మొన్న ఒక వార్త చదివిన. రోహిత్‌ వేముల తల్లి (హైదరా బాద్‌), పాయల్‌ తడ్వి తల్లి (ముం బాయి) కల్సి సుప్రీంకోర్టులో ఒక పిటిషన్‌ వేసిడ్రు. కేంద్ర ప్రభుత్వం ఉన్నత విద్యా సంస్థల్లో, యూనివర్సిటీల్లో కుల వివక్షల్ని నిలువరించాలని కోరుతూ పిటిషన్‌ దాఖ లు చేసిండ్రు. సుప్రీంకోర్టు స్పందించి కేంద్ర ప్రభుత్వానికి, యూజీసీకి నోటీసు లు జారీ చేసింది. కుల వివక్షల్ని అరికట్ట డానికి ఎలాంటి చర్యలు తీసుకుంటు న్నారో నాలుగు వారాల్లో వివరణ ఇవ్వాలని టైమ్‌తోపాటు ఆదేశాలు జారీ చేయడం మంచి పరిణామంగా ఆశిద్దాం. 2016 జనవరి 17న హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ పరిశోధక విద్యార్థి రోహిత్‌ వేముల ఆత్మహత్య దేశీయంగానే కాదు అంతర్జాతీయాన్ని కూడా కుదిపేసింది. భారతదేశ ఉన్నత విద్యాసంస్థల్లో, యూనివర్సిటీల్లో కుల వివక్షల మీద పెద్ద ఎత్తున ఉద్యమాలు, చర్యలు జరిగాయి. కానీ ప్రభుత్వాల్ని అవేవి కదిలించలేదు. పేనుబారిన చలనాలు కూడా కలగలే. ఈ సంవత్సరం మే 22న టిఎన్‌.టోపివాలా నేషనల్‌ మెడికల్‌ కాలేజీ ముంబాయిలో పీజీ మెడిసిన్‌ చేస్తున్న విద్యార్థిని పాయల్‌తడ్వీ సాటి సీనియర్‌ మహిళలు కుల వివక్షతో చేసే అవమానాలకు కుల టార్చర్‌ని భరించలేక ఆత్మహత్య చేసుకుంది. కానీ ఆమె ఒంటిమీద గాయాలు కూడా బయటపడినా అది ఆత్మహత్య కిందనే నమోదైంది. పాయల్‌ తడ్వి ఒక గిరిజన తెగ కుటుంబంలో మొదటి డాక్టర్‌. కులతత్వంతో కొందరు మహిళల హామీలియేషన్స్‌, రిజర్వేషన్‌ క్యాటగిరీ అనీ ఆమెను అడుగడుగునా అవమానించినా, పేషెంట్స్‌ ముందు, సాటి కొలిగ్స్‌ ముందు హేళనగా మాట్లాడితే ఎన్ని ఫిర్యాదులు చేసినా యాజమాన్యాలకు చెవికెక్కలే. ఆ సీనియర్‌ కులతత్వ మహిళలకు వార్నింగ్‌ గానీ లేదా సీరియల్‌ చర్యలుగానీ తీసుకొని ఉండి ఉంటే డా|| పాయల్‌ తడ్వి బతుకలేని అవమానాల నుంచి తప్పించుకుని ఉండేది.
గూడేలా నుంచి ఉన్నత విద్యకు రావడం ఎస్సీ, ఎస్టీలకు చిన్న విషయం కాదు. స్కూల్‌, కాలేజీ చదువులు దాటుకొని యూనివర్సిటీలకు రావడం ఒక సవాలు. ఒక యుద్ధం. నేను ప్రొఫెసర్‌నవుతా, డాక్టరేట్‌నవుతా, లాయర్‌నైత, ఆఫీసర్‌నైత, కలెక్టర్‌నైతా, సైంటిస్టునైతా అనే కోటి ఆశల్తో యూనివర్సిటీల్లో అడుగుబెడ్తరు. పెట్టినంక మొసమర్రని వివక్షలు. వాళ్ల బట్టలు, వేషభాషలు, వస్తువులు అన్నీ కుల దురంహంకారులకు చిన్నచూపే. హేళనగా చూడ్డం, మాట్లాడ్డం, నవ్వుకోవడం చేస్తుంటరు. రూపురేకల్ని శల్య పరిక్షల స్కానింగులు చేసి జోకులేస్కుంటరు. కదలికలు, మాట, కండ్లు, మూతి విరుపులు ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తుంటరు. కాలేజీలోకి రాంగనే మనిషిని చూసి నేపథ్యాల్ని పట్టేస్తుంటారు. రిజర్వేషన్‌ క్యాటగిరీలనీ, స్కాలర్‌షిప్పులని ఎద్దేవ చేస్తుంటరు. ఇక యూనివర్సిటీ హాస్టల్స్‌లో కులాలు, కులాలుగ సెట్‌ చేస్కుంటరు.
రోహిత్‌ వేముల ఆత్మహత్య అయినా, డా|| పాయల్‌ తడ్వి ఆత్మహత్య అయినా బయటికి ఆత్మహత్యలుగా కనిపిస్తున్నా అవి కుల హత్యలే. ఇవేకాకుండా దేశంలోని యూనివర్సిటీల్లో ఉన్నత విద్యాసంస్థల్లో ఆత్మహత్యలకు పాల్పడుతుంది అణగారిన ఎస్సీ, ఎస్టీ విద్యార్థులే ఉండటం అలజడి, ఆందోలన కలిగించే అంశం. యూనివర్సిటీల్లో సమానత నిబంధనలకు సంబంధించిన సెల్స్‌ ఉన్నాయనే సంగతి ఎవరికి తెలువది. ఎందుకటే అవి పంజేయవు కాబట్టి. వివక్షలకు వ్యతిరేకంగా అంతర్గత ఫిర్యాదుల మెకానిజం పటిష్టంగా ఉండాల్సి ఉంది. అట్లనే ఈక్విటీ సెల్స్‌లో ఎస్సీ, ఎస్టీల నుంచి ఎన్‌జీవో సంస్థల నుంచి, సామాజిక కార్యకర్తల నుంచి ప్రాతినిధ్యముండే నిష్పక్షపాత వైఖరి నుండి రోహిత్‌ వేముల, పాయల్‌ తడ్విలాంటి అనేక మందిని రక్షించేవి.
రాజ్యాంగంలో మా పేర కొన్ని హక్కులు, అవకాశాలున్నాయని తెలువని కులాలు కోకొల్లలు. ఇప్పుడిప్పుడే యూనివర్సిటీల్లోకి ఉన్నత చదువుల బాట పడుతున్న ఎస్సీ, ఎస్టీలను కుల వివక్షలకు, అవమానాలకు గురిచేసి చేతికి మట్టంటకుండా చంపేస్తున్నయి ఈ సంస్థలు. యూనివర్సిటీలన్నీ అగ్రహాలుగానే ఉన్నాయి. ఎస్సీ, ఎస్టీలకు గైడ్‌ దొరకడం కన్నా కష్టము. భాష రాదనీ, జ్ఞానం లేదనీ, చదవరనీ, మధ్యలో వెళ్లిపోతారనీ, గ్యారెంటీ లేదనీ, వ్యర్థమనీ ప్రచారం చేస్తుంటరు. కులతత్వం ప్రదర్శించే కొందరు ప్రొఫెసర్లు, విద్యార్థుల భవిష్యత్‌ని శూన్యం చేసే అసహనాలే రాజ్యమేలుతుంటాయి. ఇవన్నీ కులం కారణంగా వీరిపట్లనే జరుగుతుంటాయి. వీటన్నింటితోపాటు వచ్చే స్కాలర్‌షిప్‌లను నిలిపేసే వేధింపులు అదనం.
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకిచ్చే రాజీవ్‌గాంధీ ఫెలోషిప్‌ని ఎస్సీ పరిశోధక విద్యార్థులకు మాత్రమే మూడు సంవత్సరాల నుంచి కారణం లేకుండా దేశంలోని అన్ని యూనివర్సిటీల్లో నిలిపేశారు. యూనివర్సిటీల్లో అగ్రహార వ్యవస్థలు కొనసాగించటం, సమానత్వ భావనలు సాటి మనుషుల పట్ల లేకపోవడం వల్లనే ఈ వివక్షలు.

– జూపాక సుభద్ర
joopakasubadra@gmail.com