దిల్లీ జిల్లా కోర్టు తీర్పు
శిక్ష ఖరారుపై రేపు వాదనలు
సీబీఐ వ్యవహారశైలిని తప్పుపట్టిన న్యాయస్థానం

దిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం కలిగించిన ఉన్నావ్‌ అత్యాచారం కేసులో ఎమ్మెల్యే కులదీప్‌ సింగ్‌ సెంగార్‌ (53) దోషి అని దిల్లీ జిల్లా జడ్జి సోమవారం తీర్పు ఇచ్చారు. ఏ మేరకు శిక్ష విధించాలనే విషయమై బుధవారం వాదోపవాదాలు జరగనున్నాయి. నేరాల తీవ్రత ప్రకారం చూస్తే జీవితకాల శిక్ష పడే అవకాశం ఉంది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని బంగర్‌మవూ నియోజకవర్గం ఎమ్మెల్యే అయిన సెంగార్‌ భాజపా తరఫున ఎన్నికకాగా, గత ఆగస్టులో ఆయన పార్టీ నుంచి బహిష్కృతులయ్యారు. ఆయన ఆ నియోజకవర్గం నుంచి నాలుగు సార్లు విజయం సాధించారు. ఈ కేసులో మరో నిందితురాలైన శశి సింగ్‌ నిర్దోషి అని జడ్జి ప్రకటించారు.

బలవంతుడిపై ఇచ్చిన నిజమైన వాంగ్మూలం
సెంగార్‌ నేరం చేసినట్టు భారతీయ శిక్షా స్మృతితో పాటు, పోక్సో చట్టాల కింద రుజువయిందని జిల్లా జడ్జి ధర్మేశ్‌ శర్మ తన తీర్పులో స్పష్టం చేశారు. ‘‘అత్యాచారానికి గురయినట్టు ఆ బాలిక ఇచ్చిన వాంగ్మూలం నిజమైనది, దోషం లేనిది. ఆమె బెదిరింపులకు గురయి భయపడింది. ఆమె పల్లెటూరు బాలిక. మరోవైపు సెంగార్‌ బలవంతుడు. అందుకే ఫిర్యాదు చేయడానికి సమయం తీసుకొంది. పితృస్వామిక వ్యవస్థలో పెరిగిన పిల్లలు బలవంతులు చేసిన అత్యాచారాలపై ఫిర్యాదు చేయడానికి భయపడతారు’’ అని జడ్జి పేర్కొన్నారు.

సీబీఐ… ఇదేమి తీరు!
ఈ సంఘటన 2017లో జరగగా, అభియోగపత్రాల నమోదులో సీబీఐ చాలా ఆలస్యం చేయడంపై కోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. విచారణను కూడా కావాలని జాప్యం చేస్తూ సాగదీసిందని కోర్టు విమర్శించింది. దర్యాప్తు, ప్రాసిక్యూషన్‌ విషయమై ఉన్న మార్గదర్శకాలను సీబీఐ పాటించడం లేదని తప్పుపట్టింది. ‘‘పోక్సో చట్టంలోని సెక్షన్‌ 24 ప్రకారం బాధితురాలి వాంగ్మూలం నమోదు చేయడానికి తప్పనిసరిగా మహిళా అధికారి ఉండాలి. దాన్ని సీబీఐ పాటించలేదు. బాధితురాలి ఇంటికి వెళ్లి వాంగ్మూలం నమోదు చేయాల్సి ఉన్నా, ఆమెనే పలుమార్లు సీబీఐ కార్యాలయానికి పిలిపించారు’’ అని తీవ్రంగా ఆక్షేపించింది. బాధితురాలి వాంగ్మూలంలోని కీలక విషయాలు బయటకు పొక్కేలా చేసి, విచారణకు విఘాతం కలిగేలా వ్యవహరించిందని పేర్కొంది.

మరో నాలుగు కేసులపై కొనసాగుతున్న విచారణ
కేసు తీవ్రత దృష్ట్యా విచారణ రహస్యంగా జరిగింది. ఈ కేసుతో ముడిపడి ఉన్న మరో నాలుగు ఇతర కేసులపై విచారణ కొనసాగుతోంది. వీటిని సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు లఖ్‌నవూ నుంచి దిల్లీకి బదిలీ చేశారు.1. బాధితురాలిపై మరో ముగ్గురు సామూహిక అత్యాచారం చేయడం, 2. బాధితురాలి తండ్రిని అక్రమ ఆయుధాల కేసులో ఇరికించడం, 3. బాధితురాలి తండ్రి పోలీసు కస్టడీలో మరణించడం, 4. రోడ్డు ప్రమాదంలో బాధితురాలు గాయపడడం, ఆమె బంధువులు మృతి చెందడంపై నమోదైన కేసులకు సంబంధించి విచారణ జరుగుతోంది.

కేసు పూర్వపరాలు
ఉద్యోగం కావాలంటూ వెళ్లిన 17 ఏళ్ల మైనర్‌ బాలికపై 2017 జూన్‌ 4 భాజపా ఎమ్మెల్యే కులదీప్‌ సింగ్‌ సెంగార్‌ అత్యాచారం చేసినట్టు ఆరోపణ వచ్చింది. 2018 ఏప్రిల్‌ 3న బాధితురాలి తండ్రిపై కొందరు వ్యక్తులుదాడి చేయడంతో పాటు, అక్రమంగా ఆయుధాలు కలిగి ఉన్నాడన్న ఆరోపణలపై తప్పుడు కేసులో ఇరికించారు. సెంగార్‌పై కేసులు నమోదు చేయకపోవడంతో ఏప్రిల్‌ 8న ఆమె, కుటుంబ సభ్యులతో లఖ్‌నవూ వెళ్లి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ నివాసం ముందు ఆత్మహత్యకు ప్రయత్నించింది. మరుసటి రోజునే పోలీసు కస్టడీలో ఉన్న బాధితురాలి తండ్రి మరణించాడు. చివరకు ఏప్రిల్‌ 13న సెంగార్‌ను అరెస్టు చేశారు. జులై 28న విచారణ నిమిత్తం బాధితురాలు కారులో కోర్టుకు వెళ్తుండగా, నంబరులేని లారీ దాన్ని ఢీకొంది. కారులో ప్రయాణిస్తున్న బాధితురాలికి బంధువులైన ఇద్దరు మహిళలు మృతి చెందగా, న్యాయవాది తీవ్రంగా గాయపడ్డారు. తనకు బెదిరింపులు వస్తున్నాయని అప్పటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగొయికి బాధితురాలు లేఖ రాశారు. దాంతో కేసులను లఖ్‌నవూ నుంచి దిల్లీ కోర్టుకు బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

Courtesy Eenadu…