-అసంఘటితరంగ కార్మికుల బతుకులు దుర్బరం
– సొంతూళ్లకు కాలినడకనే వెళ్తున్న ప్రజలు

న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా విధించిన లాక్‌డౌన్‌తో ఢిల్లీలో పేదలు, అసంఘటితరంగ కార్మికులు, దినసరి కూలీల బతుకులు దుర్బరమయ్యాయి. దీంతో రెక్కాడితే గానీ డొక్కాడని వాళ్లకు తినడానికి పట్టెడన్నం లేక అలమటిస్తున్నారు. ఢిల్లీ చుట్టుపక్కన ఉన్న రాష్ట్రాలే గాక దేశవ్యాప్తంగా ప్రజలు బతుకుదెరువు కోసం దేశరాజధానికి వెళ్తుంటారు. ఇందులో చాలామంది నిరాశ్రయులే. లాక్‌డౌన్‌తో బస్సులు, రైళ్లు, ప్రయివేటు వాహనాలు రోడ్డెక్కకపోవడంతో చాలామంది అక్కడే చిక్కుకున్నారు. బయట కూడా భోజనకేంద్రాలు, హౌటళ్లు, దుకాణాలు అన్నీ మూసే ఉండటంతో వీళ్లకు తిండికి తిప్పలు తప్పడం లేదు. ఢిల్లీ ప్రభుత్వం 234 నైట్‌ షల్టర్లు ఏర్పాటుచేసినా అవి ఎంతమాత్రమూ సరిపోవడం లేదని హక్కుల కార్యకర్తలు చెబుతున్నారు. ఇదిలాగే కొనసాగితే వారి బతుకులు మరింత దుర్బరమవుతాయని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

దీనిపై ప్రముఖ సామాజిక కార్యకర్త, ఢిల్లీ రోజీ రోటి అధికార్‌ అభియాన్‌ క్యాంపైయినర్‌ అంజలి భరద్వాజ స్పందిస్తూ… ‘ఢిల్లీలో పనులు చేసుకునే వారిలో చాలామంది నిరాశ్రయులే గాక అందరూ దినసరి కూలీలే. వారు దాచుకున్న కొంత డబ్బు కూడా ఈ పదిరోజుల్లోనే అయిపోయింది. కరోనా నేపథ్యంలో కనీసం పదిహేను రోజుల నుంచి అంతా బంద్‌ ఉండటంతో పరిశ్రమలు ఎక్కడివక్కడ మూతపడ్డాయి. దీంతో వారంతా ఆకలికి అలమటిస్తున్నారు. ప్రభుత్వమే వారికి వండిన ఆహారాన్ని అందించి వారి ఆకలిని తీర్చాలి. అంతేగాక ఢిల్లీలో పాఠశాలలు మూసివేయడంతో పిల్లలకు మధ్యాహ్నభోజనాన్ని అందించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి’ అని కోరారు. కాగా ప్రజా, ప్రయివేటు రవాణా బంద్‌ అవడంతో ఢిల్లీకి ఆనుకుని, సమీపాన ఉన్న రాష్ట్రాలైన యూపీ, రాజస్థాన్‌, హర్యానా, పంజాబ్‌లకు చెందిన ప్రజలు కాలినడకనే తమ సొంతూళ్లకు పయనమవుతున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్‌మీడియాలో ప్రజలను కంటతడి పెట్టిస్తున్నాయి.

Courtesy Nava Telangana