542 హెక్టార్లలో 18,550 టన్నుల నిల్వలు
వెలికితీయనున్న యురేనియం కార్పొరేషన్‌
కేంద్ర ప్రభుత్వ పర్యావరణ అనుమతి జారీ
ఈ ఏడాది చివర్లో లేదా 2020 మొదట్లో మైనింగ్‌
సంబంధిత గ్రామాల్లో మొదలైన
భూ సేకరణ ప్రక్రియ
అండర్‌ గ్రౌండ్‌ మైనింగ్‌.. ఎల్లో ప్లేట్ల రూపంలో వెలికి

రాష్ట్రంలో యురేనియం గనుల తవ్వకాలకు రంగం సిద్ధమైంది. కానీ.. మహబూబ్‌నగర్‌ జిల్లాలో కాదు, నల్లగొండ జిల్లాలో. అన్నీ అనుకున్నట్టు జరిగితే.. ఈ ఏడాది చివర్లో లేదా వచ్చే ఏడాది మొదట్లో మైనింగ్‌ ప్రక్రియ మొదలు కానుంది. ఈ యురేనియం నిల్వలను వెలికి తీయడానికి ఇప్పటికే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతిని ఇచ్చాయి. కేంద్ర ప్రభుత్వం మరో అడుగు ముందుకేసి పర్యావరణ అనుమతిని (ఈసీ) కూడా జారీ చేసింది. యురేనియం కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ (యూసీఐఎల్‌) ఆధ్వర్యంలో ఈ మైనింగ్‌ను నిర్వహించనున్నారు.

నేషనల్‌ న్యూక్లియర్‌ ప్యూయల్‌ కాంప్లెక్స్‌ (ఎన్‌ఎ్‌ఫసీ) అవసరాల కోసం ‘ఎల్లో ప్లేట్ల’ రూపంలో ఈ యురేనియం నిల్వలను వెలికి తీయాలని నిర్ణయించారు. యురేనియం కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా కొత్తగా 13 యురేనియం ప్రాజెక్టులను చేపట్టడానికి వీలుగా ఆటమిక్‌ ఎనర్జీ కమిషన్‌ (ఏఈసీ) ఈ మధ్య అనుమతిని జారీ చేసింది. అందులో మన రాష్ట్రంలో నల్లగొండ జిల్లాలోని లంబాపూర్‌ యురేనియం గనులు కూడా ఉన్నాయి. నాగార్జుననగర్‌ నియోజకవర్గం పరిధిలోని లంబాపూర్‌, పులిచర్ల, నామాపూరం, ఎల్లాపురం గ్రామాల పరిధిలో ఈ యురేనియం గనులు ఉన్నట్టు గుర్తించారు.

మొత్తం 542 హెక్టార్ల విస్తీర్ణంలో ఉండే ఈ గనుల్లో సుమారు 18,550 మెట్రిక్‌ టన్నుల యురేనియం నిల్వలు ఉన్నట్టు అంచనా వేశారు. ఈ నిల్వలను వెలికితీయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం ఇప్పటికే పర్యావరణ అనుమతిని జారీ చేశారు. ప్రస్తుతం భూ సేకరణ ప్రక్రియను నిర్వహిస్తున్నారు. ఈ యురేనియం గనుల నిర్వహణ కారణంగా రాష్ట్ర ప్రభుత్వానికి కూడా రాయల్టీ కింద కొంత ఆదాయం వచ్చే అవకాశం ఉంది. ఈ గనులకు సంబంధించిన సమాచారాన్ని.. నిల్వల వెలికితీత విషయాన్ని రాష్ట్ర గనుల శాఖ గతవారం తన నివేదికలో పేర్కొంది.

కాగా, నల్లగొండలోని లంబాపూర్‌ యురేనియం గనుల్లో ఒకటి ఓపెన్‌ పిట్‌ కాగా.. మరో మూడింటిలో అండర్‌గ్రౌండ్‌ పద్ధతిలో మైనింగ్‌ను నిర్వహించే అవకాశం ఉంది. ఈ గనుల తవ్వకం మొత్తం 7 సంవత్సరాల పాటు కొనసాగుతాయని అంచనా వేస్తున్నారు. గనుల నిర్వహణలో అన్ని రక్షణ చర్యలనూ పాటించడంతో పాటు, పర్యావరణానికి సంబంధించిన ముందు జాగ్రత్త చర్యలనూ తీసుకుంటారని అధికారులు చెప్తున్నారు.

 

(Courtacy Andhrajyothi)