లండన్‌: బ్రిటన్‌ ప్రభుత్వాధినేతలను కరోనా వైరస్‌ వణికిస్తోంది. ఇప్పటికే బ్రిటీషు యువరాజు చార్లెస్‌ కోవిడ్‌-19 బారిన పడగా తాజాగా ప్రధానమంత్రి, ఆరోగ్యశాఖ మంత్రి కూడా మహమ్మారి కోరల్లో చిక్కుకున్నారు. ప్రధాని బోరిస్‌ జాన్సన్‌కు కరోనా సోకినట్టు నిర్ధారణ కావడంతో 10 డౌనింగ్‌ స్ట్రీట్‌లో తన నివాసంలో స్వీయ నిర్బంధంలోకి వెళ్లిపోయారు. సాంకేతిక పరిజ్ఞానంతో ఇంటి నుంచే పరిపాలన సాగిస్తానని ఆయన ప్రకటించారు. ఈ మేరకు తన అధికారిక ట్విటర్‌ పేజీలో ఒక వీడియో షేర్‌ చేశారు.

‘కరోనా లక్షణాలు గురువారం నుంచి నాలో కనిపించాయి. తక్షణమే పరీక్షలు చేయించుకుంటే పాజిటివ్‌ అని తేలింది. ఏమాత్రం ఆలస్యం చేయకుండా నా గదిలోనే ఐసోలేషన్‌లోకి వెళ్లిపోయాను. దేశ ప్రధానిగా సాంకేతిక పరిజ్ఞానం వినియోగించి కరోనాపై తీసుకుంటున్న చర్యల్ని పర్యవేక్షిస్తాను. కరోనా వైరస్‌పై పోరాటం కొనసాగిస్తాం’ అని ఆయన వీడియోలో బోరిస్‌ జాన్సన్‌ పేర్కొన్నారు.

ఆరోగ్యశాఖ మంత్రి మట్‌ హన్‌కాక్‌ కూడా కోవిడ్‌ బారిన పడ్డారు. దీంతో ఆయన కూడా స్వీయ నిర్బంధంలోకి వెళ్లిపోయారు. ఇంటి నుంచే పని చేస్తానని ఆయన ప్రకటించారు. కాగా, బోరిస్‌ జాన్సన్‌ గత కొద్ది రోజులుగా తన మంతత్రివర్గ సహచరులతో వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో పలువురు మంత్రులకు కూడా వైరస్‌ సోకే అవకాశం ముందని అనుమానిస్తున్నారు.