* పిపిఎలు రద్దు చేసిన యుపి సర్కారు
అమరావతి: విద్యుత్‌ కొనుగోళ్ల ఒప్పందా(పిపిఎ)లను రద్దు చేయడం కుదరదంటే, కుదరదని రాష్ట్ర ప్రభుత్వానికి పదేపదే లేఖలు రాస్తున్న కేంద్ర ప్రభుత్వానికి ఊహించని షాక్‌ తగిలింది. 2017లో 650 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తికి కుదుర్చుకున్న ఒప్పందాలను బిజెపి ఏలుబడిలోని ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం తాజాగా రద్దు చేసింది. అప్పట్లో కుదుర్చుకున్న రేట్లతో పోలిస్తే తాజాగా నిర్వహించిన బిడ్డింగ్‌ ప్రక్రియలో అతి తక్కువ ధర నమోదు కావడంతో పాత ఒప్పందాలను రద్దు చేసినట్టు ప్రకటిస్తూ ఆ వెంటనే కొనుగోళ్లు కూడా నిలిపివేసింది. ఇందుకు సంబంధించిన ఎటువంటి ముందస్తు ప్రకటన కానీ, కసరత్తు కానీ ఆ రాష్ట్ర ప్రభుత్వం చేయకపోవడం గమనార్హం. సొంత పార్టీకి చెందిన ప్రభుత్వమే ఒక్కమాట కూడా చెప్పకుండా అనూహ్యంగా తీసుకున్న ఈ నిర్ణయం కేంద్ర ఇంధన మంత్రిత్వ శాఖను ఇరకాటంలో పడేసింది. 550 మెగా వాట్ల సౌర విద్యుత్‌ ఉత్పత్తికోసం ఉత్తరప్రదేశ్‌ న్యూ అండ్‌ రెన్యువబుల్‌ ఎనర్జి ఏజెన్సీ ఇటీవల నిర్వహించిన బిడ్డింగ్‌ ప్రక్రియలో ఎన్‌టిపిసి యూనిట్‌కు 3.02 రూపాయలకు దాఖలు చేసి అతి తక్కువ కోట్‌ చేసిన సంస్థగా నిలిచింది. ఆ ధరను యుపి విద్యుత్‌ రెగ్యులేటరీ కమిషన్‌ కూడా ఖరారు చేసింది. దీంతో 2017లో రూ.3.46 చెల్లించాలని వివిధ సంస్థలతో కుదర్చుకున్న ఒప్పందాలను ‘చాలా ఖరీదైనవి’గా పేర్కొంటూ యుపి ప్రభుత్వం మంగళవారం రద్దు చేసింది. యూనిట్‌ 3.46రూపాయల రేటును కేంద్ర విద్యుత్‌ రెగ్యులేటరీ కమిషన్‌ అంగీకరించలేదని పేర్కొంది. యుపి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుని ఆరు రోజులు గడుస్తున్నా కేంద్ర ప్రభుత్వం బహిరంగంగా స్పందించిన దాఖలాలేదు. ఆంధ్ర ప్రదేశ్‌ ప్రభుత్వ నిర్ణయాన్ని పదేపదే తప్పు పట్టి, లేఖల మీద లేఖలు రాసిన కేంద్ర మంత్రి ఆర్‌కె సింగ్‌ ఇప్పుడేమంటారో చూడాలి.

Courtesy Prajashkathi…