– తప్పుదోవ పట్టిస్తున్న గణాంకాలు
– శ్రామిక శక్తి నుంచి ఎక్కువ మంది పక్కకు..
– సీఎంఐఈ చీఫ్‌ ఎగ్జిక్యుటీవ్‌ మహేశ్‌ వ్యాస్‌
– ఈనెలలో మొత్తం నిరుద్యోగ రేటు 6.67శాతం.. గత నెలలో 8.35శాతం

దేశంలో విధించిన అనాలోచిత లాక్‌డౌన్‌ యువతను ఇప్పటికే నిరుద్యోగ కూపంలలోకి నెట్టింది. ముఖ్యంగా ఏప్రిల్‌, మే నెలల్లో నిరుద్యోగ రేటు వరుసగా 23.52శాతం, 21.73 శాతంగా ఉన్నాయి. అదే కాలంలో పట్టణ నిరుద్యోగ రేటు ఏప్రిల్‌లో 25శాతం, మేలో 23.14శాతం గా నమోదైంది. అయితే, దేశంలో ఉపాధి పునరుద్ధరణకు కనీసం ఒక ఏడాది పడుతుందని ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు. కాగా, ఇంజినీర్లు, వైద్యులు, ఉపాధ్యాయులు, అకౌంటెంట్లు, విశ్లేషకులతో సహా ఆరు మిలియన్ల వైట్‌ కాలర్‌ కార్మికులు.. మే- ఆగస్టు నెలల్లో ఉద్యోగాలు కోల్పోయారని సీఎంఐఈ గతనెలలో తెలిపిన విషయం విదితమే.

న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా సెప్టెంబర్‌ నెలలో నిరుద్యోగం పడిపోయినట్టు చూపిస్తున్న గణాంకాలు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని పలువురు నిపుణులు ఆరోపిస్తున్నారు. నిరుద్యోగం అనేది గణాంకాల్లో మాత్రమే పడిపోయిందనీ, క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులు అందుకు విరుద్ధంగా ఉన్నాయని అంటున్నారు. మోడీ సర్కారు విధించిన లాక్‌డౌన్‌ ప్రతివర్గం, రంగానికి చెందిన ఉద్యోగులు, కార్మికులను నిరుద్యోగులుగా మార్చిందని తెలిపారు. సెప్టెంబర్‌లో దేశవ్యాప్తంగా నిరుద్యోగ రేటు పడిపోయిందని సెంటర్‌ ఫర్‌ మానిటరింగ్‌ ఇండియన్‌ ఎకానమీ (సీఎంఐఈ) సమాచారం. అయితే దేశవ్యాప్తంగా ఎక్కువ మంది కార్మికులు ఉపాధిరంగం నుంచి తప్పుకోవడమే గణాంకాలల్లో నిరుద్యోగం పడిపోయినట్టుగా కనిపిస్తున్నదని వివరించింది.

తాజా సమాచారం ప్రకారం.. సెప్టెంబర్‌ లో మొత్తం నిరుద్యోగ రేటు 6.67శాతం కాగా, పట్టణ నిరుద్యోగ రేటు 8.45శాతంగా ఉన్నాయి. అయితే ఈ లెక్కలు ఆగస్టులో వరుసగా 8.35శాతం, 9.83శాతంగా ఉన్నాయి. అయితే, ఈ కార్మికులు ఉపాధి రంగం నుంచి తప్పుకోవడం వల్ల నిరుద్యోగం పడిపోయినట్టు కనిపిస్తున్నదనీ, ఈ సమాచారం ఎంత మాత్రమూ సంతోషించదగ్గ పరిణామం కాదని సీఎంఐఈ చీఫ్‌ ఎగ్జిక్యుటీవ్‌ మహేశ్‌ వ్యాస్‌.. అధికారిక వెబ్‌సైట్‌లలో తెలిపారు. ‘ఆగస్టులో లాక్‌డౌన్‌ పతనం నుంచి రికవరీ ప్రక్రియలలో స్తబ్దత కనిపించింది’ అని వ్యాస్‌ అన్నారు.

సెప్టెంబర్‌ 20తో ముగిసిన వారంలో.. జాతీయ నిరుద్యోగ రేటు 6.35శాతం, పట్టణ నిరుద్యోగ రేటు 8.83శాతం. అయితే పూర్తి నెల డేటా ఈ స్థాయి నుంచి మొత్తం నిరుద్యోగ రేటు క్షీణతను చూపుతుంది. సెప్టెంబర్‌ 20 నాటికి 30 రోజుల కదిలే సగటు శ్రమశక్తి పాల్గొనే రేటు (ఎల్పీఆర్‌) 40.3శాతంగా ఉన్నది. అయితే ఇది ఆగస్టు నెల 40.96శాతంతో పోల్చుకుంటే పేలవంగా ఉన్నదని వ్యాస్‌ వివరించారు. పడిపోతున్న కార్మిక భాగస్వామ్య రేటును గమనిస్తే పని వయస్సులో ఉన్న వారిలో చాలా తక్కువ మంఇ ఉద్యోగులు ఉన్నారని మిగిలిన వారు నిరుద్యోగ సైన్యంలా ఉండటంతో ఉపాధి ఇవ్వండని కోరుతున్నారని చూపిస్తుంది. తగ్గిపోతున్న శ్రమశక్తి క్షీణిస్తున్న మార్కెట్‌కు సంకేతమని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Courtesy Nava Telangana