మానవీయ సేవలకు మరపురాని గుర్తింపు

న్యూఢిల్లీ/హైదరాబాద్‌ : లాక్‌డౌన్‌లో చిక్కుకుని విలవిల్లాడుతున్న ఎంతో మందికి ఆపన్న హస్తం అందించి.. వారి కళ్లల్లో ఆనందం నింపిన రియల్‌ హీరో సోనూ సూద్‌కు అరుదైన పురస్కారం లభించింది. ఆయన మానవతా దృక్పథానికి ఏకంగా ఐక్యరాజ్య సమితి(ఐరాస) సలాం చేసింది. ఐరాస అనుబంధ సంస్థ ఐక్యరాజ్య సమితి అభివృద్ధి ప్రోగ్రాం.. సోనూ సూద్‌కు స్పెషల్‌ హ్యూమానిటేరియన్‌ యాక్షన్‌ అవార్డును అందజేసింది. దీంతో ఈ అరుదైన అవార్డు అందుకున్న ఏంజెలీనా జోలీ, డేవిడ్‌ బెక్‌హాం, లియానార్డో డీ కాప్రికోల సరసన సోనూ చేరారు. వర్చువల్‌ విధానంలో నిర్వహించిన అవార్డుల ప్రదానోత్సవంలో పాల్గొన్న సోనూ ‘‘ఇది అరుదైన, గొప్ప గౌరవం. ఐరాస గుర్తింపు ప్రత్యేకమైనది. నేను చేసిన సాయం చాలా చిన్నదిగా భావిస్తున్నాను’’ అన్నారు. సోనూపై అభినందనల జల్లు కురుస్తోంది.

గ్రీన్‌ ఛాలెంజ్‌లో పాల్గొన్న సోనూ
రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్‌ కుమార్‌ ప్రారంభించిన గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ కార్యక్రమంలో సోనూ సూద్‌ పాల్గొన్నారు. సినీ దర్శకుడు శ్రీను వైట్ల ఇచ్చిన ఛాలెంజ్‌ను స్వీకరించి రామోజీ ఫిలిం సిటీలో మొక్కలు నాటారు. పర్యావరణ పరిరక్షణ ఆవశ్యకత పెరిగిందని,  మొక్కలు నాటి వాటిని పరిరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని సోనూ అన్నారు.

Courtesy Andhrajyothi