రవీష్ కుమార్.

పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా తమ హక్కుల సాధన కోసం మార్చ్ లో పాల్గొన్నారు.

ఈ సీన్ నా మదిలో మెదిలిన ప్రతిసారీ మన చరిత్రంతా మళ్లీ కళ్లముందే కదలాడుతుంది,కాస్త మసకగా మారిన వెంటనే చరిత్ర మళ్లీ పునరావృతం కాబోతోందనే స్పష్టమౌతుంది. చరిత్ర అంటే వాట్సప్ యూనివర్సిటీలలో నేర్పబడేది కాదు,అసలైన చరిత్ర అని నా ఉద్దేశ్యం. నిరసనల్లో పాల్గొన్న విద్యార్థులని ఎగతాళి చేసేందుకు నేనిది చెప్పడం లేదు కానీ భారత ప్రభుత్వం ఈవేళ తన అసలైన రూపాన్ని బయటపెట్టుకుంటోందనే చెప్పొచ్చు.

ఢిల్లీ పోలీసులు ఇంతకుముందు ఇలాంటి నిరసనలు చాలానే ఎదుర్కొన్నారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ అత్యాచారం కేసులో కూడా ప్రజలంతా రోడ్లపైకి వచ్చి తమ నిరసనలు తెలియజేశారు ఎందుకంటే పోలీసుల నుంచి తమకి ఎలాంటి ప్రతిఘటనా ఎదురవ్వదనే భరోసా ఉంది కాబట్టి. కానీ ఆ నమ్మకం మొన్నటి జామియా నిరసనల పట్ల వారు ప్రవర్తించిన తీరుతో తుడిచిపెట్టుకుపోయింది.

జామియా యూనివర్సిటీలోకి ప్రవేశించిన పోలీసులు విద్యార్థులతో బయటకి వచ్చారు. ఇందులో మీకు తప్పుగా ఏం అనిపించట్లేదంటే ఇంకాస్త సులభంగా చెప్తాను. మనందరి భావప్రకటనా స్వేచ్ఛ కూడా అణచివేయబడింది. పోలీసులు మన వాళ్లు కాదు,రాజ్యం చేతిలో పావులుగా మారారనేది సుస్పష్టం.

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈమధ్యే బెంగాల్ అల్లర్ల గురించి మాట్లాడుతూ నిరసనకారులని వారు ధరించే దుస్తుల ఆధారంగా గుర్తించాలని అన్నారు. ఇది రాజ్యం మాట్లాడే భాష,ఇదే మనకిప్పుడు సామాజిక మాధ్యమాల్లో అంతటా కనిపిస్తోంది. రాజ్యసభ ఎంపీ రాకేశ్ సిన్హా జామియా నిరసనలను స్వాతంత్ర్యానికి ముందు ముస్లిం లీగ్ చేపట్టిన డైరెక్ట్ యాక్షన్ నిరసనలతో పోల్చడం కూడా ఇదే కోవలోకి వస్తుంది.

1946 లో ముస్లిం లీగ్ డైరెక్ట్ యాక్షన్ పిలుపునందుకుని జరిగిన అల్లర్లలో వేలాదిమంది హిందువులు చంపబడ్డారు. గాంధీ కోల్ కతా వెళ్లి ఆ హింసాయుత నిరసనలు ఆగేలా చేసారు,అప్పుడాయన నిరసనకారులు,అల్లర్లు సృష్టించేవారిని దుస్తుల ఆధారంగా గుర్తించలేదు. తర్వాత ఆయనే హిందువులచేత చంపబడుతున్న ముస్లింలు ఉన్న బీహార్ కీ వెళ్లారు. స్వతహాగా ఏ వస్త్రాలూ ధరించని వ్యక్తి కాబట్టే గాంధీ ఇతరుల వస్త్రధారణ కాకుండా ఆలోచనలకీ,వ్యక్తిత్వాలకీ ప్రాధాన్యతనిచ్చారు.

వాట్సప్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ లా ప్రవర్తించే రాకేశ్ సిన్హా తన ట్వీట్లో ఇది 1946 కాదని,2019 అని వ్యాఖ్యానించారు. అక్కడితో ఆగకుండా దాదాపు 50 శాతం ముస్లిమేతర విద్యార్థులు చదువుతున్న యూనివర్సిటీని ముస్లిం లీగ్ తో పోల్చడం కేవలం వస్త్రధారణ, ఒంటి రంగు ఆధారితంగా గుర్తించే ప్రయత్నాల్ని సమర్థించడం కాదా?.

మన దేశ యువతని సరిగ్గా అర్థం చేసుకోవడంలో మనం విఫలమౌతున్నాం. ఎప్పుడూ స్మార్ట్ ఫోన్లతో సావాసం చేస్తూ రాజకీయ చైతన్యం లోపించిన వాళ్లని తిట్టుకుంటుంటాం కానీ గుజరాత్ లోని ఓ సెక్రటేరియట్ ఎగ్జామ్ లో జరిగిన మోసాల గురించి అదే యువత స్మార్ట్ ఫోన్ స్క్రీనలనే టార్చిలుగా వాడుతూ ఓ వినూత్న నిరసన చేపట్టి చివరికి ప్రభుత్వం కూడా దిగొచ్చి ఆ పరీక్ష రద్దు చేసే పరిస్థితులు తీసుకొచ్చింది‌

ఉత్తరప్రదేశ్ లో సుమారు 69,000 టీచర్ల పోస్టులు భర్తీ చేయాలనే హాష్ ట్యాగ్ ట్విట్టర్లో ట్రెండ్ ఔతోంది. ఎన్నికల సమయంలో ప్రకటించిన రైల్వే రిక్రూట్మెంట్ క్లియర్ చేసినవారెవరికీ ఇప్పటికీ నియామక పత్రాలు అందలేదు. మండి హౌజ్ దగ్గర వారంతా చేపట్టిన నిరసనలూ మనం చూసాం. డెహ్రాడూన్ లోని ఆయుర్వేద కళాశాల విద్యార్థులు ఫీజుల పెంపు గురించి 45 రోజులు నిరసనలు చేసారు. జే ఎన్ యూ లో కూడా ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకి కష్టంగా మారిన హాస్టల్ ఫీజుల పెంపు గురించీ నిరసనలు జరిగాయి.

విద్యార్థులు నిరసనలు చేపట్టిన ప్రతిసారీ వాళ్లు చదవడం చాతకాక అలా చేస్తున్నారనీ,అర్బన్ నక్సల్స్ అనీ ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారు. టీచర్లే లేనప్పుడు,ఫీజులు అందుబాటులో లేనప్పుడు ఇంక వాళ్లెలా చదువుకుంటారు?.

ఈ వాదనలు చేసేవాళ్లంతా పేద, మధ్యతరగతి విద్యార్థులని ద్వేషించే మనస్తత్వం గలవారు. టాక్స్ మనీ వీళ్లకెందుకు వాడాలీ అని ప్రశ్నించే వీళ్లకి నిజానికి ద్వేషం తప్ప విద్యపై ఎలాంటి కన్సర్న్ ఉండదు.

నేను గత రెండు సంవత్సరాలుగా చాలా యూనివర్సిటీల విద్యార్థులతో టచ్లో ఉన్నాను. మన దేశంలో ప్రతిపక్షాలెప్పుడో బలహీనంగా మారిపోయాయి. కమ్యూనలిజం వల్ల ఈ దేశానికి ఒరిగేదేమీ లేదని కూడా ఈ విద్యార్థులు గుర్తించారు. అందుకే ఫీజుల పెంపు,పౌరసత్వ చట్టం లాంటి అంశాలపై తమ గొంతుని వినిపిస్తూ నిరసనలు చేపడుతున్నారు. ఈవిధంగా వారిలోనైనా ప్రజాస్వామ్య స్ఫూర్తి మిగిలి ఉన్నందుకు గర్విద్దాం.

ఈ విద్యార్థులెవరూ 1947 విభజన సమయంలో లేకపోయినా ఇప్పటి ఇండియాని అర్థం చేసుకున్నారు. వాళ్లని అర్థం చేసుకోకపోతే అది మన తప్పే ఔతుంది. యువ భారతాన్ని అర్థం చేసుకోవాలంటే మనమంతా ఓ ఐషా,లదీదా,చందా యాదవ్ తమ,తమ హక్కుల కోసం పోరాడటానికి ఎంచుకుంటోన్న నిరసనలు చూడాలి,చూసి ప్రజాస్వామ్య స్ఫూర్తిని మనమంతా కూడా నేర్చుకోవాలి.  అప్పుడు మాత్రమే మనం దేశం బాగుపడుతుంది. గుడ్ లక్ ఇండియా