– యూపీ సర్కారు వింత పోకడపై అలహాబాద్‌ హైకోర్టు ఆగ్రహం

లక్నో : ఉత్తరప్రదేశ్‌ రాజధాని లక్నోలో సీఏఏ నిరసనకారుల ఫోటోలు, చిరునామాలతో కూడిన హౌర్డింగులను ఏర్పాటుచేయడం వారి వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించడమేనని అలహాబాద్‌ హైకోర్టు అభిప్రాయపడింది. సీఏఏ నిరసనకారులంటూ.. 53 మంది ఫోటోలు, అడ్రస్‌లతో కూడిన హౌర్డింగులను బుధవారం లక్నో వ్యాప్తంగా ఏర్పాటుచేశారు. దీనిని నిరసిస్తూ పలువురు కోర్టును ఆశ్రయించారు. దీన్ని సుమోటాగా తీసుకున్న న్యాయస్థానం.. వారి వ్యక్తిగత స్వేచ్ఛను భంగం కలిగించడమేనని తెలిపింది. ఇదే విషయమై లక్నో పోలీసు కమిషనర్‌ సుజిత్‌ పాండే, జిల్లా మెజిస్ట్రేట్‌ అభిషేక్‌ ప్రకాశ్‌లు వివరణ ఇవ్వాలని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ గోవింద్‌ మధుర్‌ ఆదేశించారు. దీనిపై తదుపరి విచారణ నేడు (సోమవారం) విచారణ చేపట్టనున్నారు. అయితే ఈ హౌర్డింగుల్లో నిరసనలకు సంబంధం లేని వారి పేర్లూ ఉన్నాయని రిటైర్డ్‌ ఐపీఎస్‌ అధికారి ఎస్‌.ఆర్‌. దరపురి (హౌర్డింగుల్లో ఆయన ఫోటో, అడ్రస్‌ కూడా ఉన్నాయి) ఆరోపించారు. దీనిని అప్రజాస్వామిక చర్యగా అభివర్ణించారు.

ఆయన మాట్లాడుతూ… ‘ఈ విషయమై నాకు ఎలాంటి నోటీసులు అందలేదు. మేము చేసిన నేరమేమిటో ఇంకా రుజువు కాలేదు. అసలు ఇంతవరకూ చార్జిషీటు కూడా దాఖలు చేయలేదు. ఇది అప్రజాస్వామికం. దీనికి వ్యతిరేకంగా మేం పిటిషన్‌ దాఖలు చేస్తాం. అంతేగాక నా ఫోటో పెట్టినందుకు గానూ పరువు నష్టం దావా కూడా వేయబోతున్నా’ అని తెలిపారు. హౌర్డింగుల్లో పేరున్న మరో వ్యక్తి రాబిన్‌ వర్మ స్పందిస్తూ.. ‘మా వ్యక్తిగత చిరునామా, విషయాలన్నీ అందులో రాశారు. మా ఇంటికొచ్చి ఎవరైనా దాడి చేస్తే ఎవరిది బాధ్యత..?’ అని ప్రశ్నించారు. హౌర్డింగుల్లో తమవారి పేర్లే అధికంగా ఉన్నాయంటూ షియా, సున్నీ ముస్లిం సంఘాలు ఖండించాయి. ఇది మానవ హక్కుల ఉల్లంఘనే అని ఆగ్రహం వ్యక్తం చేశాయి. ‘తీవ్ర నేరాలు చేసినవారిలాగా మా ఫోటోలతో సహా సమాచారాన్నంతా హౌర్డింగుల్లో చేర్చారు. రాళ్లు విసిరిన ఘటనలో నన్ను నిందితుడిగా చేర్చారు. అందుకు సంబంధించిన ఆధారాలను ఈ అధికారులు చూపెడతారా..? ఇందుకు సంబంధించి నాకు కనీసం నోటీసైనా అందకుండానే ఇలా చేయడం బాధాకరం’ అని మౌలానా సైఫ్‌ అబ్బాస్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Courtesy Nava Telangana