• భూపాలపల్లి యువతిఘనత
  • హిందుస్థాన్‌ జింక్‌లో ప్రొడక్షన్‌ 
  • డ్రిల్లింగ్‌ ఇన్‌చార్జిగా విధులు
  • ఎమ్మెల్సీ కవిత అభినందన

భూపాలపల్లి : దేశంలోనే తొలిసారిగా అండర్‌ గ్రౌండ్‌ మైనింగ్‌లో ఉద్యోగం సంపాదించిన యువతిగా భూపాలపల్లి జిల్లా కేంద్రానికి చెందిన రాసకట్ల సంధ్య రికార్డు సృష్టించారు. ఈ మేరకు అండర్‌ గ్రౌండ్‌ మైన్‌లో ఎన్‌సీఎంఎంసీ (సెకండ్‌ క్లాస్‌ మైన్‌ మేనేజ్‌మెంట్‌ కాంపిటెన్సీ) ధ్రువీకరణ పత్రాన్ని ఆమె పొందారు. ఆమె తండ్రి రఘు, సింగరేణి కార్మికుడు. బీటెక్‌ మైనింగ్‌ చదివిన సంధ్య, రాజస్థాన్‌ ఉదయ్‌పూర్‌లోని హిందుస్థాన్‌ జింక్‌ లిమిటెడ్‌ (వేదాంత) కంపెనీలో నిరుడు ప్రొడక్షన్‌ డ్రిల్లింగ్‌ ఇన్‌చార్జిగా విధుల్లో చేరారు.

మైనింగ్‌ కంపెనీలో ఏడాది కాలం పాటు మేనేజ్‌మెంట్‌ ట్రైనీగా పని చేసిన వారికి అండర్‌గ్రౌండ్‌లో పనిచేసేలా డైరెక్టర్‌ ఆఫ్‌ జనరల్‌ మైనింగ్‌ నుంచి ఎస్‌ఎంఎంసీ సర్టిఫికెట్‌ ను అందిస్తారు. ఇప్పటివరకు మైనింగ్‌ విభాగం లో పరిశోధకులుగా పనిచేసిన మహిళలు ఉన్న ప్పటికీ అండర్‌గ్రౌండ్‌ మైన్‌లో పనిచేస్తున్న తొలి మహిళగా సంధ్య గుర్తింపు పొందడం విశేషం.

భూపాలపల్లికి చెందిన సంధ్య  పురుషులకు ఏమాత్రం తీసిపోకుండా అండర్‌ గ్రౌండ్‌ వర్కిం గ్‌ అర్హత సాధించడం గర్వకారణమని సింగరేణి జీఎం నిరీక్షన్‌ రాజ్‌, డీజీఎం (పర్సనల్‌) మంచా ల శ్రీనివాసులు కొనియాడారు. సంధ్యను ట్విటర్‌ వేదికగా ఎమ్మెల్సీ కవిత అభినందించారు.

Courtesy Andhrajyothi