– ఆకలి సూచీ నివేదికలో నొక్కి చెప్పిన ఐరాస 
– భారత్‌లో 45 ఏండ్ల గరిష్ట స్థాయికి పడిపోయిన నిరుద్యోగిత రేటు 
– వేలెత్తి చూపుతున్న జార్ఖండ్‌ ఆకలిచావులు 
ప్రపంచవ్యాప్తంగా ఆహార అభద్రత నానాటికీ పెరిగిపోతుం డటం ఆందోళనకరంగా మారింది. ఐక్యరాజ్యసమితి ఇటీవల విడుదల చేసిన ‘ప్రపంచంలో ఆహార భద్రత, పోషకాహార పరిస్థితి నివేదిక-2019’ ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నది. దీని ప్రకారం ప్రపంచంలో ఆకలితో అలమటిస్తున్నవారు 82 కోట్ల మంది (దాదాపు 11 శాతం) ఉన్నారు. అయితే భారత్‌లో కూడా ఆకలి చావులు నమోదవు తున్న నేపథ్యంలో.. దేశంలో ఏటేటా పెరగుతున్న నిరుద్యోగ సమస్యే దీనికి ప్రధాన కారణమని ఐరాస నొక్కి చెప్పడం గమనార్హం. ‘2017-18 నుంచి భారత్‌లో పెరుగుతున్న నిరుద్యోగం, దేశ ఆర్థిక పరిస్థితి అంతకంతకూ దిగజారుతుండటం ఆకలి బాధలకు కారణమవుతున్నది’ అని యూఎన్‌ పేర్కొన్నది.
న్యూఢిల్లీ : భారత్‌లో నిరుద్యోగ సమస్య ఇప్పటిది కాకపోయినా గడిచిన మూడేం డ్లుగా అది మునుపెన్నడూ లేనంతగా పెరిగిపోతున్నది. తాము అధికారం లోకి వస్తే ఏటా రెండు కోట్ల ఉద్యోగాలిస్తామని గద్దె నెక్కినమోడీ సర్కారు. తద నంతర కాలంలో ఆహామీని తుంగలో తొక్కింది. ఉపాధి దొరక్క, తిండి లభిం చక కోట్లాది మంది పస్తులుంటున్నారు. ఈఏడాది జనవరిలో నేష నల్‌ శాంపిల్‌ సర్వే ఆఫ్‌ ఆర్గనై జేషన్‌ (ఎన్‌ఎస్‌ఎస్‌వో) గణాంకాల ప్రకారం.. దేశంలో నిరుద్యోగిత రేటు 45ఏండ్ల గరిష్టానికి (6.1శాతం) చేరుకున్నది. 2017-18కి సం బంధించిన ఆ నివేదికను తొలుత దాచిపెట్టిన మోడీ సర్కారు.. ఎన్నికలు ముగిసిన తర్వాత విడుదల చేయడం గమ నార్హం. 2016 నవంబర్‌లో ప్రధాని మోడీ ప్రకటించిన పెద్దనోట్ల రద్దు తర్వాత దేశంలో వేలాదిమంది నిరుద్యో గులుగా మారారని జాతీయ, అంతర్జాతీయ ఆర్థిక నిపుణులు గొంతెత్తి మొత్తుకున్నా మోడీ సర్కారు దానిని పెడచెవిన పెడు తున్నది. మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్టు అసలే ఉద్యోగాలు కోల్పో యి ఇబ్బందులెదుర్కొంటున్న ప్రజలపై బీజేపీ సర్కారు జీఎస్టీ పేరిట మరో మోయలేని భారం మోపింది. ‘ఒకే దేశం-ఒకే పన్ను’ అంటూ తీసుకొచ్చిన జీఎస్టీ.. చిన్న, సూక్ష్మ తరహా పరిశ్రమలను కోలుకోలేని దెబ్బ తీసిందని ఆర్థికవేత్తలు అభిప్రాయపడుతున్నారు. దీంతో ఆయా రంగాల్లో పనిచేస్తున్న లక్షలాది మంది కార్మికులు ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డారు. పెద్దనోట్ల రద్దు, జీఎస్టీ వంటి ఆర్థికపరమైన నిర్ణయాలే గాక దేశంలో వ్యవసాయం మీద మోడీ సర్కారు చూపుతున్న అశ్రద్ద కూడా గ్రామీణ పేదల ఆకలికి కారణమవుతున్నదనేది విశ్లేషకుల వాదన. ఒవైపు వర్షాలు కురవక, వరుస కరువుతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే మరోవైపు రైతాంగంపై అప్పుల భారం వారిని ఆత్మహత్యలకు ఉసిగొల్పుతున్నది. గిట్టుబాటు ధరల్లేక ఆర్థికంగా చితికిపోయిన రైతులు ఆపన్నహస్తం కోసం ఎదురుచూస్తుంటే మోడీ సర్కారు మాత్రం వ్యవసాయాన్ని కార్పొరేట్‌లకు అప్పగించి రైతు ఆదాయాన్ని పెంచుతామని చెబుతుండటం విడ్డూరం.
వేలెత్తి చూపిస్తున్న ఆకలిచావులు
ప్రపంచ ఆరోగ్య సూచీ నివేదిక ప్రకారం భారత్‌లో 2016-18 నాటికి 19.44 కోట్ల (దేశ జనాభాలో సుమారు 14.5 శాతం) మంది ఆకలితో అలమటిస్తున్నారు. గతంతో పోల్చుకుంటే 2015 వరకు ఆకలి సమస్య కొంతమేర తగ్గినా ఆ ఏడాది నుంచి మళ్లీ అవే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇక ఆహార అభద్రత కారణంగా జార్ఖండ్‌లో నమోదవుతున్న ఆకలి చావులు విశ్వ యవనికపై భారత్‌ను వేలెత్తి చూపుతున్నాయి. అనధికారిక లెక్కల ప్రకారం.. గడిచిన రెండేండ్లలో జార్ఖండ్‌లో సుమారు 20 మంది ఆకలి బాధలు తట్టుకోలేక మరణించారు. రాష్ట్రంలోని బీజేపీ సర్కారు పేదలకు రేషన్‌కార్డులివ్వకపోవడం దీనికి ఒక సమస్యైతే, రేషన్‌ కార్డులకు ఆధార్‌ను అనుసంధానం చేయడం కూడా ఈ చావులకు కారణమైందని హక్కుల కార్యకర్తలు ఆరోపిస్తున్నారు.
ఆకలితో అలమటించేవారే గాక పోషకాహార లోపం కూడా దేశంలో ప్రధాన సమస్యగా ఉన్నది. అధికారిక లెక్కల ప్రకారం.. దేశంలో పదిశాతం పిల్లలు మాత్రమే సమతుల్య ఆహారాన్ని తీసుకుంటున్నారు. ఆర్నెళ్లలోపు ఉన్న చిన్నారుల్లో 54 శాతం మంది మాత్రమే తల్లిపాలు తాగుతున్నారు. దీనిని 2025 నాటికి 25 శాతానికి తగ్గించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నా ప్రస్తుత పరిస్థితుల్లో అది సాధ్యమయ్యే పని కాదని న్యూట్రీషన్‌ నిపుణుడు డాక్టర్‌ అంతర్యామి దాస్‌ తెలిపారు.