• 35 మంది వివిధ సంఘాలవారు
  • నక్సల్స్‌తో సంబంధాల అభియోగం
  • ఆయుధాల సరఫరా ఆరోపణలు
  • భద్రాద్రి జిల్లాలో కేసు నమోదు

హైదరాబాద్‌: భద్రాద్రి-కొత్తగూడెం జిల్లా చర్ల పోలీసులు 45 మందిపై చట్టవ్యతిరేక కార్యాకలపాల నిరోధక చట్టం (ఉపా) కింద కేసులు నమోదు చేశారు. వారిలో పది మంది మావోయిస్టు పార్టీకి చెందినవారు కాగా.. మరో 35 మందికి 12 సంఘాలతో అనుబంధం ఉంది. ఈ సంఘాలకు మావోయిస్టులతో సంబంధాలున్నాయని, వారికి ఆయుధాలు సమకూరుస్తున్నారని పోలీసులు చెబుతున్నారు. ఉపా చట్టం కింద కేసు నమోదైన వారిలో.. ఇటీవల గద్వాల పోలీసులు అరెస్టు చేసిన తెలంగాణ ప్రజాఫ్రంట్‌ (టీపీఎఫ్‌) ఉపాధ్యక్షుడు నలమాస కృష్ణ, తెలంగాణ విద్యార్థి వేదిక(టీవీవీ) అధ్యక్షుడు మద్దిలేటి ఉన్నారు. మావోయిస్టు పార్టీ సానుభూతిపరులుగా పేర్కొంటూ అయిత అనిల్‌కుమార్‌, దాసరపు సురేశ్‌ను భద్రాద్రి-కొత్తగూడెం జిల్లా పోలీసులు ఆదివారం అరెస్టు చేసి.. రిమాండ్‌కు తరలించారు.

ఆ సందర్భంగా కోర్టుకు సమర్పించిన రిమాండ్‌ రిపోర్టును ‘ఆంధ్రజ్యోతి’ సంపాదించింది. అందులో.. ఉపా కేసు నమోదైన 45 మంది వ్యక్తులు, 12 సంస్థల వివరాలు ఉన్నాయి. అవి.. తెలంగాణ ప్రజాఫ్రంట్‌(టీపీఎఫ్‌), తెలంగాణ పౌరహక్కుల సంఘం(టీఎ్‌ససీఎల్‌సీ), తెలంగాణ విద్యార్థి వేదిక(టీవీవీ), తుడుందెబ్బ, చైతన్యమహిళా సంఘం(సీఎంఎస్‌), తెలంగాణ విద్యార్థి సంఘం(టీవీఎస్‌), ప్రజాస్వామ్య విద్యార్థి వేదిక(డీఎ్‌సయూ), తెలంగాణ యూత్‌ ఫోరం(టీవైఎఫ్‌), పాట్రియాటిక్‌ డెమోక్రటిక్‌ మూవ్‌మెంట్‌(పీడీఎం), తెలంగాణ ప్రజాస్వామిక వేదిక(టీడీఎఫ్‌), రాజకీయ ఖైదీల విడుదల కమిటీ, తెలంగాణ రైతాంగ సమితి ఉన్నాయి.

ఇవన్నీ మావోయిస్టు పార్టీ అనుబంధ సంఘాలని పేర్కొన్నారు. ఆయా సంఘాల నేతలు వర్సిటీలు, కాలేజీల్లో తిరుగుతూ.. విద్యార్థులను మావోయిజం వైపు ఆకర్షిస్తున్నారని.. మావోయిస్టులకు నిధులను సేకరించడం, ఆయుధాలను, సాంకేతిక పరికరాలను, విప్లవ సాహిత్యాన్ని, మందుపాతరలను సమకూర్చడం వీరి ప్రధాన విధులని రిమాండ్‌ రిపోర్టులో చర్ల పోలీసులు వెల్లడించారు. ఆదివారం అరెస్టు చేసిన అనిల్‌కుమార్‌, దాసరపు సురేశ్‌ ద్వారా ఈ వివరాలు వెలుగులోకి వచ్చాయని భద్రాద్రి-కొత్తగూడెం ఎస్పీ సునీల్‌దత్‌ తెలిపారు. వారి వద్ద మావోయిస్టు నేత హరిభూషణ్‌ పేరుతో నాలుగు లేఖలు, సిమ్‌కార్డులు, మెమొరీకార్డులు లభించాయని వివరించారు. ఈ నేపథ్యంలోనే 12 సంఘాలకు చెందిన 35 మందిపై ఉపా కేసు నమోదు చేశామన్నారు.

courtesy Andhra jyothy