుత్వ వ్యవస్థలు, పౌర హక్కులను పరిరక్షించే వారిపైన మోపిన అభియోగాలతో పాటు అన్ని రకాల అణచివేతలను చూసీచూడనట్లు ఉంటున్నాయి. ఐక్యరాజ్య సమితి అంగాలకు అనుబంధంగా ఉన్న 13మంది మానవహక్కుల నిపుణులు, పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా నిరసించి, నిర్బంధించ బడిన వారిని విడుదల చేయాలని భారత ప్రభుత్వానికి ఒక సమిష్టి లేఖ రాయడం అవసరం అని భావించారు. భారత ప్రభుత్వంలోని ప్రతి వ్యవస్థ పిరికితనంతో చేసిన దుష్కృత్యంపై 13మంది మానవహక్కుల నిపుణుల నిర్ణయం వాస్తవంగా ఒక విచారకరమైన వ్యాఖ్య. ప్రభుత్వ చర్యలపై చేసే విమర్శలను సహించమనే ఒక ”హింసాత్మక సందేశాన్ని” భారతదేశంలోని ”ఉత్సాహవంతులైన పౌర సమాజానికి” పంపుతున్నట్లు ప్రభుత్వంపై వారు ఆరోపించారు.

పౌరసత్వ సవరణ చట్ట నిరసనకారులకు వ్యతిరేకంగా జరుపుతున్న ప్రస్తుత అణచివేతను ప్రక్కన పెడదాం. నిరసనలు మొదలైనప్పుడు, ఢిల్లీ పోలీసులు డిసెంబర్‌ 15న జామియా మిలియా ఇస్లామియా క్యాంపస్‌లోకి ప్రవేశించి, గ్రంథాలయాల్లో చదువుకుంటున్న వారితో పాటు విద్యార్థులందరిపైన టియర్‌ గ్యాస్‌, లాఠీలు ప్రయోగించారు. పోలీసులు సంబంధిత యూనివర్సిటీ వైస్‌ ఛాన్సలర్‌ అనుమతి లేకుండా యూనివర్సిటీ క్యాంపస్‌లోకి ప్రవేశించకూడదు. అలాంటి మంచి సాంప్రదాయాలు ఈ సందర్భంలో ఎక్కడా పాటించలేదు. యూనివర్సిటీ అధికారులు ఢిల్లీ పోలీసులకు వ్యతిరేకంగా ఎఫ్‌ఐఆర్‌ను కూడా నమోదు చేశారు. కొందరు దుండగులు ఈ దగ్గరలో ఉన్న ప్రభుత్వ ఆస్తిని ధ్వంసం చేసి, మాకు దొరక్కుండా క్యాంపస్‌ లోకి ప్రవేశించారని, అందుకే వారిని పట్టుకొని, నిర్భంధించేందుకే వచ్చామని పోలీసులు అన్నారు.

దీనిని కూడా కొద్ది సేపు అంగీకరిద్దాం. జామియా మిలియా ఇస్లామియా క్యాంపస్‌లో పోలీసుల అనాగరిక, విచక్షణా రహిత చర్యలు కొంత మంది అమాయకులైన విద్యార్థులు ఘోరంగా గాయాల పాలవడానికి దారి తీశాయనడంలో ఎటువంటి సందేహము లేదు. పోలీసులు చేసిన తప్పిదాలు, అక్రమాలపై విచారణ జరిపించనివ్వండి. కేంద్ర ప్రభుత్వ అజమాయిషీలో పనిచేసే ఢిల్లీ పోలీసులు గాయపడిన విద్యార్థులకు ఏ విధమైన నష్టపరిహారాన్ని కూడా చెల్లించలేదు. భారతదేశంలో ప్రకృతి విపత్తుల కారణంగా నష్టపోయిన వారికి పరిహారాన్ని అందజేస్తారు. కానీ ప్రభుత్వ అనుకూల శక్తుల చేతిలో అకారణంగా గాయాల పాలైన క్షతగాత్రులకు నష్టపరిహారాన్ని తిరస్కరించడం ఘోరమైన వివక్షా పూరిత చర్య. జామియా మిలియా ఇస్లామియాలో జరిగిన హింసాయుత సంఘటనలపై నివేదిక తయారు చేసిన జాతీయ మానవహక్కుల కమిషన్‌ గాయపడిన విద్యార్థులకు నష్టపరిహారాన్ని ఇవ్వాలని సిఫార్సు చేసింది. కానీ, కమిషన్‌ ఢిల్లీ ప్రభుత్వం చెల్లించాలని చెప్పింది, అది చెల్లించే అవకాశం లేదు. అంతేకాకుండా, ఆశ్చర్యకరంగా మానవ హక్కుల కమిషన్‌ పోలీసుల హింసకు విద్యార్థులను నిందించి, ఈ నిరసనల వెనుక ఉన్న ”అసలు నటులు, లక్ష్యాలు” (విద్యార్థులు కేవలం తిమ్మిని బమ్మి చేసే వారి చేతిలో కీలుబొమ్మ లైనట్లు) ఏమిటో తెలుసు కోవాలనుకుంటుందట.

సామాజిక సమానత్వం కోసం అమెరికా, భారతదేశాలలో ఒకే విధంగా జరుగుతున్న ఉద్యమాల భిన్నమైన ప్రతిస్పందనలను మనం ఎలా వివరించాలి? కొందరు ‘మతతత్వం’, ‘జాతి వివక్ష’ భిన్నమైనవని వాదిస్తారు. జాతి వివక్షత అనేది ‘బయటి ప్రాంతాల’కు చెందిన మెట్రోపాలిటన్‌ ప్రజల శతాబ్దాల అమానవీయ సామ్రాజ్యవాద అణచివేత యొక్క వారసత్వం. ఈ రెండింటి దృగ్విషయాల (పైకి కనిపించే విషయాలు) చరిత్రలు భిన్నంగా ఉండడం వాస్తవం కాగా, నేడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అత్యంత పేద ప్రజల్లో భారతదేశానికి చెందిన మెజారిటీ ముస్లింలు ఉన్నారనేది నిజం. వారి బలిదానం అమెరికాలోని నల్ల జాతీయుల బలిదానం కన్నా తక్కువ భయంకరమైనదేమీ కాదు. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేక ఉద్యమం సందర్భంగా జరిగిన బలిదానాలను ఉదాహరణగా చెప్పవచ్చు. అమెరికాలో జాతి వివక్షకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమం పొందిన ‘మద్దతు’, ఇక్కడ పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా జరిగిన ఉద్యమానికి కూడా పొందే యోగ్యత ఉంది. అప్పుడు, రెండు సమాజాల స్వభావాలలో ఉన్న తేడాను ఏ విధంగా వివరించాలి?

అమెరికా పాలనా వ్యవస్థ భారతీయ పాలనా వ్యవస్థ కన్నా ‘చాలా ఉదారంగా’ ఉంటుంది అని చెప్పడం జరుగదు. కార్నెల్‌ వెస్ట్‌ అనే ఆఫ్రికన్‌-అమెరికన్‌ తత్వవేత్త, ట్రంప్‌ను ఒక ఇంటర్వ్యూలో ”నయా ఫాసిస్ట్‌ గ్యాంగ్టర్‌”గా పేర్కొన్నాడు. అతడ్ని, ఆ వ్యాఖ్యలు చేసినందుకు వేదింపులకు గురి చేయలేదు, అంటే అతనిది తప్పు, ట్రంప్‌ వాస్తవంగా మరీ ‘ఉదారవాది’ అని కాదు. ఎందుకంటే భారతీయ పాలనలో ఆ వ్యవస్థ ఏమి చేస్తుందో పోల్చినప్పుడు, అమెరికా వ్యవస్థ ట్రంప్‌ చేయ గలిగిన వాటిపైన కఠిన పరిమితులను విధిస్తుంది. ఇది మాత్రమే ‘ఎందుకు ఈ తేడా?’ అనే మన ప్రశ్నను మారుస్తుంది.

అమెరికాలో ప్రజలు పోరాడిన విధంగానే, భారత దేశంలో ‘విద్యావంతులు’ సామాజిక సమానత్వం కోసం కష్టపడి పోరాడుతారని, ఇక్కడి ‘ప్రజలు’ తక్కువ ‘విజ్ఞాన వంతులు’ అని ఎవరైనా అంటే అది అవాస్తవం. ఎందుకంటే అర్థం కాని మతతత్వ ఎజెండా కంటే ముందు ఈ ‘విద్యావంతులే’ ప్రభుత్వ వ్యవస్థలను వశపర్చుకున్నారు. సమస్యంతా ఈ ‘విద్యావంతుల’ తోనే.

ప్రముఖ ఆర్థికవేత్త, ‘ఉదారవాద’ తత్వవేత్త అయిన జాన్‌ మేనార్డ్‌ కీన్స్‌ ఉదారవాద విలువల సంరక్షణ కోసం, వాటిని సమర్దించడానికి అవసరం అని భావించిన (సంస్కరించ బడిన) పెట్టుబడి దారీ వ్యవస్థ కోసం ‘బూర్జువా విద్యావంతుల’ ప్రాముఖ్యత ఉన్నదని పేర్కొన్నాడు. రాజకీయ భావాల చక్రంలో మరొక వైపు, మార్క్స్‌, ఎంగెల్స్‌లు ‘కమ్యూనిస్ట్‌ మ్యానిఫెస్టో’ లో కార్మికవర్గ చైతన్యానికి భిన్నంగా ఉండే సోషలిస్టు చైతన్యం గురించి పేర్కొన్నారు. తమంతట తామే తమ వర్గం నుండి తొలగించుకొని, ”మొత్తం చారిత్రక ప్రక్రియ”ను చూసిన బూర్జువా మేథావులు కార్మిక వర్గంలోకి ఈ సోషలిస్టు చైతన్యాన్ని తీసుకొని వస్తున్నారు. ప్రస్తుతం ఏ సమాజంలోనైనా ‘బూర్జువా విద్యావంతుల’ పాత్ర చాలా కీలకమైనది. సామాజిక సమానత్వం కోసం చేసిన ఉద్యమాలకు సంబంధించినంతవరకు అమెరికా, భారత దేశాల మధ్య ఉన్న తేడా ఏమంటే, అమెరికాకు చెందిన ‘బూర్జువా విద్యావంతులు’ భారత దేశానికి చెందిన విద్యావంతుల కన్నా, ప్రజాస్వామిక పాత్రను పోషించడంలో చాలా ఖచ్చితంగా ఉంటారు. భారతదేశం రెండు విద్యా వ్యవస్థల మధ్య ఉన్న వ్యత్యాసాన్ని బట్టి వ్యవహరించాల్సి ఉంటుంది.

భారతదేశంలో మన విద్యా సంస్థలు ఉన్నత స్థానంలో ఉన్న 200సంస్థల్లో లేవని గుండెలు బాదుకుంటారు. ఇది పూర్తిగా (ఎక్సెన్స్‌) శ్రేష్టత యొక్క తప్పుడు కొలమానం. విద్యార్థులకు వల్లించే పద్ధతిలో కాకుండా రాజ్యాంగానికి పునాదిగా ఉన్న సామాజిక సమానత్వాన్ని గురించి మన విద్యా వ్యవస్థ నేర్పుతుందా లేదా అనేది ముఖ్యమైన విషయం.

ఈ క్రమంలో పోలీసులు క్యాంపస్‌ల్లోకి ప్రవేశించి, అమాయకులైన విద్యార్థులను కొట్టడం, సమానత్వం కొరకు పోరాడుతున్న సామాజిక చైతన్యం కలిగిన విద్యార్థులను ఖAూA లాంటి చట్టాల కింద జైళ్ళలో నిర్భంధిస్తున్న చర్యలను, ఇవి కొత్త ‘సాధారణ’ పరిస్థితులే అని మనం అంగీకరించే ముందు ప్రపంచంలో అన్నిటికన్నా పెద్ద ప్రజాస్వామిక దేశంలో ఉన్నందుకు గర్విస్తున్నాం అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి.

ప్రభాత్‌ పట్నాయక్‌
”ది టెలిగ్రాఫ్‌” సౌజన్యంతో
అనువాదం: బోడపట్ల రవీందర్‌

Courtesy Nava Telangana