– ఆందోళన బాటలో 3 ఐఐటీలు
– సీఏఏ ప్రతులను తగులబెట్టిన ఐఐటీ మద్రాస్‌ విద్యార్థులు
– పాండిచ్చేరిలో క్లాసుల బహిష్కరణ

కోల్‌కతా/ న్యూఢిల్లీ బ్యూరో : పౌరసత్వ నిరసన సెగలు ప్రఖ్యాత ఉన్నత విద్యా సంస్థలైన ఐఐటీలనూ తాకాయి. దేశ రాజధాని ఢిల్లీలోని జామియా మిలియా ఇస్లామియా (జేఎంఐ), అలీగఢ్‌ ముస్లిం విశ్వవిద్యాలయాల (ఏఎంయూ) విద్యార్థుల పట్ల పోలీసుల తీరును నిరసిస్తూ, పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా ఐఐటీ విద్యార్థులు తమ గళం వినిపిస్తున్నారు. ‘మా నిరసన ఒక్క సీఏఏపైనే కాదు.. జేఎంఐలో పోలీసుల తీరును మేం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం’ అని ఐఐటీ మద్రాస్‌ విద్యార్థి తెలిపారు. ఐఐటీ మద్రాస్‌, ఐఐటీ బాంబే, ఐఐటీ కాన్పూర్‌లలో సోమవారం విద్యార్థులు శాంతియుత నిరసన ర్యాలీలు చేపట్టారు. మద్రాస్‌ ఐఐటీలో సీఏఏ ప్రతులను దహనం చేసి విద్యార్థులు తమ నిరసన వ్యక్తంచేశారు. నిరసన కార్యక్రమాలకు ఎప్పుడూ దూరంగా ఉండే ఈ విద్యాసంస్థల విద్యార్థులు తొలిసారి ఆందోళనల్లో పాల్గొనటం గమనార్హం. ‘జాదవ్‌పూర్‌ యూనివర్సిటీలో విద్యార్థులపై ప్రతీకార దాడి జరిగినప్పుడు స్పందించలేదు. ఎంటెక్‌ ఫీజులు పెంచినప్పుడు స్పందించలేదు. జేఎన్‌యూ విద్యార్థులపై దాడి జరిగినప్పుడూ మాట్లాడట్లేదు.. ఇప్పుడు కూడా స్పందించకపోతే విద్యార్థి లోకం పట్ల మనకున్న నిబద్ధత ప్రమాదంలో పడుతుంది. అందుకే విద్యార్థులంతా జేంఎఐ, ఏఎంయూ విద్యార్థులకు మద్దతుగా క్యాంపస్‌లో శాంతియుత ప్రదర్శనలునిర్వహించాలి’ అంటూ ఐఐటీ కాన్పూర్‌ విద్యార్థులు ఓ పోస్టర్‌ను విడుదల చేశారు.

పలు వర్సిటీల్లో
పాండిచ్చేరిలో యూనివర్సిటీ విద్యార్థులు క్లాసులను బహిష్కరించి ఆందోళన బాటపట్టారు. జేఎంఐ విద్యార్థులకు మద్దతుగా నినాదాలు చేశారు. కోల్‌కతాలోని జాదవ్‌పూర్‌ యూనివర్సిటీలో విద్యార్థులు భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. ‘మాకు న్యాయం కావాలి’ అన్న నినాదాలు క్యాంపస్‌లో మారుమోగాయి. అలహాబాద్‌ యూనివర్సిటీలోని విద్యార్థులు జేఎంఐకు మద్దతుగా ఆందోళనబాట పట్టారు. ఢిల్లీ యూనివర్సిటీలోనూ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. జేఎంఐ విద్యార్థులపై దాడికి నిరసనగా ఢిల్లీ యూనివర్సిటీలో విద్యార్థులు పెద్దఎత్తున నిరసన ర్యాలీ చేపట్టారు.
ఎన్నార్సీ భయంతో బెంగాల్‌లో మహిళ ఆత్మహత్య
పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్న క్రమంలో పలువురు ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా ఎన్నార్సీ భయంతో బెంగాల్‌లోని పూర్బా వర్ధమాన్‌ జిల్లాలో ఓ మహిళ ఆత్మహత్య చేసుకున్నది. బీజేపీ సర్కారు ఎన్నార్సీని దేశవ్యాప్తం చేస్తామని ప్రకటించిన నేపథ్యంలో.. సదరు మహిళ భయాందోళనకు గురై ఆత్మహత్యకు పాల్పడిందని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. సదరు మహిళ కుమారుడికి ఆధార్‌ కార్డు ఉంది, కానీ జనన ధ్రువీకరణ పత్రం, ఓటరు కార్డు లేదనీ.. ఈ కారణంగా తన కుమారుడిని దేశం నుంచి బయటకు పంపేస్తారేమోననే భయంతో ఉండేదని ఆయన అన్నారు.

నేడు ఢిల్లీ బంద్‌కు విద్యార్థిసంఘాల పిలుపు
మంగళవారం ఢిల్లీ బంద్‌కు విద్యార్థి సంఘాల ఐక్య కార్యచరణ పిలుపు నిచ్చింది. ”రాజ్యాంగాన్ని కాపాడాలి, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలి” అంటూ జామియా విద్యార్థులపై పోలీసుల దాష్టీకాన్ని ఖండిస్తూ 20 విద్యార్థి సంఘాల నేతృత్వంలోని అఖిల భారత విద్యా పరిరక్షణ ఫోరం ఢిల్లీ బంద్‌కు పిలుపు నిచ్చింది. మయూక్‌ బిశ్వాస్‌ (ఎస్‌ఎఫ్‌ఐ), విక్కీ మహేశ్వరీ (ఏఐఎస్‌ఎఫ్‌), ఎన్‌ సాయిబాలజీ (ఏఐఎస్‌ఏ), ఐషీ ఘోష్‌ (జేఎన్‌యూఎస్‌యూ), సలామ్‌ లితియాజ్‌ (ఏఎంయుఎస్‌యూ), వికాశ్‌ యాదవ్‌ (ఎన్‌ఎస్‌యూఐ), అఖ్వీబ్‌ రిజ్వాన్‌ (సీవైఎస్‌ఎస్‌), అమిత్‌ (బాప్సా), నోపల్‌ ఎండి సఫిఉల్లా (పీఎస్‌యూ), సరిక చౌదరి (డీఎస్‌ఎఫ్‌), సౌమ్యద్వీప్‌ సర్కార్‌ (ఏఐఎస్‌బీ), ప్రియాంక భారతి (సీఆర్‌జడీి), దిగ్విజరు సింగ్‌ దేవ్‌ (సమాజ్‌వాదీ చేత్రసభ), మిముషా గోరరు (పీయూఎస్‌సీి), శుభుజిత్‌ దేవ్‌ (ఏయూడీఎస్‌సీి), దేబ్‌రాజ్‌ దేబ్‌నాథ్‌ (ఏఎఫ్‌ఎస్‌యూ), అభిషేక్‌ నందన్‌ (హెచ్‌సీయూఎస్‌యూ), పరిచరు యాదవ్‌ (పీియూఎస్‌సీి), అప్కేష్‌ (బాసో), సార్యి (కలక్టివ్‌) సంఘాల నేతలు ఉమ్మడిగా ప్రకటన విడుదల చేశారు. అదేవిధంగా జామియా వర్శిటీని ప్రజా సంఘాల బృందం సందర్శించింది. హన్నన్‌ మొల్లా, పి. కృష్ణ ప్రసాద్‌ (ఏఐకెేఎస్‌), వీరేంద్ర గౌడ్‌ (సీిఐటీయూ), బీ. వెంకట్‌ (ఏఐఏడబ్ల్యుయూ), ఐషీ ఘోష్‌ (ఎస్‌ఎఫ్‌ఐ)లతో కూడిన బృందం జామియాను సందర్శించింది. క్యాంపస్‌లో జరిగిన దురదృష్టకర ఘటనను బృందానికి చీఫ్‌ ప్రొక్టర్‌ ప్రొఫెసర్‌ వసీమ్‌ అహ్మద్‌ ఖాన్‌ వివరించారు. సిటిజన్‌షిప్‌ చట్ట సవరణను సవాల్‌ చేస్తూ భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (డివైఎఫ్‌ఐ) సుప్రీంలో పిటిషన్‌ దాఖలు చేసింది. అందులో ప్రతివాదిగా

కేంద్ర ప్రభుత్వాన్ని పేర్కొంది.
పౌరసత్వ చట్టంతో ఏం ప్రయోజనం?: సుప్రీంలో కమల్‌ హాసన్‌ పిటిషన్‌
పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ మక్కల్‌ నీది మయం (ఎంఎన్‌ఎం) అధినేత కమల్‌ హాసన్‌ సుప్రీంకోర్టు లో పిటిషన్‌ దాఖలు చేశారు. బీజేపీ సర్కారు తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టం వల్ల ఎలాంటి ప్రయోజనమూ ఉండబోదని పిటిషన్‌లో పేర్కొన్నారు. భిన్నత్వంలో ఏకత్వం అనే భారత మూల సిద్ధాంతాలకు గొడ్డలిపెట్టుగా పరిణమించిందనీ, ఈ చట్టాన్ని వెనక్కి తీసుకునేలా కేంద్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సమా జాన్ని విభజించడానికే ఈ చట్టాన్ని తీసుకొచ్చినట్టు తమ పార్టీ భావిస్తోందని కమల్‌ హాసన్‌ స్పష్టం చేశారు. అలాగే పౌరసత్వ సవరణ చట్టాన్ని మతిలేని చర్యగా అభివర్ణిం చారు. దేశ ప్రజలందరూ ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తున్నారని, ప్రశాంతంగా ఉండే ఈశాన్య రాష్ట్రాలు సైతం దీనిపై భగ్గుమంటు న్నాయన్నారు. భారత్‌ను ముస్లిం రహిత దేశంగా మార్చడానికి కేంద్ర ప్రభుత్వం కుట్ర పన్నిందనీ, అది ఈ చట్టంతో బహిర్గత మైందని విమర్శించారు. పాక్‌, బంగ్లా, అప్ఘన్‌ల నుంచి శరణార్థులుగా వచ్చిన హిందువులకు మాత్రమే పౌరస త్వాన్ని కల్పించాల్సిన అవసరం ఏమున్నదని ప్రశ్నించారు. లక్షలాదికిపైగా శ్రీలంక నుంచి శరణార్థులుగా భారత్‌కు వచ్చిన తమిళులకు ఎలాంటి న్యాయం చేస్తారని కమల్‌ ప్రశ్నించారు. పౌరసత్వ సవరణ చట్టంలో శ్రీలంక పేరును ఎందుకు చేర్చలేదని నిలదీశారు.

సీబీఐ దర్యాప్తునకు ‘జామియా’ విద్యార్థుల డిమాండ్‌
జేఎంఐ యూనివర్సిటీలో పోలీసుల సృష్టించిన విధ్వంసానికి వ్యతిరేకంగా కొందరు విద్యార్థులు నిరసనకు దిగారు. వర్సిటీ బయట తీవ్ర చలిలో చొక్కాలు విప్పి నిరసన తెలిపారు. మానవహారంగా ఏర్పడి పోలీసు చర్యకు వ్యతిరేకంగా నినాదాలు వినిపించారు. వర్సిటీలో పోలీసులు సృష్టించిన వీరంగంపై సీబీఐ దర్యాప్తునకు డిమాండ్‌ చేస్తూ విద్యార్థులు మార్చ్‌ నిర్వహించారు.

Courtesy Nava telangana