న్యూఢిల్లీ : సీఏఏ నిరసనకారులను దోషులుగా పేర్కొంటూ ఏర్పాటుచేసిన హౌర్డింగ్‌లను తొలగించాలని అలహాబాద్‌ హైకోర్టు జారీ చేసిన ఆదేశాలపై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. అలాగే యూపీ సర్కార్‌ దాఖలుచేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు విస్తృత ధర్మాసనానికి సిఫారసుచేసింది. ఇది ప్రజల గోప్యతలో అనవసర జోక్యమని పేర్కొంటూ ఆ హౌర్డింగ్‌లను తక్షణమే తొలగించాలని యూపీ సర్కార్‌ను అలహాబాద్‌ హైకోర్టు ఇటీవల ఆదేశించిన విషయం తెలిసిందే. కోర్టు ఆదేశాలను సవాలు చేస్తూ యోగి సర్కారు సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు యుయు లలిత్‌, అనిరుద్ధ బోస్‌లతోకూడిన ధర్మాసనం గురువారం విచారించింది. ‘తగినంత బలమున్న ధర్మాసనం ద్వారా మరింత పరిశీలించాల్సిన అంశం ఇది’ అని న్యాయమూర్తులు ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. ఆ 57 మంది అల్లర్లకు పాల్పడినట్టు గుర్తించిన తర్వాతనే హౌర్డింగ్‌లను పెట్టినట్టు రాష్ట్ర ప్రభుత్వం తరఫున హాజరైన సాలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా కోర్టుకు తెలిపారు. హౌర్డింగ్‌లను సమర్థించేలా ఏ చట్టం లేదని వ్యాఖ్యానించిన కోర్టు ఈ పిటిషన్‌ను విస్తృత ధర్మాసనానికి సిఫారసు చేసింది.

Courtesy Nava Telangana