• అగ్రస్థానం గుంటూరు, ఆరో స్థానం నల్గొండ
  • అంతర్జాతీయ అధ్యయన నివేదికలో వెల్లడి

హైదరాబాద్‌: తెలుగు రాష్ట్రాల్లో యురేనియం తవ్వకాలకు అనుమతులు ఇవ్వకూడదంటూ ఒకవైపు పెద్దఎత్తున ఆందోళనలు సాగుతున్నాయి. దీంతో భూగర్భ జలాలు కలుషితం అవుతాయని, పర్యావరణానికి పెనుముప్పు అంటూ పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవలే దేశంలోని భూగర్భ జలాల పరిస్థితిని అధ్యయనం చేసిన అంతర్జాతీయ సంస్థ నివేదిక మరింత ఆందోళనను కలిగిస్తోంది. అమెరికాలోని డ్యూక్‌ యునివర్సిటీ, కేంద్ర భూగర్భ జల వనరుల సంస్థ సంయుక్తంగా ఇటీవలే దేశంలోని 16 రాష్ట్రాల్లోని 79 జిల్లాల్లో భూగర్భ జలాలను పరిశీలించింది. ఒక లీటరు నీటిలో యురేనియం పరిమాణం 30 ఎంజీ కన్నా తక్కువ ఉంటే సురక్షిత నీరు అని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్‌వో) పేర్కొంటోంది. 16 రాష్ట్రాల్లో అధ్యయనం జరపగా, 90 శాతం నమూనాల్లో ఇవి ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించిన పరిమితికి మించి ఉన్నట్టు తేలింది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి మరింత ఆందోళనకరంగా ఉంది.

హరియాణా కంటే ఎన్నో రెట్లు అధికం
భూగర్భ జలాల్లో యురేనియం పరిమితికి మించి ఉండటంపై సమాధానం ఇవ్వాలంటూ కాంగ్రెస్‌ ఎంపీ కుమారి షెల్జా శనివారం రాజ్యసభలో ప్రశ్నించారు. హరియాణాలో ఈ సమస్య ఎక్కువగా ఉందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ఆమె ప్రస్తావించిన హరియాణా లోని సిర్సా జిల్లాలో లీటరు భూగర్భ జలాల్లో గరిష్ఠంగా 290 ఎంజీ మేరకు యురేనియం అవశేషాలు ఉండగా, తెలుగు రాష్ట్రాల్లో అంతకు మించి నమోదైంది.

భూగర్భ జలాల్లో ఎక్కువగా యురేనియం ఉన్న జిల్లాల్లో దేశంలోనే తొలిస్థానంలో ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా ఉండగా, తెలంగాణలోని నల్గొండ ఆరో స్థానంలో నిలిచింది. ఏపీలోని గుంటూరు, కడప జిల్లాల్లో 695 చోట్ల, తెలంగాణలోని నల్గొండ, హైదరాబాద్‌ జిల్లాల్లో 208 చోట్ల ఈ అధ్యయనం జరిగింది. గుంటూరు జిల్లాలోని 11 ప్రాంతాల్లో భూగర్భ జలాల్లో అత్యధికంగా 2074 ఎంజీ యురేనియం ఉందని తేలింది. దేశంలోనే ఇది అత్యధికం. రెండోస్థానంలో బెంగళూరు నిలిచింది. నల్గొండ జిల్లా ఆరో స్థానంలో ఉంది. నల్గొండ జిల్లాలోని 84 చోట్ల అధ్యయనం చేయగా 521 ఎంజీ ఉందని తేలింది. హైదరాబాద్‌లో 82 ఎంజీ నమోదైంది.

Courtesy AndhraJyothy…