అవిజిత్‌ పాఠక్‌
అనువాదం: కొండూరి వీరయ్య,సెల్‌: 9871794037

విద్య ప్రజలందరి హక్కు. కొద్దిమంది సంపన్నులకు మాత్రమే దక్కే విలాసవంత మైన సరుకు కాదు. నేను అధ్యాపకునిగా పనిచేస్తున్న జవహర్‌లాల్‌ నెహ్రూ విశ్వవిద్యాలయంలో (జేఎన్‌యూ) అక్కడి విద్యార్ధులు కనీసం తమతో మనసు విప్పి మాట్లాడటం చేతకాని పాలకమండలి కారణంగా ఉద్యమబాట పట్టారు. వారికి బాసటగా అధ్యాపకవర్గం సంఘీభావం తెలుపుతోంది. అయితే ఈ పరిస్థితి కేవలం జేఎన్‌యూకి మాత్రమే పరిమితం అయినది కాదు. ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు ఎదుర్కొంటున్న తీవ్రమైన సంక్షోభాన్ని అర్థం చేసుకోకుండా జేఎన్‌యూ వివాదాన్ని అర్థం చేసుకోలేం. జామియా మిలియా నుంచి జాదవ్‌పూర్‌ యూనివర్సిటీ వరకు, విశ్వభారతి నుంచి అలిఘర్‌ ముస్లిం యూనివర్సిటీ వరకు, హెచ్‌సీయూ నుంచి ఢిల్లీ విశ్వవిద్యాలయం వరకు ఎటు చూసినా కనిపించేది ఒక్కటే. ఈ విశ్వవిద్యాలయాన్నీ లోతైన పరిశోధనా స్ఫూర్తి, సున్నితమైన రాజకీయ అస్తిత్వ కోణాలు, బోధనా వైవిధ్యంతో పాలకమండలి నామమాత్రపు జోక్యం ద్వారా విశాలమైన ప్రజాతంత్ర స్ఫూర్తి పతాకలు ఎగురవేస్తున్న విశ్వవిద్యాలయాలు. అటువంటి ప్రజాతంత్ర విద్యా వికాస వాతావరణంలో పని చేసే విద్యార్థులు, అధ్యాపకులు, పరిశోధకులు మౌలిక జ్ఞాన సముపార్జనలో అగ్రభాగాన నిలిచారు. అటువంటి విజ్ఞాన వికాస కేంద్రాలపై ఓ వ్యూహం ప్రకారం సాగుతున్నాయి ఈ వికృత దాడులు. ఈ విశ్వవిద్యాలయాల్లో రాజకీయ అంధవిశ్వాసాలు కలిగిన వ్యక్తులు, తాత్విక దృక్ఫథం లోపించి విశ్వవిద్యాలయాల అజమాయిషీ అంటే సాంకేతిక పర్యవేక్షణే అని భావించే యాంత్రిక జీవుల్ని వైస్‌ ఛాన్సలర్లుగా నియమించటంతో విద్యాకుసుమాలు వెదజల్లాల్సిన విశ్వవిద్యాలయాలు ఆధునిక నిఘా పరికరాల పర్యవేక్షణ నీడన, సైనిక క్రమశిక్షణ పోలిన వాతావరణంలో రోజులు వెళ్లదీస్తున్నాయి. ఈ పరిణామాలు గమనిస్తే దేశంలో ప్రతిష్టాత్మకమైన విశ్వవిద్యాలయాలు అంపశయ్యపైకి చేరాయని పిస్తోంది.
విద్యా వ్యవస్థ లక్ష్యం
ప్రభుత్వ నిధులతో నడిచే విశ్వవిద్యాలయాలు, పేదలకు సైతం ఉన్నత స్థాయి ప్రమాణాలు కలిగిన నాణ్యమైన విద్య అందించే విద్యా కేంద్రాలు ఉక్కుపాదాల కింద నలగటం అంటే ఆదర్శవంత మైన ప్రజాస్వామిక విలువలు అడుగుజారినట్టే. మార్కెట్లే దైవాంశ సంభూతులుగా చలామణీ అవుతున్న ఈ కాలంలో విద్య సరుకుగా, ఉన్నత విద్య మార్కెట్‌కు అవసరమైన సుకుమారమైన నైపుణ్యాలను సరుకుగా అందించేదిగా మారిపోతుంది. ఆకర్షణీయమైన ప్రయివేటు విశ్వవిద్యాలయాలు ఆరంగేట్రం చేస్తాయి. సాంకేతిక యాజమాన్య శిక్షణ సంస్థల పేరుతో అడ్డగోలు కేంద్రాలు దుకాణాలు తెరుచుకుని కూర్చుంటాయి. ఈ కొత్త రకం విశ్వవిద్యాలయాల్లో ఉపాధ్యాయులు కేవలం సేవలందించే సరుకులు. విద్యార్థులు ఆ సేవలు వినియోగించుకునే సరుకులు. విద్య కేవలం వినియమవాద సిద్ధాంతాన్ని బతికించి ఉంచే సాధనంగా మారుతుంది. అటువంటి విద్యలో విముక్తి కోణం మచ్చుకైనా కానరాదు. స్వతహాగానే ఈ విశ్వవిద్యాలయాలు అప్రజాస్వామిక తత్వాన్ని ఆరాధించే కేంద్రాలుగా మారతాయి. యథాతథ స్థితిని నెత్తికెత్తుకునే మితవాద మేధావుల తయారీ కేంద్రాలుగా మారతాయి.
ఒకజాతిగా మన సాంస్కృతిక పెట్టుబడి ఏకశిలా సదృశ్యమైనదిగా మారకుండా ఉండాలంటే, సామాజిక అసమానతల పునరుత్పత్తిని నియంత్రించాలంటే మనం సృజనాత్మకమైన సున్నితమైన పౌరులుగా భావితరాలను తీర్చిదిద్దాలి. దానికి గాను జీవితాన్ని పాఠ్యాంశంగా మల్చగలగాలి. సామాజిక సంఘీభావాలు వికసించే క్రమానికి పునాదులు వేయాలి. ఇటువంటి లక్ష్యాల సాధనకు ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు మాత్రమే వేదికలు కాగలుగుతాయి. అటువంటి విశ్వవిద్యాలయాలను బతికించుకున్నప్పుడు మాత్రమే ఈ లక్ష్యాలు సాధించగలుగుతాం. జేఎన్‌యూ అక్షరాలా ఈ లక్ష్యాలను సాధించే దిశగా ప్రయాణిస్తోందన్నది వాస్తవం. బహుశా నెహ్రూ ఊహించిన సంక్షేమ రాజ్య నిర్మాణానికి కావల్సిన పునాదులు వేస్తోందని చెప్పవచ్చు. సృజనాత్మకమైన అడ్మిషన్‌ విధానం, వైవిధ్యత సాధన కోసం సాగించే ప్రయత్నం, విమర్శనాత్మక సామాజిక శాస్త్రాలు, సమ్మిళిత సాంస్కృతిక అధ్యయనాలు, మౌలిక విజ్ఞాన శాస్త్రాల మేలిమి మేళవింపుతో బోధన, మదింపు, పరిశోధనా పద్ధతుల్లో స్వయం ప్రతిపత్తితో జేఎన్‌యూ విముక్తి కేంద్రంగా ఎదిగింది. మణిపూర్‌కు చెందిన గిరిజన విద్యార్థినుల మొదలు మహారాష్ట్ర నుంచి దళితులు, కేరళ నుంచి వామపక్షభావాలు ఎగసిపడే యువతను, ఢిల్లీ నుంచి తీవ్రవాద స్త్రీవాదులు, ఉత్తరప్రదేశ్‌ గ్రామీణ ప్రాంతాల నుంచి అంబేద్కర్‌ భావజాల ప్రేరేపితులు, జర్మనీ శ్రీలంకల నుంచి విద్యార్జనే లక్ష్యంగా వచ్చే ప్రయాణీకులు… ఇలా ఎందరినో జేఎన్‌యూ అక్కున చేర్చుకున్నది. సామాజిక న్యాయం, సమానత్వం అమలు జరుపుతూనే అద్భుతమైన మేధోప్రతిభను ప్రదర్శించవచ్చని రుజువు చేసింది. అటువంటి ఈ లోకస్వప్నాన్ని సాకారం చేయగలిగే విశ్వవిద్యాలయాన్ని భూస్థాపితం చేయటానికి ప్రస్తుత పాలకమండలి కంకణం కట్టుకోవటం విచారకరం.
ప్రత్యామ్నాయ గొంతుకలను నులిమేస్తున్నారు
మారుతున్న రాజకీయాల స్వభావాన్ని, పాలకవర్గపు మాఖియవెల్లీ కుట్రలను అర్థం చేసుకోవటానికి లోతైన పరిశీలన అవసరం. పురుషాధిక్యతతో కూడిన ఉద్విగ మతోన్మాద ప్రేరిత జాతీయవాదం ఆధిపత్య సిద్ధాంతంగా అవతరించిన నేపథ్యంలో ప్రత్యామ్నాయ గొంతుకలను నులిమివేయటం సాధారణ ప్రక్రియగా మారింది. నా ఉద్దేశంలో ప్రత్యామ్నాయ గొంతుకలు అంటే జాతీయత, సంస్కృతి, గుర్తింపు వంటి వాటిని భిన్న కోణాల్లో అధ్యయనం చేసే, పరిశీలించే, పరిశోధించే ప్రయత్నాలు. యువ మేధావులు నెలసరి ప్యాకేజీలు వార్షిక వేతనాల కోసం చూడటమే కాక మార్క్స్‌, అంబేద్కర్‌, గాంధీ, రవీంద్రనాథ్‌ ఠాగూర్‌, ఫోకాల్డ్‌, బట్లర్‌ల తాత్వికల గురించీ, ఆధిపత్య భావజాలంగా జాతీయత గురించీ, దానికి పునాదిగా ఉన్న పితృస్వామిక వ్యవస్థల గురించి, దొంతరల నిర్మాణం గురించీ, సాంస్కృతిక భిన్నత్వంపై జాతీయవాద దురుసుతనం గురించీ మేధోమధనం చేస్తుంటారు. బహుశా అందుకేనేమో జేఎన్‌యూకు జాతి వ్యతిరేకత ముద్ర ఖాయం చేశారు. జేఎన్‌యూకు ఈ బిరుదునిచ్చిన దుందుడుకు దుండగులే జాదవ్‌పూర్‌ విశ్వవిద్యాలయంపై దాడికి వెంపర్లాడుతున్నారు. ఢిల్లీ విశ్వవిద్యాలయంలో బోధనాంశాలేమిటో గుచ్చి గుచ్చి ఆరా తీస్తున్నారు.
జ్ఞాన సముపార్జన – నూతన రాజకీయాలు
అంతేకాదు. సాంకేతికమైన హేతుబద్ధత, మితవాద జాతీయత కలగలిసిపోవటంతో జ్ఞానసముపార్జనకు సంబంధించిన నూతన రాజకీయాలు ముందుకొస్తున్నాయి. సామాజిక విజ్ఞాన శాస్త్రాల్లోని విమర్శనాత్మక స్వభావం, దృక్ఫథం, లలిత కళల ఆత్మసంవేదన ప్రక్రియలను కూడా అనుమానాస్పద దృష్టిలో చూస్తాయి. ఈ అంశాల్లో పరిశోధన సాగిస్తున్న యువ మేధావులు సమాజానికి భారమన్న వాదన ముందుకు తెస్తాయి. కొన్ని టీవీ ఛానళ్లలో కొందరు గొంతు చించుకుని అరుస్తున్నట్టు ఇలాంటి విశ్వవిద్యాలయాలు నడపటానికి అయ్యే ఖర్చు ప్రజలకు పన్నుల రూపంలో మోయలేని భారమవుతుందన్న వితండవాదం వెర్రితలలు వేస్తుంది. ఉదాహరణకు జేఎన్‌యూ గోడల నిండా వైవిధ్యపూరితమైన సౌందర్యారాధనకు చిహ్నాలుగానూ, రాజకీయ భావాలకు ప్రతీకలుగా ఉన్న గోడపత్రికలను తొలగించటంలోనూ, జేఎన్‌యూలో ఇంజనీరింగ్‌, మేనేజిమెంట్‌ విద్యా కేంద్రాలు ప్రారంభించటంలోనూ చూపిస్తున్న తొందరపాటు, తపన గమనిస్తుంటే ముందు ముందు జరగబోయే పరిణామాలు ఊహించటం అంత కష్టమేమీ కాదు.
అయినా విద్యార్థులు ఆవేశంగా ఉన్నారు. అసంతృప్తితో ఉన్నారు. విశ్వవిద్యాలయంలో విద్యార్థుల ఆందోళన శాంతి భద్రతల సమస్యగా భావించే స్థాయికి విశ్వవిద్యాలయం పాలకమండలి దిగజారింది. విశ్వవిద్యాలయం ఎదుర్కొంటున్న అస్తిత్వ సంక్షోభానికి గల మూలకారణాలు వెదకటానికి బదులు, అధ్యాపకులు, విద్యార్థులతో అర్థవంతంగా వ్యవహరించటానికి బదులు పాలకమండలి అన్ని రకాలుగా బలప్రయోగానికి ఒడిగడుతోంది. విద్యార్థులకు, అధ్యాపకులకు చార్జిషీట్లు, షోకాజ్‌ నోటీసులు జారీ చేయటం జేఎన్‌యూలో నేడు నిత్యకృత్యం. నోరు మెదపని పాలకమండలి, విశ్వవిద్యాలయం నిండా తిష్టవేసిన పోలీసు, పారా మిలటరీ బలగాలు, చుట్టూ మొహరించిన ఆధునిక నిఘా వ్యవస్థలు విద్యాలయం ప్రతిష్ట మంటగలుపుతున్నాయి. ఈ చర్యలు పైశాచికత్వానికి నిదర్శనమా లేక మతపరమైన దూషణ భూషణలకు సంకేతమా?
సంస్కృతి, బోధనాంశాల పట్ల ఆసక్తి కలిగిన అధ్యాపకునిగా నేను ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు కాపాడుకోవటానికి ప్రజలే ముందడుగు వేయాల్సి ఉందని భావిస్తున్నాను. ప్రత్యేకించి కార్పొరేట్‌ దాష్టీకానికి అలవాటుపడ్డ ఓ కులీన వర్గం ఉమ్మడి సంఘీభావంతో నిండిన ఆదర్శవంతమైన ప్రజా జీవనాన్ని చూడలేని పరిస్థితులు విశ్వవ్యాప్తమవుతున్న సమయంలో, ఆధిపత్య రాజకీయ భావజాలం బుద్ధి జీవుల ఆలోచనలు ప్రజలకు చేరకుండా అడ్డుగోడలు కడుతున్న నేపథ్యంలో, విశ్వవిద్యాలయాల పరిరక్షణ కోసం విశాల జనబాహుళ్యపు ప్రజాతంత్ర కార్యాచరణ తక్షణ అవసరమని భావిస్తున్నాను. ఉదాహరణకు జేఎన్‌యూ విద్యార్థులు హాస్టల్‌ ఫీజుల పెంపును వ్యతిరేకిస్తూ ఆందోళన చేస్తున్నప్పుడు, ప్రత్యేకించి ప్రభుత్వ విశ్వవిద్యాలయాలకు ప్రభుత్వం నిధులు కేటాయించటం ద్వారా నాణ్యత కలిగిన ఉన్నత విద్య అందరికీ అందుబాటులోకి తేవాల్సిన విషయాన్ని మనకు గుర్తు చేస్తున్నప్పుడు ఇటువంటి ప్రజా కార్యాచరణ అవసరం. అయితే మన వైస్‌ ఛాన్సలర్లు, మేధోధికారుల కండ్లు తెరిపించటం అంత తేలికైన పని కాదు. అధికార దాష్టీకానికి దాసులుగా మారి మానసికంగా నిరంతరం నిస్సహాయులుగా వ్యవహరించే ఇటువంటి పాలకులు మార్గదర్శకునికి ఉండాల్సిన మౌలిక లక్షణాలైన – ఇతరులు చెప్పేది వినడం, నొప్పించక ఒప్పించడం, సంరక్షకులకు ఉండాల్సిన నైతికతను మర్చిపోతారు.
వ్యాసకర్త: జేఎన్‌యూలో సోషియాలజీ ప్రొఫెసర్‌.