సీఏఏ నిరసనల్లో పాల్గొన్న కవికి యూపీ సర్కారు నోటీసులు

లక్నో : పౌర నిరసనకారులపై యోగి సర్కారు కుట్రలు ఆగడం లేదు. సీఏఏ నిరసనల్లో పాల్గొన్నారనీ, ఆందోళనకారులను నిరసనలకు పురిగొల్పుతున్నారని ఆరోపిస్తూ యూపీ కాంగ్రెస్‌ నాయకుడు, కవి ఇమ్రాన్‌ ప్రతాప్‌గరికి యోగి సర్కారు రూ. 1.04 కోట్ల షోకాజ్‌ నోటీసును జారీ చేసింది. నిరసన ప్రాంతం వద్ద విధించిన 144 సెక్షన్‌ను ఉల్లంఘించారని పేర్కొంటూ అధికారులు ఆయనకు తాఖీదులు పంపారు. నిరసన సమయంలో అక్కడ భద్రతను ఏర్పాటు చేసినందుకు అయిన ఈ మొత్తాన్ని చెల్లించాలంటూ నోటీసులో జిల్లా అధికారులు పేర్కొన్నారు. సీఏఏకు వ్యతిరేకంగా మొరాదాబాద్‌లో గతనెల 29 నుంచి మహిళలు నిరసనలు చేస్తున్నారు. వారికి మద్దతుగా ఈ నిరసనల్లో ఈనెల 7న ఇమ్రాన్‌ పాల్గొన్నారు. ” సెక్షన్‌ 144 అమల్లో ఉన్నప్పటికీ.. మీరిచ్చిన పిలుపుతో ఈద్గా వద్ద నిరసనల కోసం ఓ వర్గానికి చెందిన వారు గుమిగూడుతున్నారు. శాంతి భద్రతల పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని అక్కడ ఒక అదనపు ప్లాటూన్‌ ఆర్‌ఏఎఫ్‌తో పాటు మరో కంపెనీ పీఏసీకి చెందిన సగం సెక్షన్‌ను మోహరింపజేశాం.

ఇందుకు రోజుకు రూ.13.42 లక్షల చొప్పున ఖర్చయ్యింది. దీంతో ఇందుకు అయిన మొత్తం రూ.1.04 కోట్లను మీ నుంచి జిల్లా యంత్రాంగం రికవరీ చేస్తుంది” అని నోటీసులో పేర్కొన్నారు. ఇమ్రాన్‌ ఈనెల 7న నిరసనలో పాల్గొనగా.. నోటీసులు మాత్రం ముందురోజే వెలువడ్డాయని ఓ వార్తపత్రిక తన కథనంలో పేర్కొన్నది. అయితే నిరసన కారులను బయటపెట్టడానికి యోగి సర్కారు కొత్తదారులు వెతుకుతోందనీ, దీనికి తామెంత మాత్రమూ బయపడే ప్రసక్తేలేదనీ ఇమ్రాన్‌ అన్నారు.

Courtesy Nava Telangana