• లాల్చీ పట్టుకుని లాగేసిన యూపీ పోలీసులు
  • కింద పడ్డ కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షుడు రాహుల్‌
  • యువనేత భుజానికి స్వల్పంగా గాయాలు
  • హాథ్రస్‌ గ్యాంగ్‌రేప్‌, హత్య బాధిత కుటుంబాన్ని
  • కలవడానికి వెళుతుండగా అడ్డగించిన పోలీసులు
  • ఆయనతో పాటు సోదరి ప్రియాంక నిర్బంధం
  • హాథ్రస్‌ ఘటనపై హైకోర్టు లక్నో బెంచ్‌ సీరియస్‌
  • స్వచ్ఛందంగా కేసు… ప్రభుత్వాధికారులకు సమన్లు
  • యోగి రాజీనామాకు మాయా, అఖిలేశ్‌ డిమాండ్‌
  • దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌ కార్యకర్తల నిరసనలు

పోలీసులు నన్ను లాఠీతో కొట్టారు. అరెస్ట్‌ చేశారు. కిందకు పడదోశారు. ఈ దేశంలో మోదీ తప్ప వేరెవ్వరూ నడవకూడదా? సామాన్య ప్రజానీకానికి నడిచి వెళ్లే హక్కు కూడా లేదా? ఇది పోలీసు రాజ్యం.
– రాహుల్‌ గాంధీ

న్యూఢిల్లీ/నొయిడా : ఉత్తరప్రదేశ్‌లోని హాథ్ర్‌సలో ఓ 19 ఏళ్ల దళిత అమ్మాయిని అగ్రవర్ణాలకు చెందిన నలుగురు వ్యక్తులు గ్యాంగ్‌రేప్‌ చేసి, చంపారన్న ఆరోపణలు, తదనంతర పరిణామాలపై రేగిన వివాదం తీవ్రరూపు దాల్చింది. ఈ అమానుష చర్యను ఖండిస్తూ కాంగ్రెస్‌ చేపట్టిన నిరసనతో ఉత్తరప్రదేశ్‌ అట్టుడికింది. దేశవ్యాప్తంగా కూడా నిరసన పెల్లుబికింది.  బాధిత కుటుంబాన్ని పరామర్శించడానికి వెళుతున్న కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీని, ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీని పోలీసులు నిర్బంధించారు. ఢిల్లీ-నొయిడా ఎక్స్‌ప్రెస్‌ వేపై వారి కాన్వాయ్‌ను అడ్డగించారు. ఏ చట్టం కింద తమను నిరోధించారో చెప్పాలని రాహుల్‌ నిలదీశారు. నిషేధాజ్ఞలు అమల్లో ఉన్నాయని, నలుగురు, అంతకంటే ఎక్కువమంది గుమిగూడడం రూల్స్‌కు విరుద్ధమని, అధికారిక ఉత్తర్వులను ఉల్లంఘించడంపై సెక్షన్‌ 188 కింద నిరోధించామని పోలీసు అధికారులు బదులిచ్చారు. అక్కడ నుంచి హాథ్రస్‌ 150 కిలోమీటర్ల దూరం… తాను కాలినడకనే హాథ్రస్‌ వెళతానని అంటూ రాహుల్‌… యమునా ఎక్స్‌ప్రె్‌సవేపై ముందుకు నడవడం మొదలెట్టారు. ప్రియాంకతో పాటు వందల మంది కార్యకర్తలు వారిని అనుసరించారు. ఆ సమయంలో పోలీసులు వారిని బలవంతంగా నిలిపేశారు. రాహుల్‌ లాల్చీని, భుజాలను పట్టుకుని పోలీసులు ముందుకు కదలనివ్వకుండా ఆపారు. ఆ పెనుగులాటలో రాహుల్‌ కిందపడ్డారు. భుజాలను పట్టుకుని ముందుకు లాగడంతో నేలమీద పడిపోయారు. ఆ తరువాత రాహుల్‌, ప్రియాంక ఇద్దరూ హైవేపైనే కాసేపు బైఠాయించడంతో- ఉద్రిక్తత నెలకొంది. అనేక జిల్లాల్లో కాంగ్రెస్‌, ఎస్పీ, బీఎస్పీలతో పాటు దళిత సంఘాలు నిరసన ప్రదర్శనలు చేశాయి. కాగా, ‘‘రహస్యంగా అర్థరాత్రి దాటాక పోలీసుల సమక్షంలో అంత్యక్రియలు చేస్తారా?. వీరంతా (బీజేపీ) హిందువులకు ప్రతినిధులమని చెప్పుకుంటారే.. నేనూ హిందువునే. ఏ శాస్త్రాచారాల ప్రకారం ఇలా చేశారో చెప్పగలరా?’’ అని ప్రియాంక నిలదీశారు. రాహుల్‌- ప్రియాంకల అరె్‌స్టను శరద్‌పవార్‌ ఖండించారు. క్షమాపణ చెప్పాలని డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్‌, పదవి నుంచి యోగి తక్షణం వైదొలగాలని బీఎస్పీ చీఫ్‌ మాయావతి డిమాండ్‌ చేశారు.

బాధిత కుటుంబంపై ఒత్తిడి?
దర్యాప్తు జరుగుతున్న తీరుపై బాధితురాలి కుటుంబం సంతృప్తి వ్యక్తం చేసినట్లు యూపీ ప్రభుత్వం చెబుతోంది. అయితే, తమను బెదిరించారని, సీబీఐ చేత విచారణ జరిపించాలని తండ్రి డిమాండ్‌ చేసినట్లు మరో వీడియోలో ఉంది. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ బాధిత కుటుంబంతో ఫోన్లో మాట్లాడారు. దర్యాప్తు జరుగుతున్న తీరుపై బాఽధితురాలి తండ్రి సంతృప్తి వ్యక్తం చేస్తూ-   ఓ పత్రంపై సంతకం చేసినట్లు పోలీసులు చెప్పారు. అయితే, ‘సీఎంతో మాట్లాడిస్తామని మమ్మల్ని పోలీసు స్టేషన్‌కు తీసికెళ్లారు. అక్కడ బలవంతంగా మా చేత ఓ పత్రంపై సంతకం చేయించారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి చేత విచారణ జరిపించాలి’ అని ఆయన అన్నట్లు ప్రియాంక విడుదల చేసిన వీడియోలో ఉంది. కాగా, ఈ ఘటనను అలహాబాద్‌ హైకోర్టు లక్నో బెంచ్‌ తీవ్రంగా పరిగణించింది. ఈ నెల 12వ తేదీ కల్లా దీనికి సంబంధించిన పూర్తి వివరాలతో కోర్టుకు హాజరుకావాలని యూపీ అదనపు ఛీఫ్‌ సెక్రటరీకి, డీజీపీ సహా పలువురు అధికారులకు సమన్లు పంపింది. బాధితురాలి తండ్రిని కూడా రావాల్సిందిగా ధర్మాసనం కోరింది.

కుటుంబాన్ని బెదిరించిన కలెక్టర్‌
హాథ్రస్‌ వెళ్లి బాధిత కుటుంబాన్ని పరామర్శించిన జిల్లా కలెక్టర్‌ ప్రవీణ్‌ కుమార్‌ లక్సర్‌ ఓ వివాదంలో ఇరుక్కున్నారు. ‘మీడియా మీ ఎదురుగా ఉంది కాబట్టి మీరు ఏం చెప్పినా చెల్లుతుందనుకోకండి.  సగం మంది మీడియా ప్రతినిధులు వెళ్లిపోయారు. మిగిలినవారు కూడా రేపు వెళ్లిపోయాక- మీరు సంప్రదించాల్సింది మమ్మల్నే… అందుచేత ఇపుడిచ్చిన స్టేట్‌మెంట్‌ మార్చండి… జాగ్రత్తగా మాట్లాడండి’ అని హతురాలి తండ్రిని ఆయన బెదిరించడం రికార్డవడంతో వివాదం చెలరేగింది. ఆ తరువాత కొందరు మీడియా ప్రతినిధులు- ప్రవీణ్‌ కుమార్‌ స్పందనను కోరినా ఆయన మౌనం దాల్చారు.

రేప్‌ జరగలేదు: పోలీసులు
యూపీలోని హాథ్ర్‌సలో 19-ఏళ్ల దళిత అమ్మాయిపై అత్యాచారం గానీ, గ్యాంగ్‌రేప్‌ గానీ జరగలేదని యూపీ పోలీసులు ప్రకటించారు. ‘‘శవపరీక్ష నివేదికలో ఎలాంటి వీర్యం కనిపించలేదు. పదేపదే గొంతు నులిమి పిసకడం వల్ల ఊపిరాడలేదు. మెదడు నుంచి వెన్నెముకకు దారితీసే ఎముక విరిగింది.  అంతర్గతంగానూ, బయటా రక్తస్రావం జరిగింది. ఈ గాయమే ఆమె మరణానికి కారణం. ఆమె చున్నీనే మెడకు చుట్టి నులిమారు. ఆమె నరానికి సంబంధించిన మచ్చలు దీన్ని ధ్రువపరుస్తున్నాయి’’ అని  నివేదికలో పేర్కొన్నట్లు  పోలీసులు తెలిపారు. ‘‘ఆమె కన్నెపొరపై మానిన గాయా లు కనిపించాయి. చిన్నప్రేవుల్లోనూ పాత చీలిన గాయాలున్నాయి. గర్భాశయంలో రక్తం గడ్డకట్టింది. బ్లడ్‌ క్లాట్స్‌ ఉన్నాయి. యోనిలోనూ రక్తం ఉంది… అది నెలసరి కావొచ్చు. వెనకునుంచి వచ్చి మెడను బలవంతంగా అదిమిపట్టడంతో ఎముకకు గాయం కావడం వల్లే చనిపోయింది’ అని నివేదిక పేర్కొన్నట్లు యూపీ పోలీసులు తెలిపారు.  కాగా, ఢిల్లీకి తరలించేముందు బాధితురాలిని అలీగఢ్‌ అలీగఢ్‌ జవహర్‌లాల్‌ నెహ్రూ మెడికల్‌ కాలేజీలో చేర్పించారు. ఆ కాలేజీ డాక్టర్లు ఇచ్చిన రిపోర్టులో కూడా రేప్‌ జరిగినట్లు లేదని – హాథ్రస్‌ జిల్లా కలెక్టర్‌ విక్రాంత్‌ వీర్‌, కలెక్టర్‌ ప్రవీణ్‌ కుమార్‌ చెప్పారు.

Courtesy Andhrajyothi