లక్నో: వలస కూలీల పట్ల అవమానవీయంగా ప్రవర్తించిన ఉత్తరప్రదేశ్‌ పోలీసులు క్షమాపణ చెప్పారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో నిబంధనలు ఉల్లంఘిచారన్న కారణంతో వలస కూలీల పట్ల నిర్దాక్షిణ్యంగా ప్రవర్తించిన ఘటన బదౌన్‌లోని సివిల్‌లైన్స్‌ ప్రాంతంలో గురువారం చోటుచేసుకుంది. లాక్‌డౌన్‌తో ఉపాధి లేక కాలినడక సొంత ఊళ్లకు వెళుతున్న యువకుల పట్ల బదౌన్‌ పోలీసులు అవమానవీయంగా ప్రవర్తించారు. నిబంధనలు ఉల్లంఘించి రోడ్డుకు మీదకు వచ్చారన్న ఆరోపణలతో యువకులను మోకాళ్లపై నడిపించి శిక్షించారు. ఐదుగురు యువకులు వీపు మీద బ్యాగులతో మోకాళ్లపై నడుస్తూ ఎంతో బాధ అనుభవించారు. ఈ ఘటన సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో బదౌన్‌ పోలీస్‌ చీఫ్‌ ఏకే త్రిపాఠి స్పందించారు. తమ సిబ్బంది ప్రవర్తించిన తీరు అవమానకరంగా ఉందని పేర్కొంటూ క్షమాపణ చెప్పారు. ఈ ఘటనపై ఉన్నతాధికారులతో దర్యాప్తు చేయించి బాధ్యులపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు.

కాగా, లాక్‌డౌన్‌ నేపథ్యంలో పోలీసులు దురుసుగా ప్రవర్తిస్తున్న ఘటనలు దేశవ్యాప్తంగా వెలుగు చూస్తున్నాయి. నిబంధనలు ఉల్లంఘించారన్న కారణంతో సామాన్యులపై పోలీసులు దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు. చాలా చోట్ల జర్నలిస్టులు, వైద్య సిబ్బందిపై కూడా దాడులు చేశారు. అత్యవసర సేవల సిబ్బందిని అడ్డుకోవద్దని సాక్షాత్తూ ప్రధాని నరేంద్ర మోదీ చెప్పినా పోలీసులు లెక్కచేయడం లేదు. ఉపాధిలేక, తినడానికి తిండి దొరక్క సొంత ఊళ్లకు వెళ్లేందుకు పయమవుతున్న నిరుపేదలు, సామాన్యుల పట్ల సానుభూతి చూపించకుండా పోలీసులు పెట్రేగిపోతున్నారు. ఆపత్కాలంలో అవమానవీయంగా వ్యవహరించడం సరి​కాదని, మానవతా దృక్పథంతో పోలీసులు వ్యవహరించాలని ప్రజలు కోరుతున్నారు.