– ఎన్‌. వేణుగోపాల్‌

తెలంగాణ ప్రభుత్వం ఉద్యమ ఆకాంక్షలకు అనుగుణంగా గాని, సామాజిక అవసరాల రీత్యాగాని, తన సొంత వాగ్దానాల ప్రకారం గాని ఉద్యోగ కల్పన జరపడం లేదని, కనీసం రెండున్నర, మూడు లక్షల ఉద్యోగాలు నింపవలసి ఉండగా గత ఆరు సంవత్సరాలలో నలబై వేల ఉద్యోగాలు కూడ నింపలేదని నిరుద్యోగులు, పరిశీలకులు అంటుండగానే ప్రభుత్వం సరిగ్గా అందుకు వ్యతిరేక దిశలో నిర్ణయాలు తీసుకోవడం ప్రారంభించింది. ప్రభుత్వ శాఖలను కుదించడానికి, కాంట్రాక్ట్‌, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులను తొలగించడానికి సిద్ధపడిందని, గత కొద్ది కాలంలో కనీసం నలభై వేల మంది కాంట్రాక్ట్‌, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులను ఇంటికి పంపించిందని వార్తలు వస్తున్నాయి. అంటే, ఆరేళ్ల పాలనలో కల్పించిన ఉద్యోగాల సంఖ్య కన్న ఎక్కువ మందిని తొలగించి, తెలంగాణ ప్రభుత్వం చరిత్రలో కనీవినీ ఎరగని ఖ్యాతిని మూటగట్టుకో బోతున్నదన్నమాట. అసలు ఈ కాంట్రాక్ట్‌, ఔట్‌ సోర్సింగ్‌ పద్ధతులకు వ్యతిరేకంగా ఉద్యమ సమయంలో తెలంగాణ రాష్ట్ర సమితి గంభీరమైన ప్రవచనాలు చేసింది. ఈ రెండు అక్రమ పద్ధతుల ద్వారా ఆంధ్ర రాజకీయ నాయకులు, ఉన్నతాధికారులు తెలంగాణకు ఉద్యోగాలలో దక్కవలసిన న్యాయమైన వాటాను కొల్లగొట్టడానికి ప్రయత్నిస్తున్నారని వాదించింది. తాము అధికారంలోకి రాగానే అప్పటికి ఉన్న కాంట్రాక్ట్‌ ఉద్యోగులలో తెలంగాణ వారందరినీ క్రమబద్ధీకరిస్తామని వాగ్దానం చేసింది. ”స్థానికులైన తెలంగాణ కాంట్రాక్టు ఉద్యోగులను రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ (రోస్టర్‌ సిస్టమ్‌) పాటిస్తూ క్రమబద్ధీకరిస్తుంది” అని 2014 తెలంగాణ రాష్ట్ర సమితి ఎన్నికల ప్రణాళికలో వాగ్దానం చేశారు (పే.20). అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా స్వయంగా ముఖ్యమంత్రి, ఇతర మంత్రులు కాంట్రాక్ట్‌, ఔట్‌ సోర్సింగ్‌ పద్ధతినే రద్దు చేస్తామని, కాంట్రాక్ట్‌ ఉద్యోగులను పద్ధతి ప్రకారం క్రమబద్ధీకరిస్తామని ఎన్నోసార్లు ప్రకటించారు.

మొదటి దఫా అధికారంలో ఐదు సంవత్సరాల పాటు కాంట్రాక్ట్‌, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల సమస్య పరిష్కారం దిశగా గణనీయమైన చర్యలేమీ జరగలేదు. ఇక రెండో దఫా, 2018 ఎన్నికల సందర్భంగా తెలంగాణ రాష్ట్ర సమితి పూర్తి స్థాయి ఎన్నికల ప్రణాళికనే విడుదల చేయలేదు. మొదటి దఫా ఎన్నికల ప్రణాళిక 32 పేజీలు కాగా, రెండో దఫా ఎన్నికల ప్రణాళిక పదహారు పేజీలకు కుంచించుకుపోయింది. అందువల్ల రెండో దఫా ఎన్నికల ప్రణాళికలో కాంట్రాక్ట్‌, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల సమస్య ప్రస్తావనకు కూడ రాలేదు.

మొత్తం మీద రెండు పర్యాయాల పాలనలో, మొత్తం ఆరు సంవత్సరాలలో ఎక్కడో ఒకటి రెండు శాఖల్లో చిన్న స్థాయిలో కాంట్రాక్ట్‌ ఉద్యోగుల క్రమబద్ధీకరణ, అది కూడ న్యాయస్థానాల జోక్యంతో జరిగింది గాని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కొనసాగిన కాంట్రాక్ట్‌, ఔట్‌ సోర్సింగ్‌ నియామకాలు అనే అక్రమ పద్ధతి తెలంగాణలో యథావిధిగా కొనసాగుతున్నది. బహుశా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కన్న ఎక్కువగా కూడా సాగుతున్నది. కాంట్రాక్ట్‌, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల జీతభత్యాలు, సౌకర్యాల విషయంలో కార్మికశాఖ, ఇతర ప్రభుత్వ శాఖలు జారీ చేస్తున్న ఉత్తర్వులు, నిబంధనలు ఉన్నాయి గాని వాటి ఉల్లంఘనలే ఎక్కువ జరుగుతున్నాయి తప్ప అవి అమలు కావడం లేదు. అసలు కనీసం ఆ నిబంధనలైనా అమలయ్యేలా చూసే యంత్రాంగమే లేదు. ప్రభుత్వ శాఖల్లోనే, ప్రభుత్వ రంగ సంస్థల్లోనే కాంట్రాక్ట్‌, ఔట్‌ సోర్సింగ్‌ యథేచ్ఛగా జరుగు తున్నప్పుడు, ఏ ప్రభుత్వశాఖ ఆ అక్రమాన్ని అడ్డుకోగలుగు తుంది? అలా మొత్తంగా ఇప్పటికీ డెబ్బై వేలకు పైగా కాంట్రాక్టు ఉద్యోగులు, రెండు లక్షలకు పైగా ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు ఉన్నారని ఒక అంచనా.

కాంట్రాక్టు ఉద్యోగులంటే ఒక నిర్ణీత పనికి, నిర్ణీత కాలానికి, నిర్ణీత వేతనంతో మాత్రమే కుదిరిన ఒప్పందం మీద పని చేసేవారు. ఒక్కోసారి స్వల్పకాలిక, మధ్యంతర పనులకు ఇటువంటి ఉద్యోగులను నియమించుకోవడం అవసరం కూడ కావచ్చు. కాని శాశ్వత సంస్థలలో, దీర్ఘకాలం ఉండే పనులలో, అదే ఉద్యోగి దశాబ్దాల తరబడి పని చేయవలసి ఉండే ఉద్యోగాలలో కాంట్రాక్టు పద్ధతి ప్రవేశపెట్టడం అక్రమం, అనుచితం, సహజ న్యాయసూత్రాలకు వ్యతిరేకం. ఆ పని ప్రభుత్వమే స్వయంగా చేయడం ఇంకా దుర్మార్గం.

ఎందువల్లనంటే, ఇటువంటి కాంట్రాక్టు ఉద్యోగులు చేసే పనులు వారి పక్కనే రెగ్యులర్‌ ఉద్యోగులు కూడ చేస్తుంటారు. అక్కడ రెగ్యులర్‌ ఉద్యోగికి హెచ్చు జీతభత్యాలు, ఆ జీతభత్యాలలో క్రమబద్ధంగా పెరుగుదల, వార్షిక ఇంక్రిమెంట్లు, సెలవులు, ప్రావిడెంట్‌ ఫండ్‌, ఎంప్లాయీస్‌ స్టేట్‌ ఇన్సూరెన్స్‌ వంటి ఆరోగ్య సౌకర్యాలు ఉండగా కాంట్రాక్టు ఉద్యోగికి మాత్రం ముందే నిర్ణయమైన వేతనం తప్ప మరే సౌకర్యమూ ఉండదు. రెగ్యులర్‌ ఉద్యోగికి ఉండే ఉద్యోగ భద్రత కాంట్రాక్టు ఉద్యోగికి ఉండదు. ఒప్పందంలో నిర్ణీతమైన కాలం కన్న ముందే కూడ అధికారుల ఇష్టాయిష్టాల ప్రకారం ఆ ఒప్పందం రద్దు చేసి, ఆ ఉద్యోగిని ఇంటికి పంపే అవకాశం ఉంటుంది గనుక ఆ ఉద్యోగి నిరంతరం అధికారుల దయాదాక్షిణ్యాల మీద ఆధారపడి, ఎప్పుడు ఉద్యోగం ఊడిపోతుందో అనే భయంలో బతకవలసి ఉంటుంది. కాంట్రాక్టు ఉద్యోగుల ఈ బలహీనమైన స్థితి వల్ల వారి మీద పని భారం కూడ పెరుగుతుంది, ఉద్యోగేతర ఒత్తిళ్లు కూడా ఉంటాయి. రాజ్యాంగబద్ధమైన ‘సమానపనికి సమానవేతనం’ అనే మౌలిక సూత్రం వారి విషయంలో అడుగడుగునా ఉల్లంఘించబడుతుంది. నిజానికి వారు స్థిరమైన ఉద్యోగుల కన్న ఎక్కువ పని కూడా చేయవలసి వస్తుంది గనుక వారిది సమాన పని అని కూడా అనడానికి వీలు లేదు. ‘ఎక్కువ పనికి తక్కువ వేతనం’ అనే స్థితి కూడా ఉంటుంది.

ఇలా కాంట్రాక్టు ఉద్యోగులను, కార్మికులను నియమించుకునే ప్రయివేటు వ్యాపార, పారిశ్రామిక వేత్తల అక్రమాలను నియంత్రించడానికి ఎన్నో చట్టాలుండగా, ఆ చట్టాలను అమలు చేసే అధికారం ఉన్న ప్రభుత్వమే కాంట్రాక్టు ఉద్యోగులను, కార్మికులను నియమించడం కంచే చేను మేసిన సామెత కన్నా దుర్మార్గమైనది. కాని దేశంలో అన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలూ ఆ పని చేస్తూనే ఉన్నాయి. ఎన్నో రాష్ట్రాల హైకోర్టులు, సుప్రీం కోర్టు ఎన్నోసార్లు ఈ విధానంపై మొట్టికాయలు వేసినప్పటికీ ఈ అక్రమం ఆగలేదు. పీపుల్స్‌ యూనియన్‌ ఫర్‌ డెమొక్రటిక్‌ రైట్స్‌ వర్సస్‌ యూనియన్‌ ఆఫ్‌ ఇండియా కేసులో 1982లో జస్టిస్‌ పి ఎన్‌ భగవతి, జస్టిస్‌ బహారుల్‌ ఇస్లాం ఇటువంటి కార్మికుల విషయంలో ప్రభుత్వం పాటించవలసిన మార్గదర్శక సూత్రాలను రూపొందించారు. కాని వాటిని ఏ ప్రభుత్వమూ చిత్తశుద్ధితో అమలు చేయలేదు. కొన్నిసార్లు న్యాయస్థానాలు కూడా రాజ్యాంగాన్ని, సహజ న్యాయసూత్రాలను, అంతకు ముందరి న్యాయస్థానాల తీర్పులను పక్కన పెట్టి ఏదో ఒక కారణం మీద కాంట్రాక్టు ఉద్యోగుల పద్ధతిని సమర్థించిన సందర్భాలు కూడ ఉన్నాయి.

ఈ కాంట్రాక్టు ఉద్యోగుల పద్ధతే అక్రమమైనదంటే, అంతకంటె ఘోరమైనది ఔట్‌ సోర్సింగ్‌ నియామకాల పద్ధతి. ఇక్కడ ఉద్యోగం ఇచ్చే సంస్థ నేరుగా ఉద్యోగితో ఒప్పందం చేసుకోదు. ఉద్యోగాలు ఇచ్చే సంస్థ, ప్రస్తుత సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం, ఔట్‌ సోర్సింగ్‌ ఏజెన్సీ, ఔట్‌ సోర్సింగ్‌ కంపెనీ అనబడే కాంట్రాక్టర్‌తో ఒప్పందం కుదుర్చుకుంటుంది. ఆ కాంట్రాక్టర్‌ ప్రభుత్వం అడిగినంత మంది కూలీలను ఒక ముఠా మేస్త్రీ లాగ అప్పజెపుతాడు. తమను అలా అమ్మడానికి ఆ కాంట్రాక్టర్‌ ఒక్కొక్కరి పేరు మీద ఎంత వసూలు చేస్తున్నాడో వారికి తెలియదు. వారందరూ ఆ కాంట్రాక్టర్‌ దగ్గర, ఆ కాంట్రాక్టర్‌ ఇచ్చే జీతానికి పని చేయవలసిన కూలీలు మాత్రమే. వారికి తమతో పాటు పనిచేసే రెగ్యులర్‌ ఉద్యోగులకు ఉండే ఏ సౌకర్యాలూ ఉండవు. తమంతట తామే యజమానితో ఒప్పందం కుదుర్చుకుంటే బేరమాడగలిగినంత వేతనం కూడా ఉండదు. చుట్టూ ఉన్న నిరుద్యోగ సముద్రంలో బతుకీడ్వడానికి ఈ మాత్రం తెప్ప అయినా దొరికింది గదా అని ఆ ఉద్యోగులు తమ కాంట్రాక్టర్‌ పట్ల విధేయతతో ఉంటారు. ఆ కాంట్రాక్టర్లు ఈ ఉద్యోగుల పేరు మీద ప్రభుత్వం నుంచి వసూలు చేసే జీతంలో పదిశాతం నుంచి ఇరవై శాతం దాకా తమ కంట్రాక్టర్‌ కమిషన్‌గా వసూలు చేస్తున్నారు. ఈ ఔట్‌ సోర్సింగ్‌ కంట్రాక్ట్‌ కంపెనీల యజమానుల్లో అత్యధికులు రాజకీయ నాయకులు, సంపన్నులు, ప్రభుత్వంలో పలుకుబడి ఉన్న వ్యక్తులు.

ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ రంగంలో ”బాడీ షాపింగ్‌” పేరుతో ఉనికిలోకి వచ్చిన ఈ నియామక ప్రక్రియ నీచమైనది. (హైదరాబాద్‌ ఐటీ పెరుగుదలలో అత్యధిక భాగం ఈ అనైతిక ప్రక్రియ వల్లనే సాధ్యమైంది!). మనుషులను, మనుషుల శ్రమను, సామర్థ్యాన్ని అమ్మకపు సరుకులుగా కొందరు తమ గుప్పెట్లో పెట్టుకుని, తమ పలుకుబడితో, పెట్టుబడితో, లంచాలతో అవకాశాలు సంపాదించి తమ గుప్పెట్లో ఉన్నవారి శ్రమను అమ్మడమే ఈ బాడీ షాపింగ్‌ – శరీరాల అమ్మకం. ఒక రకంగా చెప్పాలంటే అమాయక, నిస్సహాయ యువతుల శరీరాలతో, మాంసంతో వ్యాపారం సాగించి, అందులో కమిషన్‌ సంపాదించే వేశ్యాగహాల యజమానుల కన్న ఇది భిన్నమైనది కాదు. ఈ ఔట్‌ సోర్సింగ్‌ పద్ధతిలో ఉన్న అనైతికత మాత్రమే కాదు, ఔట్‌సోర్సింగ్‌ కంట్రాక్టర్ల ఆశ్రిత పక్షపాతం, మితిమీరిన లాభాపేక్ష, అక్రమాలు లెక్కలేనన్ని ఉన్నాయి. చేయవలసిన పనికి అవసరమైన అర్హతలు ఉన్నా లేకపోయినా ఇష్టారాజ్యంగా నియామకాలు జరపడం, ఎంత మంది ఉద్యోగులను నియమిస్తున్నారో, అంతకంటె ఎంత ఎక్కువమంది పేర్ల మీద వేతనాలు వసూలు చేస్తున్నారో, ఒక్కొక్కరి వేతనాల్లో ఎంత కోత విధిస్తున్నారో వివరాల్లోకి వెళితే బీరువాల్లో దాచిన కంకాళాలెన్నో బైటపడతాయి. నిజానికి ఈ పద్ధతి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అక్రమాల నిలయంగా మారి, ఔట్‌సోర్సింగ్‌ పద్ధతి వల్లనే, ఔట్‌సోర్సింగ్‌ కాంట్రాక్టర్లు ఆంధ్ర ప్రాంతపు పెట్టుబడిదారులు కావడం వల్లనే అప్పటి ప్రభుత్వోద్యోగాలలో తెలంగాణ భూమి పుత్రులకు దక్కవలసిన న్యాయమైన వాటా దక్కలేదని ఉద్యమ కాలంలో ఆరోపణలు కూడ వచ్చాయి. రెగ్యులర్‌ ఉద్యోగాల నియామకాలకు వర్తించే చట్టబద్ధ సూత్రాలేవీ కాంట్రాక్టు, ఔట్‌ సోర్సింగ్‌ నియామకాలకు వర్తించవు. అయినా ఈ రెండు రకాల ఉద్యోగులకు వర్తించే ఉద్యోగ, కార్మిక, నియామక, పనిపరిస్థితుల, జీతభత్యాల విషయంలో ఉన్న డజన్లకొద్దీ చట్టాలను, ఉత్తర్వులను, నిబంధనలను పాటించే వారే లేరు. ఆ చట్టాలను, ఉత్తర్వులను, నిబంధనలను తయారుచేసిన ప్రభుత్వమే వాటిని ఉల్లంఘిస్తున్నది.

ఆర్టీసీ కార్మికుల సమ్మె సందర్భంగా, వారిని బెదిరిస్తూ, వారి పట్ల కఠిన వైఖరిని ప్రకటించిన ప్రభుత్వమే హఠాత్తుగా 2019 నవంబర్‌లో కాంట్రాక్ట్‌, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులను బుజ్జగిస్తూ వేతనాల పెంపుదలను ప్రకటించింది. అలా పైకి చూడడానికి పెరిగిన వేతనాలు వారిలో ఎందరికి వాస్తవంగా అందాయో తెలియదు గాని ఏడాది తిరగకుండానే వారిని అసలు ఉద్యోగాల నుంచే ఊడబీకే ప్రక్రియ ప్రారంభమైంది. రెండు లక్షల డెబ్బై వేల మంది కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులలో ఇప్పటికే నలబైవేల మంది ఉద్యోగాలు పోయాయి. రాష్ట్రంలో భయంకరమైన స్థాయిలో నిరుద్యోగం ఉండగా, ప్రభుత్వ శాఖల్లో, ప్రభుత్వ రంగ సంస్థల్లో, పదవీ విరమణల వల్ల, కొత్త జిల్లాల ఏర్పాటు వల్ల ఎన్నో ఉద్యోగ ఖాళీలుండగా, వెంటనే ఉద్యోగకల్పన చర్యలు ప్రారంభించవలసి ఉండగా, మహా ఘనత వహించిన తెలంగాణ ప్రభుత్వం ఉన్న ఉద్యోగాలే తొలగిస్తున్నది. ఆహా, ఏమి బంగారు తెలంగాణ!!

Courtesy Nava Telangana