దిల్లీ: దేశ రాజధానిలోని జవహార్‌లాల్‌ నెహ్రూ యూనివర్శిటీలో విద్యార్థులు, అధ్యాపకులపై ఆగంతుకుల దాడిని ఖండిస్తూ దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. దాడిని వ్యతిరేకిస్తూ బెంగళూరు, హైదరాబాద్‌, పుదుచ్చేరి, కోల్‌కతా, అలీఘఢ్‌ యూనివర్శిటీల్లో ఆందోళనలు జరుగుతున్నాయి. తాజాగా ఈ నిరసనలు విదేశాల్లోని విశ్వవిద్యాలయాలకు పాకాయి.

జేఎన్‌యూ విద్యార్థులకు అండగా ఆక్స్‌ఫర్డ్‌, కొలంబియా యూనివర్శిటీల్లో విద్యార్థులు ప్లకార్డులు చేతబట్టి ఆందోళన చేశారు. క్యాంపస్‌లలో విద్యార్థులకు భద్రత కల్పించాలని డిమాండ్‌ చేశారు. ‘ఈ రోజు వాళ్లపై జరిగింది. రేపు మాపై కూడా దాడి జరగొచ్చు. హింస ఏ రూపంలో ఉన్నా దాన్ని ఖండించాల్సిందే. జేఎన్‌యూలోని మా స్నేహితులకు అండగా నిలుస్తాం’ అని పుదుచ్చేరి యూనివర్శిటీ విద్యార్థి ఒకరు ఆవేదన వ్యక్తం చేశారు.

రాజస్థాన్‌ యూనివర్శిటీలో ఘర్షణలు..
ఇదిలా ఉండగా రాజస్థాన్‌ యూనివర్శిటీలో చేపట్టిన ఆందోళనలు ఘర్షణకు దారితీశాయి. జేఎన్‌యూ ఘటనపై ఏబీవీపీ, ఎన్‌ఎస్‌యూఐ క్యాంపస్‌లో నిరసన చేపట్టాయి. ఈ క్రమంలో దాడికి కారణం మీరంటే మీరంటూ ఈ రెండు యూనియన్లు పరస్పరం ఆరోపించుకోవడంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది.

Courtesy Eenadu