– ప్రాణాలైనా ఇస్తాం.. భూములివ్వం
– యురేనియం వెలికితీతతో సమస్తం కాలుష్యం
– 16 ఏండ్ల తరువాత మళ్లీ తవ్వకాలకు ఏర్పాట్లు
– వెనక్కి తగ్గకుంటే ఉద్యమమే.. : గిరిపుత్రులు
– రెండు రాష్ట్రాల్లో 21లక్షల ఎకరాల ఆయకట్టుకు ముప్పు

ఆనాడు గిరిజనులు, ప్రజల ఆందోళనలతో యురేనియం తవ్వకాలపై వెనక్కి తగ్గిన కేంద్రం.. 16 ఏండ్ల తరువాత మళ్లీ ముందుకొస్తోంది. తవ్వకాలకు సిద్ధమవు తోంది. దాంతోపాటు రెండు తెలుగు రాష్ట్రాలకు జీవనాధారమైన నల్లగొండ జిల్లాలోని నాగార్జునసాగర్‌ అంచున న్యూక్లియర్‌ ప్రాజెక్టు నిర్మాణానికి ప్రణాళిక రచిస్తుండ టంతో.. సాగర్‌ మొత్తం కాలుష్యకాసారంగా మారనుంది. ఇది గిరిపుత్రుల గుండెల్లో గుబులు పుట్టిస్తోంది. మా ప్రాణాలైనా ఇస్తాంకానీ భూములు మాత్రం ఇచ్చేది లేదని స్పష్టం చేస్తున్నారు.

నల్లగొండ జిల్లాలోని పీఏపల్లి మండల పరిధిలోని నంబాపూర్‌, పెద్దగట్టు, ఎల్లపూరం, బూడిదగట్టు, పెద్దవూర మండలంలోని బాసోనిబావి గ్రామాల్లో యురేనియం నిక్షేపాల తవ్వకాలకు కేంద్ర ప్రభుత్వం మరోమారు సిద్ధమైంది. 2003లో ఈ ప్రాంతంలో యురేనియం గనుల కోసం మైనింగ్‌ అధికారులు సర్వే చేశారు. కోమటికుంట తండాలో అధికారులు క్యాంపు నిర్వహించి రాత్రి సమయాల్లో గుట్ట చుట్టూ బోర్లు కూడా వేశారు. దాంతో గిరిజనులు, మావోయిస్టులు ఆనాడు మైనింగ్‌ అధికారులకు ఎదురుతిరిగారు. డ్రిల్లింగ్‌ కోసం తీసుకొచ్చిన వాహనాలను తగలబెట్టారు. దీంతో వారు అక్కడి నుంచి వెనుదిరిగారు.

16 ఏండ్ల తర్వాత..
16 ఏండ్ల తర్వాత కేంద్రం మరోమారు యురేనియం తవ్వకాలకు సిద్ధమైంది. నేషనల్‌ న్యూక్లియర్‌ ఫ్యూయల్‌ కాంప్లెక్స్‌ అవసరాల కోసం యురేనియం నిల్వలను వెలికితీయడానికి ఉపక్రమించింది. యురేనియం కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా ఆధ్వర్యంలో నంబాపూర్‌ న్యూక్లిర్‌ ప్రాజెక్టు నిర్మించడానికి ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు సమాచారం. ఇది గిరిపుత్రుల గుండెల్లో ఆందోళన కల్గిస్తోంది. ప్రస్తుతం ఈ ప్రాంతంలో 542 హెక్టర్ల విస్తీర్ణంలో యురేనియం గనులు వెలికి తీయడానికి ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలిసింది. పెద్దగట్టు, నంబాపూరం తండాల్లోని 23/16 సర్వే నెంబర్‌ నుంచి 23/48 సర్వే నెంబర్‌ వరకు 2500 ఎకరాలు, 3/3 సర్వే నెంబర్‌ నుంచి 3/82 సర్వేనెంబర్‌లో 500 ఎకరాల భూముల్లో యురేనియం నిక్షేపాలు ఉన్నట్టు అధికారులు గుర్తించారు. ఈ భూముల్లో సుమారు 6వేల మంది గిరిపుత్రులు జీవనం సాగిస్తున్నారు.

రెండు తెలుగు రాష్ట్రాలకూ ప్రమాదమే..
ప్రధాన జలాశయమైన నాగార్జునసాగర్‌ అంచున ఉన్న పెద్దగట్టులో ఓపెన్‌కాస్టు గనుల తవ్వకాలు చేపట్టి.. ఇక్కడ న్యూక్లియర్‌ ప్రాజెక్టు నిర్మిస్తే సాగర్‌ జలాలు మొత్తం కలుషితం అవుతాయి. ఈ న్యూక్లియర్‌ ప్రాజెక్టు నుంచి అతి భయంకరమైన విషవాయువులు వెలువడుతాయి. ఓపెన్‌కాస్ట్‌ గనుల తవ్వకాలతో యురేనియం భూగర్భంలోంచి బయటికి వచ్చిందంటే దాని నుంచి వచ్చే ప్రమాదాన్ని ఎవరూ అరికట్టలేనంతగా ఉంటుందంటున్నారు నిపుణులు. చిన్న అణువు విపరితమైన రేడియేషన్‌ను విడుదల చేస్తుంది. యురేనియం నుంచి వచ్చే రేడియేషన్‌ గాలి, నీటిలో కలిసిపోతుంది. రెండు తెలుగు రాష్ట్రాలకు జీవనాధారమైన సాగర్‌ జలాలకు పెనుప్రమాదం పొంచి ఉంది. ఈ ప్రాజెక్టు 21లక్ష ఎకరాల ఆయకట్టుకు సాగు నీరందిస్తోంది. తెలంగాణలోని ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లో 10లక్షల ఎకరాలు, ఆంధ్రప్రదేశ్‌లో 11లక్షల ఎకరాలకు సాగు నీరు అందిస్తోంది. హైదరాబాద్‌, ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం జిల్లాలకు తాగు నీరు అందిస్తోంది. ఇకపై యురేనియం తవ్వకాల వల్ల సాగర్‌ నీరంతా కాలుష్యకాసారంగా మారనుంది.

చంపి.. భూములు తీసుకోండి
ప్రభుత్వం 16 ఏండ్ల కిందనే యురేనియం తవ్వడానికి వస్తే వెనక్కి పంపించాం. మళ్లీ వచ్చి మా భూముల్లో యురేనియం తీస్తామంటు న్నరు. మేము ఎక్కడికి పోవాలి. ఇక్కడ ఉన్న బతుకు దెరువు ఎక్కడ దొరుకుతుంది. భూములు ఇచ్చేది లేదు. బలవంతంగా లాక్కోవాలంటే మా గిరిజనులను చంపి భూములు తీసుకోవాలి తప్ప ప్రాణం ఉండగా యురేనియం తవ్వకాలకు ఇచ్చేది లేదు. ప్రభుత్వం మా బతుకులను ఛిద్రం చేయొద్దు.. నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలి.
– రవినాయక్‌- అఖిల భారత గిరిజన సంఘం నాయకులు- బాసోనిబావి తండా

ఎన్నిచోట్లకు మారాలి
మా గ్రామం సాగర్‌ డ్యామ్‌ నిర్మాణంలో ముంపునకు గురైతే.. పునరావాసం కింద ఇక్కడికి వచ్చి స్థిరపడాం. ఇప్పుడిప్పుడే కొంత అభివృద్ధి చెందుతున్నాం. యురేనియం పేరుతో ఇక్కడి నుంచీ పంపిస్తే మళ్లెక్కడికి పోవాలి.. ఇట్టా ఎన్నాళ్లు తిరగాలి. ఇంత మంచి వనరులు ఎక్కడ దొరుకుతవి. మేము ఇక్కడి నుంచి కదిలేది లేదు.
– నరేందర్‌- పెద్దగట్టు సర్పంచ్‌

ఊరిడిసి ఎక్కడికీ పోం..
మా ఊరు పూర్వం నుంచి ఉంది. ఇక్కడే తాతలు, తండ్రులు జీవనం సాగించారు. నా వయస్సు 60 ఏండ్లు దాటింది. కొడుకులు లేరు. ఆరుగురు బిడ్డలు. 10 ఎకరాల భూమిలో వ్యవసాయ చేసుకుంటూ బతుకుతున్న. ఇప్పుడు ఊరు ఖాళీచేసి పోవాలంటే ఎక్కడికి పోయి బతకాలి. 16 ఏండ్ల కిందనే తరిమికొట్టాం. ఇప్పుడు ఊరుకుంటామా.. ఊరిడిసి ఎక్కడికీ పోం.
– ఇద్దయ్య- ఎల్లపూరం

(Courtacy Nava Telangana)