• ‘యురేనియం’పై యూసీఐఎల్‌ ఆలోచన.. రాష్ట్రం అనుమతిస్తేనే ప్రాజెక్టు ముందుకు
  • నిర్ధారించిన యూసీఐఎల్‌ సీఎండీ అస్నానీ
హైదరాబాద్‌: తెలంగాణలో యురేనియం వెలికితీతపై కేంద్రం ప్రత్యామ్నాయాలపై దృష్టిసారించింది. నల్లగొండ జిల్లా లంబాపూర్‌, పెద్దగట్టు వద్ద యురేనియం తవ్వకాలు జరపాలని నిర్ణయించిన యురేనియం కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ (యూసీఐఎల్‌) ఇప్పుడు చింత్రియాల వైపు మొగ్గు చూపుతోంది. లంబాపూర్‌, పెద్దగట్టు వద్ద యురేనియం తవ్వకాలతో కృష్ణా జలాలు కలుషితమవుతాయని, నాగార్జునసాగర్‌ జలాశయానికి ముప్పు వాటిల్లుతుందనే ఆందోళనలు.. రాష్ట్రంలో యురేనియం తవ్వకాలు జరపకూడదం టూ అసెంబ్లీలో ప్రభుత్వం తీర్మానం చేయడంతో ఈ నిర్ణయం తీసుకుంది. ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ..యూసీఐఎల్‌ సీఎం డీ సీకే అస్నానీ ఈ విషయాన్ని నిర్ధారించారు. నల్లగొండ జిల్లా చందంపేట మండల పరిధిలోని చింత్రియాలను పరిశీలిస్తున్నాం. అయితే.. రాష్ట్ర ప్రభుత్వం కోరితేనే పరిశీలిస్తామని అస్నానీ వెల్లడించారు. లంబాపూర్‌, పెద్దగట్టు ప్రాంతాల్లోని భూగర్భ జలాల్లో పీహెచ్‌ విలువ అధికంగా ఉందని ఓ సర్వేలో తేలిందని, ఇక్కడ యురేనియం తవ్వకాలను చేపట్టకపోయినా.. భూగర్భజలాలు కలుషితం అవుతాయన్నారు.

సాగునీరే పరిష్కారం
కడప జిల్లా తుమ్మలపల్లి ప్రాంతంలోని నీటి కాలుష్య పరిష్కారానికి బోర్ల తవ్వకాన్ని నిలిపివేసి, సాగు కోసం నీటిని సరఫరా చేయడమే పరిష్కారమని యుసిఐఎల్‌ ఒక అంచనాకు వచ్చినట్టు సమాచారం. కడప జిల్లా తుమ్మలపల్లి ప్రాంతంలో యురేనియం ఖనిజాన్ని వెలికితీస్తున్న విషయం తెలిసిందే. అరటి వంటి పంటలు దెబ్బతింటున్నాయని రైతులు ఆందోళనను దృష్టిలో ఉంచుకుని యుసిఐఎల్‌ అధ్యయనాన్ని చేయించింది. పలు అంశాలపై ఓ అంచనాకు వచ్చినట్టు తెలిసింది.

Courtesy Andhra Jyothy..