Image result for ఉన్నావో బాధితురాలి మృతి"– నాకు బతకాలని ఉన్నది… ఆ దోషులకు శిక్షపడాలి..
– సోదరునితో చివరగా బాధితయువతి అన్న మాటలివి
న్యూఢిల్లీ : లైంగికదాడి బాధితురాలిపై పెట్రోల్‌ పోసి నిప్పటించిన ఘటనలో యువతి మృతి చెందింది. లక్నోలోని శ్యామ్‌ ప్రసాద్‌ ముఖర్జీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమెను విమానంలో ఢిల్లీలోని సఫ్దర్‌గంజ్‌ ఆస్పత్రికి తరలించిన విషయం తెలిసిందే. ‘ఆమె పరిస్థితి విషమంగా ఉన్నది. వెంటిలేటర్‌ అమర్చాం. బతికే అవకాశాలు చాలా తక్కువ’ అని కాలినగాయాలు, ప్లాస్టిక్‌ సర్జరీ విభాగం అధిపతి డాక్టర్‌ షలాబ్‌ కుమార్‌ చెప్పిన కొద్దిగంటల్లోనే ఆ యువతి కన్నుమూసింది. కడసారిగా సోదరునితో మాట్లాడింది.నాకు బతకాలని ఉన్నది..ఆ దోషులకు శిక్షపడేంతవరకు పోరాడతాను..అని తన సోదరునితో అన్నట్టు తెలిపారు. కాగా ఆ యువతిపై దాడి జరిగాక…95 శాతం శరీరం కాలినా…అంబులెన్స్‌ కోసం ఆమె ఫోన్‌ చేసిన విషయం విదితమే. ఆ తర్వాత యూపీనుంచి ఢిల్లీకి ఎయిర్‌లిఫ్ట్‌ ద్వారా తరలించారు. కేసు విచారణ నిమిత్తం కోర్టుకు వెళుతున్న బాధితురాలిపై ఐదుగురు వ్యక్తులు అత్యంత పాశవికంగా దాడి చేసి, పెట్రోల్‌ పోసి నిప్పంటించిన విషయం తెలిసిందే. నిందితుల్లో ఒకడు ఇటీవలే బెయిల్‌పై బయటకు వచ్చాడు.
సిట్‌ దర్యాప్తునకు ఆదేశం
బాధితురాలిపై పెట్రోల్‌ పోసి నిప్పటించిన ఘటనపై విచారణకు ఐదుగురు సభ్యులతో కూడిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌)ను ఏర్పాటుచేస్తున్నట్టు లక్నో డివిజనల్‌ కమిషనర్‌ శుక్రవారం ప్రకటించారు. ‘ఉన్నావోలో ఘటన జరిగిన ప్రదేశానికి వెళ్ళి పరిశీలించాను. ఉన్నావో ఏఎస్‌పీ నేతృత్వంలో ఐదుగురు సభ్యులతో కూడిన సిట్‌ను ఏర్పాటుచేస్తున్నాను. కేసుకు సంబంధించి అన్ని కోణాల్లో దర్యాప్తు నిర్వహించి.. నివేదికను సమర్పిస్తుంది. నివేదిక వచ్చిన తర్వాత.. దానిని ప్రభుత్వానికి సమర్పిస్తాం’ అని డివిజనల్‌ కమిషనర్‌ ముఖేష్‌ మేశ్రాం చెప్పారు. దర్యాప్తునకు కాలపరిమితి విషయంపై ఆయన మాట్లాడకపోవటం విమర్శలకు దారితీస్తున్నది.
బెదిరిస్తున్నారు : బాధితురాలి బంధువు
లైంగికదాడి కేసు వెనక్కి తీసుకోవాలంటూ నిందితుల తరఫు కుటుంబసభ్యులు తమను బెదిరిస్తున్నారని బాధితురాలి బంధువు పోలీసులకు ఫిర్యాదుచేశారు. తీవ్ర పరిణామాలు ఎదుర్కోక తప్పదంటూ నిందితుడు శివం సమీప బంధువు బెదిరిస్తున్నారని అద్దె ఇంట్లో ఉంటూ.. చిన్న దుకాణం నడుపుకుంటున్న ఆయన పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ‘నీ షాపును తగుల బెడతాం.. నిన్ను కూడా బతకనివ్వం’ అంటూ బెదిరింపు ఫోన్‌ కాల్‌ వచ్చినట్టు తెలిపారు. ఈ నేపథ్యంలో ఆ కుటుంబసభ్యులకు భద్రత ఏర్పాటు చేస్తున్నట్టు పోలీ సులు చెప్పారు. ఈలోపు బాధిత యువతి కన్నుమూయటంతో ఆ కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

(Courtesy Nava Telangana)