– రాష్ట్రంలో నిలిచిపోనున్న జీవీకే ‘108 ఆంబులెన్స్‌ సేవలు’
– వేయిమంది ఉద్యోగుల తొలగింపునకు నోటీసులు
– అకస్మాత్తుగా ఒప్పందం రద్దు..

లక్నో: దేశంతో కరోనా కల్లోలం రేపుతున్న తరుణంలో.. ఆ మహమ్మారిపై జరుతుగున్న యుద్ధంలో వైద్య సిబ్బంది ముందుండి పోరాడుతూ ప్రజల ప్రాణాలను కాపాడుతున్నారు. అయితే, ఉత్తరప్రదేశ్‌లో మాత్రం కరోనాతో పోరాడుతున్న 108-అత్యవసర వైద్య సేవల ఆంబులెన్స్‌ ఉద్యోగుల మాత్రం విధుల నుంచి తొలగించబడుతున్నారు. ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఏకంగా వేయి మందికి పైగా ఉద్యోగులు ఉన్నారు. వీరిలో 500 మంది డ్రైవర్లు, 46 మంది సహాయక సిబ్బంది, 29 మంది కాల్‌ సెంటర్‌ ఎగ్జిక్యూటివ్స్‌, 400 మంది ఎమర్జెన్సీ మెడికల్‌ టెక్నీషియన్స్‌తో పాటు మరో 8మందితో కూడిన ఎమర్జెన్సీ రెస్పాన్స్‌ టీం ఉంది. రాష్ట్రంలో 108 ఏఎల్‌ఎస్‌ అంబులెన్స్‌ సేవలు నిలిచిపోనున్నాయి. దీనికి కారణం అత్యవసర అంబులెన్స్‌ ప్రొవైడర్‌ అయిన జీవీకేకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి చెల్లింపులు లేకపోవడమే.. అనేక సార్లు సంస్థ ప్రభుత్వాన్ని అభ్యర్థించినప్పటికీ.. సర్కారు నుంచి స్పందన కరువవడమే !

అత్యవసర అంబులెన్స్‌ సర్వీసు ప్రొవైడర్‌ జీవీకే-ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్‌ అండ్‌ రీసెర్చ్‌ ఇనిస్టిట్యూట్‌ (ఈఎంఆర్‌ఐ) తన అడ్వాన్స్‌డ్‌ లైఫ్‌ సపోర్ట్‌ (ఏఎల్‌ఎస్‌)-108 అంబులెన్స్‌ కార్యకలాపాలను నిలిపివేయాలని నిర్ణయించింది. నిధుల కొరత, పెరుగుతున్న నష్టాలు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్పందన కరువవడం వంటి సమస్యలే కారణంగా పేర్కొంది. అంబులెన్స్‌ సేవలు అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం జీవీకే-ఈఎంఆర్‌ఐతో ఒప్పందం కుదుర్చుకుంది. దీనిలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం మౌలిక సదుపాయాలు కల్పించింది. అయితే, రాష్ట్ర ప్రభుత్వం నుంచి సకాలంలో నిధులు అందకపోవటంతో కొన్నేండ్లుగా ఈ సేవలు దెబ్బతింటున్నాయి. పెద్ద సంఖ్యలో అంబులెన్స్‌ వాహనాలు ఇప్పటికే శిథిలావస్థలో పడ్డాయి.
దీనిపై అత్యవసర వైద్య సాంకేతిక నిపుణుడు ఉత్తర కుమార్‌ చౌహాన్‌ స్పందిస్తూ.. అక్టోబర్‌ 16 న జీవీకే-ఈఎంఆర్‌ఐ సేవను నిలిపివేయాలని తీసుకున్న నిర్ణయం అంబులెన్స్‌ వర్కర్స్‌ అసోషియేషన్‌ అధ్యక్షుడికి సమాచారమివ్వగా ఆయన షాక్‌ అయ్యారనీ, ఉద్యోగ తొలగింపు నోటీసులు వచ్చిన తర్వాత కూడా ఉద్యోగులందరూ కరోనా మహమ్మారి మధ్య అవిశ్రాంతంగా పనిచేస్తున్నారని చెప్పారు.

”కొన్ని అనివార్య కారణాల వల్ల యూపీ ప్రభుత్వం, ఏఎల్‌ఎస్‌ల మధ్య ఒప్పందం వాయిదా పడుతోంది. ఈ పరిస్థితుల్లో ఉద్యోగులు తమ విధుల ముగిసే చివరి రోజున సంస్థకు సంబంధించిన పత్రాలు, ఫైళ్లు, రికార్డులు ఇతర సామాగ్రిని సమర్పించాలి”అని కోరినట్టు ఓ ఉద్యోగి వెల్లడించాడు.

అలాగే, డ్రైవర్ల సంఘం సభ్యులు హనుమాన్‌ పాండే మాట్లాడుతూ.. రాష్ట్ర బీజేపీ సర్కారు మమ్మల్ని కరోనా యోధులుగా పిలిచింది… అయితే, తమకు వారి మద్ధతు అవసరమైనప్పుడు మాత్రం బయటకు పొమ్మని తలుపులు తెరుస్తున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. ఏఎల్‌ఎస్‌ ఉద్యోగులను తొలగించడానికి బదులు 102 అంబులెన్స్‌ సేవలకు తీసుకోవాలని కోరుతున్నారు.

Courtesy Nava Telangana