న్యూఢిల్లీ : పార్లమెంటుకు ప్రధాని ఇక రోడ్డు మార్గంలో వెళ్లరు. హెలికాప్టర్‌లోనూ ప్రయాణించరు. పార్లమెంటుకు, పీఎంవోకు ప్రధాని వెళ్లేందుకు ఢిల్లీలో ప్రత్యేక సొరంగ మార్గాన్ని నిర్మించనున్నారు. ప్రధాని, పార్లమెంటు, రాజ్యాంగ సంస్థలు, ప్రభుత్వ భవనాలను ఒకే సముదాయంలో నిర్మించేందుకు ‘సెంట్రల్‌ విస్టా’ సరికొత్త ప్లాన్‌ రూపొందిస్తోంది. ఇందులో భాగంగానే పీఎంవోకు, పార్లమెంటుకు ప్రధాని, ఇతర వీవీఐపీలు వెళ్లేందుకు సొరంగ మార్గాన్ని ‘సెంట్రల్‌ విస్టా’ ప్రాజెక్టు రూపకర్త బిమల్‌ పటేల్‌ బుధవారం నాటి సమావేశంలో ప్రతిపాదించారు.

ప్రధాని కాన్వాయ్‌, ఇతర వీవీఐపీలు వెళ్లే సమయంలో ట్రాఫిక్‌ను మళ్లించడమో, నిలిపివేయడమో జరుగుతోంది. అత్యంత భద్రత కల్పించాల్సిన ప్రధాని వంటి ముఖ్యులను సాధారణ ట్రాఫిక్‌ నుంచి వేరు చేయాలని భావిస్తున్నట్లు పటేల్‌ చెప్పారు. సొరంగ మార్గం ద్వారా ప్రయాణిస్తే వీవీఐపీలకు భద్రత కల్పించడం కూడా సులువవుతుందన్నారు. ప్రస్తుత రక్షణ సిబ్బంది కార్యాలయాలను తొలగించి స్పెషల్‌ ప్రొటెక్షన్‌ గ్రూప్‌(ఎస్పీజీ) కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తామని తెలిపారు.

Courtesy Andhrajyothi