ఇరాన్‌లో కూలిన ఉక్రెయిన్‌ విమానం
టెహ్రాన్‌ నుంచి టేకాఫ్‌ అయిన కొద్ది సేపటికే కుప్పకూలిన బోయింగ్‌
విమానం కొత్తదన్న ఎయిర్‌లైన్స్‌
రెండ్రోజుల కిందటే తనిఖీ.. మిస్టరీగా మారిన ప్రమాదం
ఇరాన్‌ క్షిపణి దాడేనా?.. వదంతులు నమ్మొద్దన్న ఉక్రెయిన్‌
కూలిపోయిన బోయింగ్‌
737 విమానం బ్లాక్‌ బాక్సులను అమెరికాకు ఇచ్చే ప్రసక్తే లేదు. విమాన తయారీ సంస్థకు గానీ, అమెరికాకు గానీ ఇవ్వబోం. వాటిని ఏ దేశానికి పంపాలన్న నిర్ణయమూ తీసుకోలేదు.
ఇరాన్‌ పౌరవిమానయాన సంస్థ

టెహ్రాన్‌ఇరాన్‌లో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. ఉక్రెయిన్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌లైన్స్‌కు చెందిన బోయింగ్‌ 737 విమానం బుధవారం ఉదయం 6.10 గంటలకు టెహ్రాన్‌ అంతర్జాతీయ విమానాశ్రయం ఇమామ్‌ ఖొమేనీ నుంచి ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌కు బయల్దేరింది. టేకాఫ్‌ అయిన కొద్ది నిమిషాలకే విమానానికి రాడార్‌తో సంబంధాలు తెగిపోయాయి. అనంతరం టెహ్రాన్‌ విమానాశ్రయానికి 45 కిలోమీటర్ల దూరంలో ఖలాజ్‌ అబాద్‌ ప్రాంతంలోని పొలాల్లో కూలిపోయింది. విమానంలో మొత్తం 176 మంది ఉన్నారు. వీరిలో 167 మంది ప్రయాణికులు కాగా.. 9 మంది సిబ్బంది ఉన్నారని ఇరాన్‌ అధికారిక వార్తా సంస్థ తెలిపింది. ఈ ప్రమాదంలో అందరూ సజీవ దహనమయ్యారు. మృతుల్లో 15 మంది చిన్నారులు ఉన్నట్లు టెహ్రాన్‌ ప్రావిన్స్‌ గవర్నర్‌ మహ్మద్‌ తగిజాదే తెలిపారు. ఉక్రెయిన్‌ అధ్యక్షుడు వ్లాదిమిర్‌ జెలెన్‌స్కీ విమాన ప్రమాదాన్ని ధ్రువీకరించారు. మృతుల్లో 82 మంది ఇరాన్‌, 63 మంది కెనడా, 11 మంది ఉక్రెయిన్‌, 10 మంది స్వీడెన్‌, నలుగురు అఫ్గానిస్థాన్‌, ముగ్గురు జర్మనీ, ముగ్గురు బ్రిటన్‌ దేశస్థులు ఉన్నట్లు ఉక్రెయిన్‌ విదేశాంగ మంత్రి వాదిమ్‌ ప్రిస్టెకో ట్విటర్‌లో వెల్లడించారు.

సాంకేతిక లోపాల వల్లే విమానం కూలి ఉంటుందని ఇమామ్‌ ఖొమేనీ విమానాశ్రయ అధికారులు తెలిపారు. విమానం కూలిన వెంటనే మంటలు అంటుకున్నాయని స్థానిక మీడియా పేర్కొంది. కొన్ని వీడియోల్లో మాత్రం విమానం కూలే సమయంలోనే మంటలు అంటుకున్నట్లు కనిపించడం గమనార్హం. ఈ నేపథ్యంలో విమాన ప్రమాదం మిస్టరీగా మారింది. అమెరికా మిలిటరీ స్థావరాలపై ఇరాన్‌ క్షిపణి దాడులు చేసిందని, ఆ క్రమంలోనే పొరపాటున విమానాన్ని కూల్చి ఉంటారన్న ఊహాగానాలు వినిపించాయి. అయితే ఇలాంటి వదంతులను నమ్మొద్దని, విమాన ప్రమాదానికి కారణాలు ఇంకా తెలియరాలేదని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

ఘటనపై అప్పుడే ఎవరికి తోచినట్లుగా వారు నిర్ధారణకు రావొద్దన్నారు. ప్రమాదంపై బోయింగ్‌ సంస్థ కూడా దిగ్ర్భాంతి వ్యక్తం చేసింది. ప్రమాదానికి గురైన విమానం కొత్తదని, 2016లోనే దాన్ని తయారు చేశారని ఉక్రెయిన్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌లైన్స్‌ ప్రకటించింది. రెండు రోజుల క్రితమే విమానాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేశామని తెలిపింది. బుధవారం నుంచి టెహ్రాన్‌కు విమాన సర్వీసులను నిలిపివేస్తున్నట్లు వెల్లడించింది. రాడార్ల పరిధి నుంచి అదృశ్యమైన సమయంలో విమానం 2400 మీటర్ల ఎత్తులో ఉన్నట్లు తెలిపింది. విమానంలోని సిబ్బంది ఎంతో అనుభవజ్ఞులని పేర్కొంది.

బ్లాక్‌ బాక్సులు అమెరికాకు ఇవ్వం: ఇరాన్‌
కూలిపోయిన బోయింగ్‌ 737 విమానం బ్లాక్‌ బాక్సులను అమెరికాకు ఇచ్చే ప్రసక్తే లేదని ఇరాన్‌ పౌర విమానయాన సంస్థ స్పష్టం చేసింది. ‘‘విమాన తయారీ సంస్థకు గానీ, అమెరికాకు గానీ మేం బ్లాక్‌ బాక్సులు ఇవ్వం’’ అని సంస్థ చీఫ్‌ అలీ అబెద్జాద్‌ బుధవారం ప్రకటించారు. విచారణ కోసం బ్లాక్‌ బాక్సులను ఏ దేశానికి పంపాలన్నదానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు. అంతర్జాతీయ విమానయాన నిబంధనల ప్రకారం విమాన ప్రమాదం జరిగిన దేశానికే విచారణ జరిపే హక్కు ఉంటుందని అలీ చెప్పారు. విచారణ సమయంలో ఉక్రెయిన్‌ అధికారులు కూడా ఉండొచ్చని తెలిపారు.

(Courtesy Andhrajyothi)