ఇద్దరు యువతులపై అత్యాచారం, హత్య
హైదరాబాద్‌ శివారులో పశువైద్యురాలిపై కిరాతకం
హన్మకొండలో పుట్టిన రోజునాడే పంతొమ్మిదేళ్ల యువతిపై అఘాయిత్యం

జనారణ్యంలో ముసుగులు వేసుకుని తిరుగుతున్న మానవ మృగాలు.. ఉన్మాదంతో ఊగిపోతున్నాయి.. అమాయక ఆడపిల్లల ఉసురుతీసి ఊరేగుతున్నాయి.. పసి కూనలైనా.. పండు ముదుసలైనా వాటికి ఒకటే.. స్త్రీ ఒంటరిగా కనిపిస్తే చాలు కసితీరా కాటేస్తున్నాయి. ఎన్నడూ మహిళలన్నే చూడనట్లు ఆబగా చూసే కళ్లు.. అన్నెం పున్నెం ఎరుగని చిన్నారులు, మహిళలపై దాడిచేసి  దాహం తీర్చుకుంటున్నాయి. ఆరేళ్ల శరీరాలు నూరేళ్లు నిండిపోగా మార్చురీ గదుల్లో శవాలై పోతున్నాయి. చేవ చచ్చిన యంత్రాంగం శవాలకు పరీక్షలు చేసి పబ్బం గడిపేస్తోంది.

ఇటు హైదరాబాద్‌.. అటు వరంగల్‌.. తెలంగాణలో రెండు ముఖ్యమైన నగరాల్లో ఒకేరోజున దారుణాలు జరిగాయి. చారిత్రక నగరాలకు మచ్చతెచ్చే దురంతాలు చోటుచేసుకున్నాయి.. షీ టీమ్‌లు.. పెట్రోలింగ్‌లు.. ఎన్ని ఉన్నా ఆడపిల్లలపై అరాచకాలు జరుగుతూనే ఉన్నాయి. ఈ రెండు దురంతాల్లోనూ తలెత్తుతున్న ప్రశ్నలు ఎన్నో!

రాజధాని శివార్లలో రాక్షసత్వం
యువ పశు వైద్యురాలు ప్రియాంకరెడ్డి అపహరణ
అత్యాచారం.. ఆపై హత్య
అనంతరం తగలబెట్టిన దుండగులు
షాద్‌నగర్‌ సమీపంలో కాలిపోయిన మృతదేహం లభ్యం
స్కూటీ పంక్చరైందని సోదరికి ఫోన్‌
తరువాత స్విచ్ఛాఫ్‌ అయిన మొబైల్‌
పోలీసుల అదుపులో అనుమానితులు
న్యూస్‌టుడే  యంత్రాంగం

రాష్ట్ర రాజధాని శివార్లలో మరో వికృత కేళి వెలుగుచూసింది. ఒక యువ పశువైద్యురాలిని గుర్తు తెలియని దుండగులు అపహరించి.. ఆపై అత్యాచారానికి ఒడిగట్టి ఒళ్లు గగుర్పొడిచే రీతిలో దహనం చేసిన తీరు అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది. తన వాహనం పంక్చర్‌ అయిందని.. తనచుట్టూ అపరిచిత వ్యక్తులున్నారని.. వెంటాడుతున్నారని.. భయంగా ఉందని పశువైద్యురాలు తన సోదరితో ఫోన్‌లో  మాట్లాడిన తీరు హృదయం ద్రవింపచేసింది. అనంతరం గంటల వ్యవధిలో ఆమె విగతజీవిగా మారిన వైనం సంచలనం సృష్టించింది. మహబూబ్‌నగర్‌ జిల్లా నవాబుపేట్‌ మండలం కొల్లూరులో పశువైద్యురాలి (అసిస్టెంట్‌ వెటర్నరీ సర్జన్‌)గా విధులు నిర్వర్తిస్తున్న పోతుల ప్రియాంకరెడ్డి (26) బుధవారం రాత్రి శంషాబాద్‌లో కిడ్నాప్‌నకు గురయ్యారు. ఆమెను అపహరించిన ఆగంతకులు అత్యాచారం చేసి ఆపై దహనం చేశారు. షాద్‌నగర్‌ సమీపంలోని చటాన్‌పల్లి గ్రామ శివారు రోడ్డు వంతెన వద్ద గురువారం తెల్లవారుజామున పూర్తిగా కాలిపోయిన స్థితిలో ఆమె మృతదేహం కనిపించింది. ప్రియాంకను అత్యాచారం చేసి హతమార్చినట్లు దర్యాప్తులో వెలుగుచూసిన ప్రాథమిక వివరాల ప్రకారం ఓ పోలీసు అధికారి ధ్రువీకరించారు.

భయమేస్తోంది
నాగర్‌కర్నూల్‌ జిల్లా కొల్లాపూర్‌ నియోజకవర్గం కోడేరు మండలం నర్సాయపల్లికి చెందిన పోతుల శ్రీధర్‌రెడ్డి. ప్రస్తుతం విద్యాశాఖలో సీనియర్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నారు. ఈయన పెద్ద కుమార్తె ప్రియాంకరెడ్డి పశువైద్యురాలు. చిన్నకుమార్తె భవ్య శంషాబాద్‌ విమానాశ్రయంలో ఉద్యోగం చేస్తున్నారు. కొల్లూరులో బుధవారం మధ్యాహ్నం విధులు ముగించుకుని ప్రియాంక ఇంటికొచ్చారు. అనంతరం సాయంత్రం 5.50 గంటలకు గచ్చిబౌలిలో చర్మ సంబంధ వైద్యుడిని కలిసేందుకు స్కూటీపై బయలుదేరారు. తొండుపల్లి కూడలి సమీపంలో పార్కు చేసి వెళ్లారు. రాత్రి 9.22 గంటలకు వాహనం పంక్చర్‌ అయ్యిందంటూ సోదరి భవ్యకు ఫోన్‌ చేశారు. వద్దంటూ వారించినా ఇద్దరు పంక్చర్‌ వేయిస్తానంటూ వాహనం తీసుకెళ్లినట్లు వివరించారు. చుట్టూ లారీ డ్రైవర్లు ఉన్నారని, భయమేస్తోందని, ఏడుపొస్తోందంటూ వాపోయారు. స్కూటీ వచ్చేవరకు ఫోన్‌ మాట్లాడుతూనే ఉండాలని చెప్పిన భవ్య.. ఒక్కసారిగా ఫోన్‌ కట్‌ చేయడంతో ఆందోళనకు గురైంది. రాత్రి 9.44 గంటలకు ప్రియాంకకు సోదరి భవ్య ఫోన్‌ చేయగా ‘స్విచ్ఛాప్‌’ అని వచ్చింది. రాత్రి 10.20 గంటలకు స్కూటీని పార్కింగ్‌ చేసిన ప్రాంతానికి కుటుంబ సభ్యులు వెళ్లి చూస్తే ఆమె జాడ కనిపించలేదు. చుట్టుపక్కల వాకబు చేసినా ఫలితం లేకపోవడంతో బుధవారం అర్ధరాత్రి 12 గంటలకు శంషాబాద్‌ గ్రామీణ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తెల్లవారుజామున 3 గంటలకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. గురువారం తెల్లవారుజామున 5 నుంచి 5.30 గంటల మధ్యలో చటాన్‌పల్లికి చెందిన సత్యం పాలు తీసుకుని వెళ్తూ వంతెన కింద మంటను గమనించాడు. అనుమానం వచ్చి పరిశీలనగా చూడగా అక్కడ మనిషి చెయ్యి కనిపించింది. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. షాద్‌నగర్‌ ఏసీపీ సురేందర్‌, ఇన్‌స్పెక్టర్‌ శ్రీధర్‌కుమార్‌, డీఐ తిరుపతి ఘటనాస్థలికి చేరుకుని మంటల్లో కాలిపోయింది మహిళ అని నిర్ధారించారు.

ఈటీవీ తెలంగాణలో చూసి
షాద్‌నగర్‌ సమీపంలో కాలిపోయిన మృతదేహం లభ్యమైందంటూ ‘ఈటీవీ తెలంగాణ’లో తాజా సమాచారాన్ని చూసిన ప్రియాంక తండ్రి శ్రీధర్‌రెడ్డి అప్రమత్తమై శంషాబాద్‌ గ్రామీణ పోలీసులను ఆశ్రయించారు. ఉదయం 9.30- 10 గంటల సమయంలో తండ్రి శ్రీధర్‌రెడ్డి, సోదరి భవ్య ఘటనాస్థలికి చేరుకున్నారు. మెడలో గణపతి లాకెట్‌, బెల్టు, పక్కనే తలకు చుట్టుకునే చున్నీ తదితర వస్తువులను పరిశీలించి ఆ మృతదేహం ప్రియాంకదేనని గుర్తించారు. మధ్యాహ్నం ఒంటి గంటకు వైద్యులు చేరుకుని మృతదేహాన్ని పరీక్షించి సుమారు 10 గంటల కిందట చనిపోయిందని నిర్ధారించారు. లారీ డ్రైవర్లే అఘాయిత్యానికి పాల్పడి ఉంటారా? అత్యాచారానికి పాల్పడిన తర్వాతే హత్య చేశారా అనే కోణంలో దర్యాప్తు ప్రారంభించారు. సైబరాబాద్‌ కమిషనర్‌ వీసీ సజ్జనార్‌ ఘటనాస్థలిని పరిశీలించారు. శంషాబాద్‌ డీసీపీ ప్రకాశ్‌రెడ్డి ఆధ్వర్యంలో 10 ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. మృతదేహం పూర్తిగా కాలిపోవడంతో పోస్టుమార్టం నిర్వహించిన వైద్యులు ఆమెపై అత్యాచారం జరిగినట్లు స్పష్టంగా చెప్పలేకపోతున్నారు. స్కూటీ నిలిపిన వెనుక లోదుస్తులు, చెప్పులు, బ్యాగ్‌, గుర్తింపు కార్డు తదితర ప్రియాంకకు చెందిన వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. మద్యం సీసాలు లభ్యమయ్యాయి. అదే ప్రదేశంలో ఆమెపై అత్యాచారం చేసి.. తర్వాత హతమార్చి మృతదేహాన్ని షాద్‌నగర్‌ వైపు తీసుకెళ్లి ఉంటారని అంచనా వేస్తున్నారు. స్కూటీకి పంక్చర్‌ వేయిస్తానని ఇద్దరు వ్యక్తులు వచ్చారని ప్రియాంక తన సోదరికి చెప్పారు. వారే ఆమెను హతమార్చి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు.

ఆరితేరిన వారే..
ఇదిలా ఉంటే ప్రియాంక మృతదేహాన్ని చటాన్‌పల్లి సమీపంలోని వంతెన కింద పడేసి దహనం చేశారు. మృతదేహం దహనమైన తీరు పోలీసులను కూడా హతాశులను చేసింది. శరీర భాగాలు పూర్తిగా కాలిపోయాయి. మృతదేహంపై పెట్రోల్‌ పోసి మృతదేహం కాలిపోయేలా చేసి ఉంటారనేది నిపుణుల అంచనా. ప్రియాంక మృతదేహాన్ని జనసంచారం లేని వంతెన కింద పడేశారు. అర్ధరాత్రి సమయంలో మృతదేహాన్ని పడేసి, కాలబెట్టడానికి చోటు గుర్తించగలిగారంటే ఈ ప్రాంతంపై అవగాహన ఉన్నవారే ఘోరానికి ఒడిగట్టి ఉంటారని భావిస్తున్నారు.

ఆ ఐదు గంటలు నరకం
రాత్రి 9.40 ప్రాంతంలో ఆమె ఫోన్‌ స్విచ్ఛాఫ్‌ అయిన విషయం కుటుంబ సభ్యులు గమనించారు. అంటే అప్పుడే ఆమెను కిడ్నాప్‌ చేసి ఉండవచ్చు. ఫోరెన్సిక్‌ వైద్యుల అంచనా ప్రకారం రాత్రి మూడు గంటల సమయంలో ఆమె చనిపోయారు. అంటే కిడ్నాప్‌ అయినప్పటి నుంచీ చనిపోయే వరకూ మధ్యలో ఉన్న 5 గంటలపాటు ఆమె చిత్రహింసలు అనుభవించారన్నది నిర్వివాదాంశం. ప్రియాంక మృతదేహం తలపై చిన్న దెబ్బ ఉన్నట్లు గుర్తించారు. ఆమె మెడకు చున్నీ చుట్టి ఉన్న గొంతు పిసికి ఊపిరాడకుండా చేసి హతమార్చి ఉంటారని తెలుస్తోంది.

స్కూటీ లభ్యం
ప్రియాంక స్కూటీ ఘటనాస్థలికి 10 కిలోమీటర్ల దూరంలోని కొత్తూరు జాతీయ రహదారి దగ్గర లభ్యమైంది. వాహనాన్ని శంషాబాద్‌ గ్రామీణ పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. ఈ కేసుకు సంబంధించి ఇద్దరు అనుమానితుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ కేసును శంషాబాద్‌ డీసీపీ కార్యాలయంలో ఉండి సైబరాబాద్‌ కమిషనర్‌ సజ్జనార్‌ పర్యవేక్షిస్తున్నారు. శుక్రవారం ఈఘటన వివరాలను ప్రకటించే అవకాశం ఉంది.

విధులకు రానని చెప్పి అనంతలోకాలకు
మహబూబ్‌నగర్‌ జిల్లా నవాబుపేట మండలం కొల్లూరు పశువైద్య కేంద్రం వైద్యురాలు ప్రియాంక దారుణ హత్య ఉమ్మడి పాలమూరు జిల్లావ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ‘‘జిల్లా కేంద్రంలో గురువారం సమావేశం ఉంది.. నేను విధులకు రాను’’ అని బుధవారం అటెండర్‌కు చెప్పి వెళ్లిన ఆమె హత్యకు గురైన విషయం తెలిసి మండల పశువైద్య సిబ్బంది ఉలిక్కిపడ్డారు. 2017లో పశువైద్యురాలిగా కొల్లూరులో నియమితులైన ప్రియాంక విధులకు క్రమం తప్పకుండా హాజరై పశువైద్య సేవలు అందిస్తూ మంచి పేరు తెచ్చుకున్నారు. శంషాబాద్‌ నుంచి షాద్‌నగర్‌ వరకు ద్విచక్రవాహనంపై వచ్చి, అక్కడి నుంచి కొల్లూరుకు బస్సులో వెళ్లేవారు. బుధవారం మధ్యాహ్నం ఆమెను అటెండరు ద్విచక్రవాహనంపై కొల్లూరు గేటు వద్ద విడిచిపెట్టారు. ఈనేపథ్యంలో ఆమె దారుణ హత్యకు గురవ్వడం అటు నర్సాయపల్లిలో, ఇటు కొల్లాపూర్‌లో విషాదాన్ని నింపింది.

Courtesy Eenadu…